New Tata Aeris Sedan: టాటా మోటార్స్ తన కార్ల లైనప్ ను అప్ డేట్ చేస్తోంది. న్యూ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో సూపర్ మోడళ్లను తీసుకొస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు కాంపాక్ట్ సెడాన్ విభాగం మీద గట్టి ఫోకస్ పెట్టింది. టాటా టిగోర్ ప్లేస్ లో కొత్త సెడాన్ ను తీసుకురాబోతోంది. దానికి టాటా ఏరిస్ అనే పేరును ఫైనలైజ్ చేసింది. ఫెస్టివల్ సీజన్ కు ముందే ఈ కారును మార్కెట్ లోకి తీసుకరానుంది.
టిగోర్ కు కొనసాగింపుగా కాకుండా, కొత్త గుర్తింపుతో ఏరిస్‌ను తీసుకురావాలని టాటా నిర్ణయించింది. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ లాంటి కార్లకు పోటీగా దీనిని మార్కెట్ కు పరిచయం చేయనుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఏరిస్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా తీసుకురానుంది. అయితే, దీనిపై టాటా మోటార్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పేటెంట్ డిజైన్లను పరిశీలిస్తే, ఏరిస్ లో ముందు భాగంలో సన్నని గ్రిల్, కొత్త బంపర్, పెద్ద హెడ్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. సైడ్ ప్రొఫైల్ లో ఇది సాధారణ త్రీ బాక్స్ సెడాన్ కంటే కొంత స్పోర్టీగా కనిపించే నాచ్ బ్యాక్ తరహా డిజైన్ ను కలిగి ఉన్నట్లు అర్థం అవుతోంది. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. బ్యాక్ సైడ్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్, పెద్ద AERIS బ్యాడ్జింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇంటీరియర్ విషయంలో టాటా అదిరిపోయే ప్రీమియం టచ్ ఇవ్వనుంది. డ్యాష్ బోర్డ్ లో క్లీన్ లేఅవుట్, రెండు ఫ్రీ స్టాండింగ్ స్క్రీన్‌లు ఉండొచ్చని తెలుస్తోంది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి సదుపాయాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
భద్రత విషయంలో ఏరిస్ లో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే, పూర్తి సేఫ్టీ ప్యాకేజీకి సంబంధించి అధికారిక వివరాలు విడుదలైన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ కారు ఇంజిన్ 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్‌కు సీఎన్‌జీ ఆప్షన్ కూడా రావచ్చని తెలుస్తోంది.
టాటా ఏరిస్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ధరతో వస్తే డిజైర్, ఆరా, అమేజ్ లాంటి కాంపాక్ట్ సెడాన్లతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంటుంది.
Read Also: థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!