Sunil Bansal: స్వేచ్ఛ బ్యూరో: ఎన్నికల వ్యూహాల్లో తనదైన ముద్ర వేసిన బీజేపీ నేత సునీల్ బన్సల్‌కు తెలంగాణలో మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఆయనను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు, పార్టీ సంస్థాగత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న బన్సల్‌కు మరోసారి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సునీల్ బన్సల్‌కు ఎన్నికల వ్యూహాలు, సంస్థాగత నిర్మాణంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన ఆయన.. అక్కడ బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు. అనంతరం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు సంబంధించిన బాధ్యతలను నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల వ్యూహాలు, సంస్థాగత వ్యవహారాల్లో బన్సల్ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న నేతగా బీజేపీ అధిష్ఠానం ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.
అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి పరిస్థితి కొంత భిన్నంగా కనిపించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ బన్సల్‌కు బాధ్యతలు అప్పగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన విస్తృతంగా పర్యటించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.
దీంతో తెలంగాణలో బన్సల్ వ్యూహాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. అప్పటి నుంచి ఆయన తెలంగాణలో పర్యటించిన దాఖలాలు కూడా చాలా తక్కువే. ఆపై ఆయనకు హైకమాండ్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించడంతో పూర్తిగా ఆ రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఆయన ఆ రాష్ట్రాల్లోనే పరిమితమయ్యేందుకు తెలంగాణలోని కొందరు నేతల వ్యవహార శైలి కూడా ఒక కారణమని ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు.
Also read: మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. తెలంగాణలో ఆ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీకి ఓటు బేస్ పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమితమైన ఫలితాలు వచ్చినప్పటికీ, ఏడాది వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ప్రదర్శన చేయడం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీకి ఉన్న అవకాశాలను మరింత విస్తరించేందుకు బన్సల్ అనుభవాన్ని మరోసారి వినియోగించుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన రాజకీయ ఊపును క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా మార్చడం సునీల్ బన్సల్ ముందున్న ప్రధాన సవాల్. తెలంగాణలో బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకే స్థాయిలో సంస్థాగత బలం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని తయారు చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే నాయకులు, కార్యకర్తలను పార్టీ నిర్మాణంలో సమర్థంగా ఉపయోగించుకోవడం కూడా బన్సల్‌కు కీలక బాధ్యతగా మారనుంది.
అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో అంతర్గత సమన్వయం బన్సల్‌కు మరో సవాలు. రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నేతలు, జిల్లా స్థాయి నాయకత్వం, క్షేత్రస్థాయి క్యాడర్ మధ్య సమన్వయాన్ని పెంచుతూ పార్టీని ఒకే దిశలో నడిపించాల్సి ఉంటుంది. గతంలో మూడు రాష్ట్రాల బాధ్యతలను ఒకేసారి నిర్వహించిన బన్సల్‌కు ఇప్పుడు తెలంగాణపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లభించింది. దీంతో గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఆయనపై ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ విస్తరణకు పనిచేసిన అనుభవం ఉన్న బన్సల్.. తెలంగాణ రాజకీయాలకు ఎంతవరకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడి రాజకీయ సమీకరణాలు, సామాజిక పరిస్థితులు తెలంగాణకు భిన్నమైనవే. అందుకే గత వ్యూహాలను యథాతథంగా అమలు చేయకుండా తెలంగాణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు బన్సల్ వ్యూహానికి తొలి పరీక్షగా నిలవనున్నాయి. బన్సల్ తెలంగాణలో ఎలాంటి పాచికలు వేస్తారు? అవి ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో ఎంతవరకు ఫలిస్తాయన్నది రాబోయే ఎన్నికలతో తేలనుంది.
Also read: మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!