Danam Nagender: ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌పై దానం పాజిటివ్‌గా స్పందించడం కలకలం రేపుతోంది. కేసీఆర్ తలపెట్టిన సభ విజయవంతమవుతుందన్న దానం ఆయనను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌ను దానం నాగేందర్ సమర్థించారు. ఆమె ట్వీట్‌లో ఎలాంటి తప్పు లేదని, ఆమె వాస్తవాన్నే పేర్కొన్నారని దానం అంటున్నారు. కాంగ్రెస్ సర్కారుని ఇరకాటంలో పెట్టేలా చేసిన వ్యాఖ్యలతో దానం మళ్లీ కారెక్కడానికి రెడీ అయ్యారా అన్న చర్చ మొదలైంది.
ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్న దానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1,250 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్‌ను చూడటానికి జనం ఆసక్తిగా ఉన్నారని దానం వ్యాఖ్య
గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందని… కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
స్మితా సబర్వాల్ వ్యవహారంపై పాజిటివ్‌గా స్పందించిన దానం
ఇక కీలక పోస్టులో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైనా దానం పాజిటివ్‌గా స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఫొటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. వినిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు.
పోలీసుల నోటీసులతో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్
ఆ మేరకు బీఎన్‌ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా స్మిత వెల్లడించారు. తన విచారణను పోలీసులు రికార్డ్ చేశారని, స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత స్మిత ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. చట్టపరిధిలో పోలీసులకు సహకరించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులను తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు వెల్లడించారు. ఆ పోస్టును 2వేల మంది రీషేర్ చేశారని .. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా.? అని స్పష్టత కోరినట్లు పేర్కొన్నారు .
#RuleofLaw #FreedomOfSpeech #justsaying అని హ్యాష్‌ట్యాగ్‌లు
అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజన్యాయ సూత్రానికి రాజీపడినట్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్‌లో #RuleofLaw #FreedomOfSpeech #justsaying అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చారు. విచారణ తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.
స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు
పలువురు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 10 ఏళ్లలో 13లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.
స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఐఏఎస్‌గా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టే బదులు.. రాజకీయాల్లో చేరితో సరిపోతుంది కదా అని యద్దేవా చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గురించి ఆమె మాట్లాడారా.? కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చెట్లను నరికేస్తే నోరు విప్పిందా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి, ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు.
స్మితా సబర్వాల్‌కు మద్దతుగా మాట్లాడిన దానం నాగేందర్
అయితే దానం నాగేందర్ మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా మాట్లాడటం చర్చనీయంశమైంది. ఆమె నిజాయితీ గల అధికారి అని, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్నారని దానం కితాబు ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ నడుస్తంది. కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తుంటే.. దానం నాగేందర్ మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది
బీఆర్ఎస్‌తో సంబంధాలు కొనసాగించడానికా?
మళ్లీ బీఆర్ఎస్ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్న స్మితాకు కితాబు ఇవ్వడం వెనుక అంతర్యం ఏంటని ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్ వర్గాలు జుట్లు పీక్కుంటున్నాయంట. కేసీఆర్‌ను చూసేందుకు జనం ఆసక్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం బీఆర్ఎస్‌తో సంబంధాలు కొనసాగించడానికా? లేక తాను ఇంకా ఆ పార్టీ సానుభూతిపరుడినే అన్న సంకేతాలివ్వడానికా అన్న చర్చ నడుస్తోంది. అదీకాక పోతే ఏదో ఆశిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా?
దానం వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్‌ను పరోక్షంగా సమర్థించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చ స్టార్ట్ అయింది. కాంగ్రెస్‌లో దానం నాగేందర్‌కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో… బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ.. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగుకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తపరచడం ద్వారా మంత్రి పదవి దక్కుంతుందనే ఆలోచన ఉన్నారనేది విశ్లేషకుల మాట. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం కామెంట్స్ చేశారు. ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు.
ఫార్ములా-ఈ కార్ రేస్‌పై కేటీఆర్ వాదనను సమర్థించిన దానం
ఫార్ములా-ఈ కార్ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అలాగే హైడ్రా కూల్చివేతలపైనా విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారి తీసింది. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు. ఆమె నిజాయితీ గల అధికారి అని, వాస్తవాలను మాత్రమే పంచుకున్నారని చెప్పడం ద్వారా దానం వ్యూహం ఏంటనేది అంతుపట్టకుండా తయారైంది. ఒక వైపు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పోస్టులపై మండిపడుతుంటే …దానం నాగేందర్ ఆమెకు మద్దతు ప్రకటించడం కలకలల రేపుతోంది
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దానం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ తరుపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దానం తీరుతో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారంట.
Also Read: వరంగల్ సభ.. BRS నేతల యూ టర్న్
దానంకు బీఆర్ఎస్‌లో దక్కని మంత్రి పదవి
2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్‌లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. దానం కాంగ్రెస్‌లో చేరినప్పుడు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యతిరేకత కారణంగానే ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదంట.
బీఆర్ఎస్‌కు మళ్ళీ దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని సందేహాలు
ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్‌కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా…అనే సందేహాలు స్టార్ట్ అవుతున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరగుతుండడం…స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దానంని బీఆర్ఎస్ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదా?
బీఆర్ఎస్ ఆయనను తిరిగి స్వీకరించడానికి ఆసక్తి చూపకపోవచ్చని గూలాబీ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బలం ఉందని గ్రహించే దానం…బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించడం ద్వారా అటు వైపు అడుగులు వేయాలని చూస్తున్నారంట. భవిష్యత్ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో తనకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకే దానం ఇలా డ్యుయల్ రూల్ పోషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి నిలకడ లేని రాజకీయాలకు పెట్టింది పేరైన దానం ఫ్యూచర్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయో.