AP CM Progress Report: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చెత్తను నూరు శాతం తొలగిస్తామన్నారు ఆయన. ఈ కార్యక్రమాన్ని 15 నెలలుగా నిర్వహిస్తున్నామని.. ఈసారి జలధార-జల హారతి థీమ్‌తో ముందుకొచ్చామన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చేశారని ఆరోపించారు సీఎం. 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, లక్ష సోక్ పిట్స్, 8వేల కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అంతకుముందు మలకోడు సరస్సు పరిశీలించి దాని పునరుద్ధరణ వాకింగ్ ట్రాక్ ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. వాటర్ హైసింథ్ సాయంతో తయారు చేసే కంపోస్టింగ్ ప్రక్రియను రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులు నాచుతో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో నిర్వహించిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో జాతికి విద్రోహం చేశారని.. మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రోజు దేశ చరిత్రలో బ్లాక్ డే అన్నారు. ఇది ఇక్కడితో ఆగదన్నారు ఆయన.
రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పెంచేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు రెండో విడత భూసమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన రైతులతో భేటీ అయ్యారు. రైతులతో అర్ధరాత్రి వరకు సమావేశం కొనసాగగా.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. వార్షిక కౌలు పెంచేందుకు అంగీకరించారు. ఎకరానికి 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని, ఏడాదికి 3 వేలు చొప్పున కౌలు పెంచుతామన్నారు. కుటుంబానికి 1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని సీఎం వివరించారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు చేరుకోవడానికి పటిష్ట కార్యాచరణ చేపట్టాలని.. మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్త ప్రాసెసింగ్ నూటికి నూరు శాతం జరగాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, నెట్ జీరో, గ్రీనరీ పెంపు, క్లీన్-హైజీన్ కిచెన్ వంటి అంశాలపై సీఎం మార్గదర్శకాలు జారీ చేశారు.
దేవాదాయ శాఖ సంబంధిత అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే రెండేళ్ళలో పూర్తి చేయాలని ఆదేశించారు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని… మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలన్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని సీఎం ఆదేశించారు.
ఆర్ధిక శాఖ సంబంధిత అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయని, రెవెన్యూ లోటు భారీగా ఉందని.. వాటిని అధిగమిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. శాఖల కార్యదర్శులు వారి పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, ముఖ్యమైన వాటిని గుర్తించాలని, నిధుల కేటాయింపులో వాటికి తొలి ప్రాధాన్యమివ్వాలని నిర్దేశించారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులున్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, గత పాలకుల నిర్ణయాల వల్ల తలెత్తిన 4,600 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండారెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఏపీలో ప్రారంభమైంది. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎం కు వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్‌లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు. ఆకలి లేని సమాజమే అసలైన అభివృద్ధికి నిదర్శనం.. పేదవాడి కడుపు నిండని ప్రగతికి అర్థం లేదు అన్నారాయన. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం విస్తరించింది.రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.దీనితో రాష్ట్రంలో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరుకుంది. గత 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 243 కోట్ల సబ్సిడీ ఖర్చు చేసిందన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై సమీక్ష చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాల్వల ద్వారా తరలించి.. వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కాల్వలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని చెప్పారు.
దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం
దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీ సీఎం ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు.
స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని… వసతుల కల్పనపై ఒక్క ఫిర్యాదూ రాకూడదన్నారు. ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కేంద్ర ఉక్కు గనుల శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల మంజూరు సులభతరంపై చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని సీఎం సూచించారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యమివ్వాలని, అటవీ చట్టాలను వీలైనంత మేరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపునకు తీసుకురావాలన్నారు. డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను తాము వినియోగిస్తున్నామని సీఎం కేంద్ర బృందానికి వివరించారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం, నిబంధనలను సడలించే విషయంలో రాష్ట్రం చాలా ముందుందని కేంద్ర బృందం ప్రశంసించింది.
Also Read: తెలంగాణపై విషం చిమ్మితే సహించం.. బీజేపీకి కాంగ్రెస్ నేతల హెచ్చరిక!