Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ బైక్‌లను ఇష్టపడే వారికి త్వరలో మరో కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. హిమాలయన్ ఫ్యామిలీలో కొత్తగా హిమాలయన్ 440 చేరబోతోంది. ఈ బైక్ ను సెప్టెంబర్ 4న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను కంపెనీ D4G అనే కోడ్ నేమ్ తో పరీక్షలు జరపుతోంది. హిమాలయన్ 440 తక్కువ ధరలో అడ్వెంచర్ బైక్ కొనాలనుకునే రైడర్లను ఆకర్షించేలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
కొత్త హిమాలయన్ 440 ధర సుమారు రూ.2.50 లక్షలు ఎక్స్ షోరూమ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధరతో వస్తే ప్రస్తుత హిమాలయన్ 450 కంటే ఇది చాలా తక్కువ ధరలో లభించే మోడల్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం హిమాలయన్ 450 ధర రూ.3 లక్షలకు పైగా ఉంది. టాప్ వేరియంట్‌లో సుమారు రూ.3.40 లక్షల వరకు ఉంటుంది.
హిమాలయన్ 440లో స్క్రామ్ 440లో ఉపయోగిస్తున్న ఇంజిన్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 443cc సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఇంజిన్ సుమారు 25.4 హెచ్‌పీ పవర్, 34 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హిమాలయన్ 411తో పోలిస్తే పవర్, టార్క్ రెండింటిలో కాస్త పెరుగుదల ఉంటుంది. అలాగే స్క్రామ్ 440లో ఉన్న 6 స్పీడ్ గేర్‌బాక్స్ ను కూడా కొత్త మోడల్‌లో కొనసాగించే అవకాశం ఉంది.
హిమాలయన్ 440ను కేవలం రోడ్డుపై ప్రయాణించడానికి మాత్రమే కాకుండా ఆఫ్ రోడ్ రైడింగ్ కు కూడా ఉపయోగపడేలా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ ఉండొచ్చు. అలాగే 21 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ వీల్ ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ పర్పస్ టైర్లతో ఈ సెటప్‌ను అందిస్తే కచ్చా రోడ్లు, ట్రైల్స్ పై బైక్‌ను ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440ను పాత హిమాలయన్ 411 మాదిరిగానే ఉండనుంది. అయితే కొత్త రంగులు, చిన్న డిజైన్ మార్పులు కనిపించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే స్విచ్చబుల్ ఏబీఎస్, ట్రిప్పర్ నావిగేషన్ లాంటి సదుపాయాలు ఉండొచ్చని సమాచారం. అయితే, హిమాలయన్ 450లో ఉన్న అన్ని అధునాతన ఫీచర్లను ఇందులో ఇవ్వకుండా, అవసరమైన ఫీచర్లకే కంపెనీ పరిమితం కావచ్చు. స్క్రామ్ 440 ఆధారిత ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, పెద్ద ఫ్రంట్ వీల్, ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ తో హిమాలయన్ 440కి ప్రత్యేకమైన స్థానం కల్పించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
Read Also: 145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!