Upcoming Electric Scooters 2026: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ రన్నింగ్ కాస్ట్ చాలామందిని ఈవీల వైపు ఆకర్షిస్తోంది. దీంతో ప్రముఖ టూ వీలర్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 2026 చివరి నెలల్లో పలు కీలక మోడళ్లు కనిపించే అవకాశం ఉంది.
TVS ఇప్పటికే iQube ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు ఇదే ప్లాట్ ఫామ్‌ను మరింత విస్తరించే దిశగా కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ eFX ఆధారంగా అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్లు రానున్నట్లు తెలుస్తోంది. 2026 అక్టోబర్ నాటికి, ఆ తర్వాత వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొత్త డిజైన్, మెరుగైన టెక్నాలజీతో పాటు రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా వీటిని తీసుకురావచ్చని భావిస్తున్నారు.
ఇండియన్ స్కూటర్ మార్కెట్లో యాక్టివా పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో హోండా నుంచి వచ్చే నెక్ట్స్ జెనరేషన్ యాక్టివా 7Gపై కూడా ఆసక్తి నెలకొంది. 2026 అక్టోబర్ సమయంలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండొచ్చని అంచనా. అయితే ఇది పెట్రోల్, హైబ్రిడ్, పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ప్రీమియం స్కూటర్ విభాగంలో ఇప్పటికే బర్గ్ మన్ పేరుతో గుర్తింపు తెచ్చుకున్న సుజుకి, ఎలక్ట్రిక్ రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. బర్గ్ మన్ ఎలక్ట్రిక్ 2026 చివరి నెలల్లో పరిచయం కావచ్చని అంచనాలు ఉన్నాయి. దీని ధర సుమారు రూ.1.05 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రీమియం డిజైన్‌తో పాటు మెరుగైన రేంజ్, స్మార్ట్ ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కూడా భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తన ఉనికిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. 2026 సెకెండాఫ్ లో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కొత్త మోడళ్ల ద్వారా విన్‌ఫాస్ట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నించవచ్చు.
2026 చివర్లో రానున్న ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్లలో రేంజ్ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. సాధారణ IDC పరీక్షల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 నుంచి 165 కిలోమీటర్ల వరకు ప్రయాణించే మోడళ్లు రావచ్చని అంచనా. అదే సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ విషయంలోనూ కంపెనీలు కొత్త సౌకర్యాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో నివసించే వారికి ఉపయోగపడేలా రిమూవబుల్ బ్యాటరీలు, వేగంగా ఛార్జ్ అయ్యే టెక్నాలజీ లాంటి ఫీచర్లు కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ల రాకతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: 259 కిమీ రేంజ్ తో నిస్సాన్ కొత్త EV.. చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు!