Cyclone Rains: తుఫాను వర్షం ఒకే వాన.. కానీ రైతన్నల కష్టాలు మాత్రం వేరు.. వర్షం కోసం ఎదురుచూసిన వరి రైతులకు ఈ వాన ప్రాణం పోస్తే చేతికొచ్చిన మొక్కజొన్న, పూత–పిందె దశలో ఉన్న పత్తి రైతులకు మాత్రం కన్నీళ్లను మిగిల్చింది. సాలూరు, పాచిపెంట ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి ఇదే!
మూడు రోజులుగా కురుస్తున్న తుఫాను వర్షాలతో సాలూరు మండలంలోని పంట పొలాలు నీటితో నిండిపోయాయి. వర్షాలు లేక నారుమళ్లు ఎండిపోయే దశకు చేరిన వరి రైతులకు మాత్రం ఈ వాన ఊరటనిచ్చింది. చెరువులు, పొలాల్లోకి నీరు చేరడంతో దమ్ము పనులు ముమ్మరమయ్యాయి. కానీ మరోవైపు చేతికొచ్చిన మొక్కజొన్న రైతన్నకు వాన పిడుగులా మారింది. కోతకు సిద్ధమైన సుమారు 50 నుంచి 60 ఎకరాల మొక్కజొన్న కంకులు తడిసి ముద్దయ్యాయి. తేమకు గింజలు నల్లబడటమే కాకుండా బూజుపట్టి మొలకలు వస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
Also read: రోడ్డు పక్కన వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ 10 సెకన్ల ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు
ఇక పత్తి పరిస్థితి మరింత ఆందోళనకరం. పూత, పిందె, కాయ దశలో ఉన్న పంటపై వర్షం ప్రభావం పడింది. పగిలిన పత్తి కాయలు తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పొలాల్లో నీరు నిలవడంతో వేరుకుళ్లు తెగులు భయం వెంటాడుతోంది. పంటను కాపాడుకునేందుకు ఎరువులు, మందులు అవసరమైన సమయంలో ప్రభుత్వ ఎరువుల యాప్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కౌలు రైతులు చెబుతున్నారు. భూయజమానుల పత్రాలు, ఓటీపీ సమస్యలతో సబ్సిడీ ఎరువులు దొరకక బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి రైతులకు ప్రాణం పోసిన తుఫాను వర్షం మొక్కజొన్న, పత్తి రైతుల కళ్లల్లో మాత్రం కన్నీళ్లు మిగిల్చింది. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also read: బిగ్ బాస్ హౌస్ లోకి అపూర్వ.. మరో కొత్త లవ్ ట్రాక్ షురూ!