Tata Nano Return As an EV: ఒకప్పుడు పేదవాడి కారుగా గుర్తింపు పొందిన నానో.. ఆ తర్వాత ఉత్పత్తి ఆగిపోయింది. కొనుగోలుదారుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ రాకపోవడంతో తయారీ నిలిపివేశారు. అయినప్పటికీ, దీని పేరు ఇప్పటికీ భారతీయ కార్ల అభిమానుల్లో వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో తరచూ నానో కొత్త రూపంలో వస్తోందంటూ ఫొటోలు, AI డిజైన్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ చేసిన కామెంట్స్ తో నానో రీఎంట్రీపై మరోసారి ఆసక్తి పెరిగింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాటా నానోను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందా? అని టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. నానోను మళ్లీ ప్రపంచానికి పరిచయం చేయడం తనకు ఆనందంగా ఉంటుందన్నారు. ఆ కారు ఎలక్ట్రిక్ రూపంలో రావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, నానో EV తయారీ గురించి టాటా మోటార్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఆయన కామెంట్స్ కంపెనీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనగా భావించకూడదు.
టాటా నానో 2009లో భారత మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరలో కారు అందించాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. అయితే, మార్కెట్లో నానోను కేవలం చౌకైన కారుగా చూడటం దాని విజయానికి కొంత అడ్డంకిగా మారింది. చాలా మంది వినియోగదారులు కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి పెద్ద హ్యాచ్ బ్యాక్ కొనడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. చిన్న సైజు, నగర ప్రయాణాలకు సరిపోయే వాహనాలను కూడా వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుగా నానో తిరిగి వస్తే మంచి స్పందన లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ ఇప్పటికే కీలక స్థానంలో ఉంది. టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV, హారియర్ EV, సియెర్రా EV లాంటి మోడళ్లతో కంపెనీ EV మార్కెట్లో తన సత్తా చాటుతోంది. అయితే మరింత తక్కువ ధరలో చిన్న ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వస్తే టాటాకు మరింత మేలు కలిగే అవకాశం ఉంటుంది. తొలిసారి కారు కొనేవారు, బైక్ నుంచి కారుకు మారాలనుకునేవారు, సిటీలో రెండో కారును కోరుకునే కుటుంబాలను ఈ మోడల్ ఆకట్టుకునే అవకాశం ఉంది.
టాటా భవిష్యత్తులో నానోను తిరిగి తీసుకురావాలని నిర్ణయిస్తే, పాత మోడల్‌ను యథాతథంగా తీసుకురావడం కష్టం. ప్రస్తుత భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా కొత్త డిజైన్, మెరుగైన భద్రత, ఆధునిక ఫీచర్లతో తీసుకురానుంది. అలాగే ప్రస్తుత బ్యాటరీ టెక్నాలజీతో చిన్న సైజులోనే మంచి రేంజ్ అందించే అవకాశం ఉంది. సిటీ ప్రయాణాలకు సరిపోయేలా సుమారు 200 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ రేంజ్‌తో నానో EV వస్తే వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
Read Also: భారత్ లో ఈవీల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయా?