CBSE Security: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన CBSE పోర్టల్ సెక్యూరిటీని బద్దలు కొట్టాడు. అంతా డొల్లే అని నిరూపించాడు. 12వ తరగతి పరీక్షలు రాసిన 18 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. డిజిటల్ ఇండియా యుగంలో CBSE ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద స్కామ్ ఆరోపణలకు ఎలా దారితీసింది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బెంగాల్‌కు చెందిన నిసర్గ అధికారి అనే 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ CBSE కొత్త డిజిటల్ వాల్యుయేషన్ పోర్టల్‌ను పరిశీలించాడు. సిస్టమ్ కోడ్‌లో డెవలపర్లు వదిలేసిన లూప్ హోల్స్ సహాయంతో సైట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎలాంటి లాగిన్ వివరాలు లేకుండానే ఇంటర్నెట్‌లో ఎవరైనా విద్యార్థుల ఆన్సర్ షీట్లను, మార్కులను చూసేలా, మార్చేసేలా 45కు పైగా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని సాక్ష్యాలతో బయటపెట్టాడు. CBSE పేపర్ వాల్యుయేషన్ కోసం ఉపయోగించిన పోర్టల్ ఇంటర్నెట్‌లో ఎవరికైనా కనిపించేలా పబ్లిక్‌గా అందుబాటులో ఉంది. నిసర్గ ఆ వెబ్‌సైట్ బ్యాకెండ్ సోర్స్ కోడ్‌ను, జావాస్క్రిప్ట్ బండిల్స్‌ను విశ్లేషించాడు. సిస్టమ్ లోపల డెవలపర్లు సేఫ్టీ రూల్స్ పాటించకుండా హార్డ్-కోడెడ్ మాస్టర్ పాస్‌వర్డ్ ను అలాగే వదిలేశారని అతడు గుర్తించాడు. దీని ఆధారంగా సిస్టమ్‌లోకి సులభంగా చొరబడ్డాడు. పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు, ప్రశ్నపత్రాలు భద్రపరిచిన AWS బకెట్ కాన్ఫిగరేషన్ చాలా బలహీనంగా ఉందని గుర్తించాడు. ఎలాంటి అథెంటికేషన్ లేకుండానే డైరెక్ట్ లింక్స్ ద్వారా డేటాను యాక్సెస్ చేశాడు.
అటు ఎగ్జామినర్లు లాగిన్ అవ్వడానికి ఉండాల్సిన OTP సెక్యూరిటీని చాలా సులభంగా బైపాస్ చేయవచ్చని, ఎవరి ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అవసరం లేకుండానే పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయవచ్చని చూపించాడు. మార్కులను మార్చేయవచ్చని, ఇలాంటి ప్రైవసీ ల్యాప్సెస్ ను 45కు పైగా బ్లాగ్ పోస్ట్ రాయడంతో ఒక్కసారిగా CBSEలో పెద్ద బాంబు పేలినట్లైంది. దీనిపై CBSE వివరణ ఇస్తూ.. అది కేవలం నమూనా సైట్ అని చెప్తూ ప్రెస్ నోట్‌లో ఒక తప్పుడు డొమైన్ పేరు రాసింది. ఇంకేముంది.. నిసర్గ ఫ్రెండ్స్ కాస్తా ఆ డొమైన్‌ను కేవలం 99 రూపాయలకే కొనేసి, దాన్ని నేరుగా నిసర్గ హ్యాకింగ్ బ్లాగ్‌కే లింక్ చేశారు. దాంతో బోర్డు తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ సందర్భంగా నిసర్గ చెప్పిందేటంటే.. అతడు కూడా 12వ తరగతి పరీక్షలు రాశాడు. అయితే తాను కేవలం ఎథికల్ హ్యాకర్‌గా లోపాలను మాత్రమే హైలైట్ చేశానని, తన సొంత మార్కులను మార్చుకోవాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని, బోర్డు పరీక్షల డిజిటల్ సేఫ్టీ ఎంత వీక్ గా ఉందో నిరూపించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు.
మ్యాటర్ ఇక్కడితో ఇక్కడితో ఆగలేదు. ప్రతిపక్షాలు, విద్యార్థులు చేస్తున్న ఆరోపణల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రొఫెషనల్ రోబోటిక్ హై రెజల్యూషన్ స్కానర్లకు బదులుగా, సాధారణ మొబైల్ ఫోన్ స్కానర్లతో ఆన్సర్ షీట్లను ఫోటోలు తీసి అప్‌లోడ్ చేశారంటున్నారు. దీంతో స్టూడెంట్స్ కు అందిన డిజిటల్ కాపీలలో పేజీలు చాలా బ్లర్ గా వచ్చాయి. కొన్ని పేజీలైతే అసలు కనిపించకుండా గల్లంతయ్యాయి. సరిగ్గా రాయలేదంటూ వేలాది మంది టాలెంటెడ్ స్టూడెంట్స్‌కు సింగిల్ డిజిట్ మార్కులు పడ్డాయ్. కొందరి ఆన్సర్ పేపర్ కు వారి చేతిరాతకు సంబంధం లేకుండా పోయింది. అంటే హాల్ టిక్కెట్ నెంబర్ వేరే పేపర్లకు ట్యాగ్ అవడం కూడా కనిపించింది. తవ్వితే ఒక్కటి కాదు.. పెద్ద ఎత్తున కంప్లైంట్లు.
అసలు ఈ డిజిటల్ మార్కింగ్ కాంట్రాక్టును ఎవరికి ఇచ్చారో తెలుసా? హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యుటెక్ అనే సంస్థకు. ఇక్కడే ఒక పెద్ద పొలిటికల్ లింక్ ఉంది. 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం సృష్టించి, 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందనే ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబరేనా సంస్థే.. పేరు మార్చుకుని కోఎంప్ట్ గా మారింది. అప్పుడు కూడా టాప్ స్టూడెంట్లకు మెమోల్లో సున్నా మార్కులు వేశారు. రీవాల్యుయేషన్ కంటే ముందే.. తమకు ఇన్నే వచ్చాయా అని టీనేజర్లైన పిల్లలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంత దారుణమిది? అసలు ఈ కోఎంప్ట్ కోసం మే నెలలో ఇచ్చిన అసలు టెండర్ నిబంధనలను, ఆగస్టు నాటికి సడలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయ్. దీనిపైనా ఇప్పుడు దర్యాప్తు నడుస్తోంది. అసలు రూల్స్ ఎవరు సడలించారు? ఎందుకు మార్చారు? ఏం జరిగింది అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది.
ఈ ఎపిసోడ్ పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి నుంచి తన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. తాజాగా సీబీఎస్ఈలో మరిన్ని లోపాలు బయటపడడంతో xలో విద్యాశాఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేబుదొంగల పట్ల జాగ్రత్త – ఈరోజు వారు CBSE లోపల కూర్చున్నారని ట్వీట్ చేశారు. తప్పులు బోర్డు చేసి.. మార్కులు తక్కువ వేసి.. మళ్లీ రీ వ్యాల్యూయేషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి 2 వేల రూపాయల వరకు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు.
Also Read: మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!
ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం తేవాలనుకోవడం తప్పు కాదు. కానీ దీన్ని తొలిసారి ప్రవేశపెడుతున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్. ఇప్పటికే వివిధ ఎంట్రెన్సులు కంప్లీట్ అయి అడ్మిషన్ల వ్యవహారం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఇంకా పేపర్ రీ వాల్యుయేషన్ అంటూ సీబీఎస్ ఈ 12వ తరగతి విద్యార్థులు తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. టెండర్లు ఖరారు చేశాం. పారదర్శకంగా కంపెనీకి అప్పగించాం. మన పని అయిపోయింది.. అంతా ప్రైవేట్ వాళ్లే చూసుకుంటారు.. ఇక మనకు సంబంధం లేదు అనుకుంటే ఇదిగో ఇప్పటి మాదిరిగానే ఉంటుంది సిచ్యువేషన్. విప్లవాత్మక మార్పు చేస్తున్నప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. కానీ ఇప్పుడు జరిగిన తప్పులతో కోఎంప్ట్ ఎడ్యుటెక్ కు ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం అప్పగించడం పెద్ద దుమారమే రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్ద కాలంగా OSM సాంకేతికతను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఎంతో సక్సెస్ అయింది. కానీ మన దగ్గర ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వల్ల లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయ్. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో ఈ osm విధానం అమలులో ఉంది. అయితే అక్కడ ఈ విధానం సక్సెస్ కావడానికి కారణం హై రిజల్యూషన్ కమర్షియల్ స్కానర్లను వాడటం. డేటా సర్వర్లను అత్యంత సురక్షితంగా నిర్వహించడం. ఇండియా ప్రస్తుతం CBSE విషయంలో వివాదం తలెత్తడానికి కారణం టెక్నాలజీ తప్పు కాదని, దానిని అమలు చేసిన వెండర్ లోపాలేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ వివాదం రాక ముందు వరకూ OSM కోసం కోఎంప్ట్ కు పద్ధతి ప్రకారమే కాంట్రాక్ట్ దక్కిందని చెబుతూ వచ్చారు. కానీ ఆన్సర్ పేపర్ల స్కానింగ్ లో లోపాలు బయటపడడం, బ్లర్ గా రావడంతో లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయ్. తప్పు చేయడం బుకాయించడం ఇదో కామన్ సబ్జెక్ట్ గా మారిందని రాహుల్ గాంధీ లాంటి నాయకులు విమర్శిస్తున్నారు. అటు ఆన్ స్క్రీన్ మార్కింగ్ తప్పిదాలతో సీబీఎస్‌ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాను జూన్ 2న కేంద్రం ట్రాన్స్ ఫర్ చేసింది. వారి స్థానంలో సీబీఎస్‌ఈ కొత్త ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంను, కార్యదర్శిగా మరో సీనియర్ ఐఐఎస్ అధికారి వరుణ్ భరద్వాజ్‌లను నియమించింది.
Also Read: విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!
అసలు OSM విధానం కోసం కోఎంప్ట్ ఎడ్యుటెక్ లు ఎవరు ఎంపిక చేశారు.. ఎలా ఎంపిక చేశారు.. వారి కోసం రూల్స్ ఏమైనా మార్చారా.. ఇవన్నీ తేల్చేందుకు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సర్వీస్ ఇచ్చిన సంస్థ ఎంపికలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీని కేంద్రం నియమించింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు అసలే సీబీఎస్ఈ పోర్టల్ చాలా బలహీనంగా ఉంది. హ్యాక్ అయ్యేలా వీక్ గా ఉంది. ఇదే సమయంలో పిల్లలు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా సమస్యలు వచ్చాయి. పేమెంట్ గేట్ వేల దగ్గర ఫీజులు భారీగా చూపించింది. అసలు చాలా మంది ప్రాసెస్ ముందుకు కూడా వెళ్లలేదు.
రీ వాల్యుయేషన్ దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 2న పోర్టల్ తిరిగి తెరుచుకుంది. ఆ వెంటనే దానిపై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పని చేయడం ప్రారంభించిన పోర్టల్‌పై డినయల్ ఆఫ్ సర్వీస్ మాల్‌వేర్ సాయంతో సైబర్ ఎటాక్ ప్రయత్నం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి దాదాపు 15 లక్షల దాకా ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ సృష్టించినట్టు తెలిపింది. ఫైళ్లలోకి అనధికారికంగా ప్రవేశించడానికి లక్షకుపైగా సైబర్‌దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తమ సిస్టమ్ గుర్తించిందన్నది. అయితే ఆ దాడుల్ని తట్టుకుని పోర్టల్ సక్సెస్ ఫుల్ గా పని చేస్తోందని, ఇందులో ఒకేసారి 8వేల మంది యూజర్లకు సేవలందిస్తోందని చెప్పింది. ఈ నెల 6 వరకూ పోర్టల్ ఓపెన్ ఉంటుంది.
అసలే OSM తో CBSEకి తలనొప్పులు పెరిగాయి. వీటికి తోడు సీబీఎస్‌ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ పద్ధతి కారణంగా తమ ఆన్సర్ పేపర్లు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యూయేషన్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. ఇందుకు వీలుగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే పోర్టల్‌పైనే తాజాగా సైబర్ దాడి జరిగింది. అదీ కథ. ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్నది తర్వాతి సంగతి. అసలు పోర్టల్ గట్టిగా ఉంటే ఈ సమస్య రాదు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.
Also Read: అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!
ఇష్యూ పెద్దదిగా మారడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం సీబీఎస్‌ఈ అధికారులను తొలగించడం ద్వారా తప్పులను కవర్ చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటానికి జరిగిన ప్రయత్నమిదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మార్కుల్లో తప్పులు దొర్లితే ఒక సబ్జెక్టుకు 100 రూపాయలు, ఒక్కో పేపర్‌లో మార్కులు తిరిగి కూడటానికి 100, రీ వాల్యుయేషన్ ఒక్కో ప్రశ్నకు 25 రూపాయలు వసూలు చేస్తారంటూ కౌంటర్ వేశారు. ఒక్కో విద్యార్థి తన ఆన్సర్ పేపర్ గురించి కచ్చితమైన మూల్యాంకనం కోసం 2 వేల వరకూ చెల్లించుకోవాల్సి వస్తోందని రాహుల్ చెప్పుకొచ్చారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తప్పు చేసిన కేంద్రం ఎంత సంపాదిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. పైగా తప్పులు చూపిన పిల్లలను యాంటీ నేషనల్స్ గా ముద్ర వేయడం ఏంటని ఫైర్ అయ్యారు.
ఈ సీబీఎస్ఈ ఎపిసోడ్ ను రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి ప్రధాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కామ్ అని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రైవేట్ వెండర్ల కోసం పణంగా పెట్టారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని విమర్శించారు. సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి సాక్ష్యాలతో చేసిన రీసెర్చ్‌ను ప్రస్తావిస్తూ ఆన్సర్ పేపర్లను మొబైల్ ఫోన్ల ద్వారా స్కాన్ చేశారనే విషయం బయటపడిందన్నారు. బ్లర్ గా ఉన్న కాపీలు, గల్లంతైన పేజీలు కేవలం టెక్నికల్ ఫాల్ట్స్ కావని, కోఎంప్ట్ కు లబ్ధి చేకూర్చేలా టెండర్ రూల్స్ ను మార్చడం వల్ల జరిగిన ముందస్తు ప్లాన్డ్ మోసం అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రధాని మోడీకి మామిడి పండ్ల గురించి మాట్లాడటానికి టైం ఉంది కానీ, మొబైల్ ఫోన్లతో పేపర్లు స్కాన్ చేయడం వల్ల నష్టపోయిన 18.5 లక్షల మంది విద్యార్థుల గురించి మాట్లాడటానికి సమయం లేదని ఫైర్ అయ్యారు రాహుల్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా తన పదవిలోనే కొనసాగుతున్నారని, అటు తమకు అన్యాయం జరిగిందని ప్రశ్నించిన పేద విద్యార్థులను ప్రభుత్వం, వ్యవస్థ కలిసి యాంటీ నేషనల్స్, టెర్రరిస్ట్‌లు, డీప్ స్టేట్ స్పైస్ అంటూ అవమానిస్తున్నారని, కానీ వారికి అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు రాహుల్.
Also Read: పెట్రోల్ తో పాటు ఇథనాల్ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రత్యేకతలు ఇవే!
ఇది CBSE వివాదమే కాదు.. మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ కారణంగా రద్దవడంతో NTA ఆఫీస్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? కష్టపడి చదివిన వాళ్లు మళ్లీ మళ్లీ ఎగ్జామ్ రాయడం అంటే ఒత్తిడి ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా. నీట్ పేపర్ లీక్ పై సీబీఎస్ఈ మాదిరిగానే NTA కూడా బుకాయించే ప్రయత్నం చేసింది. చివరికి గెస్ పేపర్, యాక్చువల్ పేపర్ సేమ్ టూ సేమ్ అవడంతో చివరికి నీట్ రద్దు చేయక తప్పలేదు. దేశంలో జరిగే కీలక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే 2017లో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ డైరెక్టర్ జనరల్ గా పెట్టారు. అయితే ఏళ్లు గడిచినా ఎన్‌టీఏ పనితీరు మెరుగుపడలేదని అనేక ఉదాహరణలు క్లారిఫై చేస్తున్నాయి. ఒక్క నీట్ విషయంలోనే కాదు.. దేశంలో ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణ, కీ, తుది కీ విడుదల, ఫలితాల విడుదలలోనూ NTA చాలా గందరగోళాలు సృష్టిస్తోంది. ప్రతి సంవత్సరం తప్పులు జరుగుతున్నా సంస్థ పనితీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోనూ గందరగోళమే. మల్టిపుల్ చాయిస్ లో నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఈ ఏడాది జరిగిన జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ పేపర్ లో ఒక ప్రశ్నకు మూడు సరైన ఆప్షన్లు ఇచ్చారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం అంటే ఇదేనా? తప్పులు లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరా? ఎక్స్ పర్ట్స్ తో డిస్కషన్ చేయరా? ఏంటిది అన్న అసహనం స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల్లో కనిపించాయి.
నీట్ విషయంలో కాంట్రాక్ట్ సిబ్బందిపై ఆధారపడటం సమస్యగా మారింది. ఇంటి దొంగలు, బయటి దొంగల హస్తం పెరిగింది. వాళ్లకు ఈజీగా క్వశ్చన్ పేపర్స్ చేతికి వస్తున్నాయ్. ఇప్పటికే సీబీఐ నీట్ దొంగలు చాలా మందిని అరెస్ట్ చేసింది కూడా. పరీక్షల పర్యవేక్షణకు పూర్తిస్థాయి శాశ్వత సిబ్బంది లేకపోవడం, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల లీకేజీ మాఫియా ఈజీగా చొరబడుతోందన్న విమర్శలున్నాయ్. నిజానికి NTA ఫెయిల్యూర్స్ ను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చాలా కీలక సిఫార్సులు చేసింది. వీలైనంత వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులకు మారాలన్నది. లేదా ప్రశ్నాపత్రాన్ని డిజిటల్‌గా కేంద్రాలకు పంపి, అక్కడ ప్రింట్ తీసుకునే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం. అలాగే విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు జేఈఈ తరహాలో నీట్‌ను కూడా రెండు దశల్లో నిర్వహించాలన్నది. NTA లో శాశ్వత పోస్టులను సృష్టించడం, ఐఐటీ, ఎయిమ్స్ తరహా కఠినమైన సెక్యూరిటీ నిబంధనలను తేవడం కీలకమన్నది. 2024 వివాదాల తర్వాత NTA అధిపతిని మార్చడం, కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ, 2026లో కూడా నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుతో కథ మారలేదన్న విషయం స్పష్టమైంది.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి, దేశ అత్యున్నత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలంటే ఊరికే లెక్చర్లు దంచడం కాదు.. ఇలాంటి కీలక పరీక్షల విషయంలో టెండర్ ఇచ్చే ముందు చాలా ఆలోచించాలి. కెపాసిటీ ఉన్న సంస్థలకే బాధ్యత ఇవ్వాలి. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చాలా వరకు తగ్గించాలి. ఇవన్నీ జరగాలన్న వాదనలు పెరుగుతున్నాయ్. నీట్ వంటి పెద్ద పరీక్షలను పెన్ అండ్ పేపర్ విధానం నుంచి పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌కు మార్చాలంటున్నారు. దీనివల్ల OMR షీట్ల ట్యాంపరింగ్, మాన్యువల్ తప్పులను అడ్డుకోవచ్చు. వచ్చే ఏడాది CBT బేస్డ్ గానే నీట్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. NTA ప్రస్తుతం డెప్యుటేషన్, కాంట్రాక్ట్ సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడుతోంది. అలా కాకుండా ఐబీపీఎస్ లేదా UPSC తరహాలో పరీక్షల నిర్వహణ, భద్రత కోసం ప్రత్యేక శాశ్వత సిబ్బందిని నియమించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు అలాగే తక్కువ భద్రత ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడం ఆపాలి. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఐఐటీలు వంతుల వారీగా నిర్వహిస్తున్నాయి. చెప్పిన టైం కంటే ముందే రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాయి. కనీసం వాళ్లనైనా చూసి నేర్చుకోవాలి కదా?
Also Read: చిన్న కిచెన్ కోసం అదిరిపోయే.. 5 స్పేస్-సేవింగ్ చిమ్నీలు ఇవే!