Sci-Fi Survival Movie: ప్రపంచం ఓ భారీ విపత్తుతో దాదాపు ఖాళీ అయిపోయింది. మనుషులు ఆల్మోస్ట్ అంతం అయిపోతారు. నగరాలు వెలవెలబోయాయి. ఆహారం, నీరు, రక్షణ కోసం ప్రతిరోజూ పోరాటమే. ఇలాంటి ప్రపంచంలో ఓ వృద్ధ శాస్త్రవేత్త తనకు ఎంతో ప్రియమైన కుక్కను కాపాడుకోవడానికి ఓ రోబోను తయారు చేస్తాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకనని తెలిసిన అతను, తన తర్వాత ఆ కుక్కను చూసుకునే బాధ్యత ఆ రోబోకు అప్పగించాలని అనుకుంటాడు. అక్కడి నుంచి మొదలయ్యే ప్రయాణం సై-ఫై కంటే ఎక్కువగా మనిషి, జంతువు, యంత్రం మధ్య ఏర్పడే బంధం గురించి చెప్పే హార్ట్ టచింగ్ మూవీనే ‘ఫించ్’ (Finch). మరి ఈ మనసుకు హత్తుకునే సినిమానే ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం.
ఫించ్ ఓ రోబోటిక్స్ ఇంజనీర్. భారీ సౌర విపత్తు తర్వాత భూమి దాదాపు నివసించలేని ప్రదేశంగా మారుతుంది. ఫించ్ ఓ భూగర్భ బంకర్ లో తన కుక్క గూడియర్ తో కలిసి దాదాపు పదేళ్లు జీవిస్తుంటాడు. బయట పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఎక్కువ సమయం బంకర్ లోనే ఉంటాడు. కానీ ఫించ్ కు ఓ పెద్ద భయం ఉంటుంది. తాను ఎప్పుడైనా చనిపోవచ్చు. అప్పుడు గూడియర్ ను చూసుకునే మనిషి ఎవరూ ఉండరు. అందుకే అతను జెఫ్ అనే హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయడం మొదలు పెడతాడు. మొదట జెఫ్ కు మానవ భావోద్వేగాలు ఉండవు. ప్రపంచం గురించి కూడా అతనికి పెద్దగా అవగాహన ఉండదు.
ఫించ్ జెఫ్ కు నెమ్మదిగా జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతాడు. గూడియర్ ను ఎలా చూసుకోవాలి, ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి, మనుషులతో ఎలా మాట్లాడాలి వంటి విషయాలను చెబుతాడు. అయితే సమయం మాత్రం అతని చేతుల్లో ఉండదు. ఓ భారీ తుఫాన్ తమ బంకర్ ను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి రావడంతో ఫించ్, జెఫ్, గూడియర్ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. వాళ్లకు గమ్యం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ప్రాంతం. కానీ అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. ఎండ తీవ్రత, రేడియేషన్, ధ్వంసమైన ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు వాళ్ల ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి.
ప్రయాణంలో ఫించ్ జెఫ్ కు కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా జీవితం గురించి కూడా నేర్పుతాడు. గూడియర్ తో జెఫ్ కు మొదట సరిగ్గా కలిసిరాదు. క్రమంగా ఆ కుక్కను తన బాధ్యతగా భావించడం మొదలు పెడతాడు. ఫించ్ కు మాత్రం ప్రతి రోజు చివరి రోజు కావచ్చని తెలుసు. అందుకే జెఫ్ ను తన తర్వాత గూడియర్ ను కాపాడగలిగే స్థాయికి తీసుకెళ్లాలని చూస్తాడు. ఈ ప్రయాణంలో జెఫ్ లో ఏర్పడే మార్పులు, ఫించ్ తో అతని అనుబంధం, గూడియర్ పై అతనికి పెరిగే ప్రేమే సినిమాకు అసలైన సోల్. మరి చివరికి హీరో ప్లాన్ వర్కౌట్ అయ్యిందా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
టామ్ హ్యాంక్స్ (Tom Hanks), కాలేబ్ లాండ్రీ జోన్స్ (Caleb Landry Jones) ప్రధాన పాత్రల్లో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఫించ్’. మూవీకి మిగెల్ సాపోచ్నిక్ (Miguel Sapochnik) దర్శకత్వం వహించారు. Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు.
Read Also: 11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్