Renault Duster Hybrid Launch: భారత్ లో రెనాల్ట్ డస్టర్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త తరం డస్టర్ లో హైబ్రిడ్ వెర్షన్ మీద చాలాకాలంగా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఈ వెయిటింగ్‌కు తెరపడనుంది. 2026 అక్టోబర్ 17న డస్టర్ హైబ్రిడ్ ధరలను రెనాల్ట్ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో మార్కెట్లో ఉన్న డస్టర్ కు ఈ కొత్త పవర్ ట్రెయిన్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
డస్టర్ లోకి ఇప్పుడు సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎంట్రీ ఇవ్వనుంది. రెనాల్ట్ దీనిని E-Tech హైబ్రిడ్ సిస్టమ్ గా పిలుస్తోంది. 2026 ప్రొడక్షన్ సైకిల్ కు సంబంధించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పటికే అమ్ముడైపోవడంతో బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. ధర ప్రకటన తర్వాత ఈ వెర్షన్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రెనాల్ట్ డస్టర్ ICE వెర్షన్ల ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.69 లక్షల వరకు ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ, అదనపు ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ ప్యాక్ కారణంగా హైబ్రిడ్ వేరియంట్ ధర దీనికంటే సుమారు రూ.2 లక్షలు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా హైయర్ స్పెక్ వేరియంట్లలో ఈ పవర్ ట్రెయిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డస్టర్ హైబ్రిడ్‌లో 1.8 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌కు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జతకానున్నాయి. ఇందులో ఒకటి 20bhp సామర్థ్యంతో స్టార్టర్ జనరేటర్ గా పని చేస్తుంది. మరో 49bhp ట్రాక్షన్ మోటార్ నేరుగా చక్రాలకు శక్తిని అందిస్తుంది. వీటికి 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ మొత్తం సిస్టమ్ కలిపి 160bhp పవర్, 172Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మల్టీ మోడ్ క్లచ్ లెస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో ఇది రానుంది.
హైబ్రిడ్ డస్టర్ లో అసలు ఆకర్షణ ఇంధన పొదుపు. దీని మైలేజీ సుమారు 22 నుంచి 25kmpl మధ్య ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ ఎక్కువగా పనిచేస్తుంది. సిటీ డ్రైవింగ్ లో దాదాపు 80 శాతం వరకు EV మోడ్‌లో ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో రోజువారీ నగర ప్రయాణాలకు ఈ SUV మరింత సమర్థవంతంగా మారనుంది.
హైబ్రిడ్ వెర్షన్ బయట నుంచి చూస్తే సాధారణ డస్టర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. టెయిల్ గేట్ పై ఉండే ‘HYBRID’ బ్యాడ్జ్ ప్రధాన గుర్తింపుగా ఉంటుంది. సిగ్నేచర్ రెనాల్ట్ గ్రిల్, ఐబ్రో తరహా DRLలతో LED హెడ్‌ల్యాంప్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్ లాంటి డిజైన్ అంశాలు ఇందులో కొనసాగుతాయి.
క్యాబిన్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో గూగుల్ బిల్ట్ ఇన్, వైర్ లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉంటాయి. పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి టెక్నాలజీ ఫీచర్లు కూడా లభించనున్నాయి. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో డస్టర్ కు మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి మోడళ్ల నుంచి పోటీ ఉండనుంది. త్వరలో రానున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ హైబ్రిడ్ మోడళ్లతోనూ పోటీ పడే అవకాశం ఉంది. అక్టోబర్ 17న ధర వెల్లడైన తర్వాత డస్టర్ హైబ్రిడ్ మార్కెట్ పొజిషనింగ్‌పై పూర్తి క్లారిటీ రానుంది.
Read Also: మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!