Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారా?.. ఈ సారి పార్టీలతో సంబంధం లేకుండా మేధావుల కోటాలో ఎంపీ కాబోతున్నారా? ఆ పద్మవిభూషణ్‌ని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేస్తారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో దానికి ఔననే సమాధానం వస్తుంది. అదే జరిగితే మెగా బ్రదర్స్ ముగ్గురు చట్టసభల సభ్యులైపోతారని వారి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతుందంట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌ని పణంగా పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తన అన్నయ్యకు అండగా ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ఆశీర్వాదం దక్కలేదు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో, పవన్ రాజకీయాలకు దూరం అయ్యారు. అప్పుడు ఆయన పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. తిరిగి రాజకీయాల్లోకి రారని అంతా భావించారు.
పవన్ అందరి అంచనాలను తారుమారు చేశారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకి తన సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. అయితే 2019లో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి సోలోగా పోటీ చేసి.. ఒక్క సీటుకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.
ఇంకొంకరైతే పార్టీ మూసేసి తమ పని తాము చూసుకునే వారేమో.. అయితే ప్రజాశ్రేయస్సును ఆకాంక్షించే విలక్షణ వ్యక్తిత్వమున్న పవన్ ఏపీలో జగన్ నియంత పాలనను తట్టుకోలేకపోయారు. తిరిగి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పట్టుబట్టి .. తిరిగి 2014 నాటి కాంబినేషన్‌ని రిపీట్ చేయించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా జాతీయ స్థాయి ఇమేజ్ సంపాదించుకుంటున్నారు.
Also Read: జగన్ ఇంటికి వాస్తు దోషం! సంక్రాంతి లోపే లీడర్స్ ఖాళీ?
ఇక పవన్ కళ్యాణ్ చిన్న అన్నయ్య నాగబాబు ఏపీలో క్యాబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభకు వెళ్తారనుకున్న నాగబాబుకి అనూహ్యంగా కేబినెట్ బెర్త్ దక్కనుంది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్దమైన నాగబాబు ఆ సీటుని బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనకు ఎలాంటి ప్రాధ్యాన్యతా దక్కలేదు. రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా అది వర్కౌట్ కాలేదు. అయితే ఏపీ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్‌ని నాగబాబుకి కన్‌ఫర్మ్ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అంత సడన్‌గా నాగబాబు కేబినెట్ బెర్త్ దక్కించుకోనుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా మెగా ఫ్యామిలీకి మరో జాక్‌పాట్ తగులుతుందన్న ప్రచారం మొదలైంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి , ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు మెగా అన్నయ్య చిరంజీవి. అప్పట్లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన కాంగ్రెస్ కేంద్ర మంత్రిని కూడా చేసింది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన చిరంజీవి తటస్థంగా ఉండిపోయారు. ఆయనపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందని.. ఆ క్రమంలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్ పురస్కారం దక్కిందంటారు.
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ చిరంజీవిని రాజకీయంగా ఓన్ చేసుకోవాలని చూస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే గత ఎన్నికల్లో తమ్ముడి పార్టీకే ప్రచారం చేయని చిరు ఏ పార్టీలో చేరడానికి సిద్దంగా లేరంటున్నారు. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్న ప్రచారం జరుగుతుంది. చిరంజీవిని ప్రెసిడెంట్ కోటాలో సినీ రంగ మేధావిగా రాజ్యసభకు పంపుతారని సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రపతి కోటాలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జులై 14న ఖాళీ అయిన ఆ స్థానాలను జనవరి 14లోపు భర్తీ చేయాలంట. అందులో ఒక స్థానానికి మెగా స్టార్ చిరంజీవి పేరు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందంట.. అదే జరిగితే మా మెగా బ్రదర్స్ ముగ్గురు చట్టసభల్లో ఉంటారని వారి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతుంది.