BigTV English

Ex MLA Kadiri Baburao: కదిరి ఎక్స్‌పైర్ అయినట్లేనా? బాబూరావు దారెటు

Ex MLA Kadiri Baburao: కదిరి ఎక్స్‌పైర్ అయినట్లేనా? బాబూరావు దారెటు

Ex MLA Kadiri Baburao: ఆయన ఆ జిల్లాలో సీనియర్ నేత.. అధికారం, పదవులు అనుభవించారు. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా చలామణి అయిన ఆ నేత అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీటులో టికెట్ ఇవ్వలేదని పార్టీ మారారు. అక్కడా ఆయనకు ఈక్వేషన్లు కలిసి రాలేదు. ఆ క్రమంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పుదామని అనుకున్న టైమ్ లో ఆ నేత రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలముకున్నాయట. దాంతో ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేనంటూ దూరంగా వెళ్ళిపోతారా? మళ్ళీ సొంతగూటికి తిరిగి వెళ్లడానికి పాత పరిచయాలు వాడుకుంటారా? ఇంతకీ తన పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ లేకుండా పోయిన ఆ నాయకుడు ఎవరు?


కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత.. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే అయినా తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక రేంజ్లో అధికారదర్పం వెలగబెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కదిరి బాబూరావు వైసీపీలో చేరినప్పటికీ పొలిటికల్‌గా ఏమీ సాధించలేకపోయారు. ఆ క్రమంలో ప్రస్తుతం బాబురావు రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు జిల్లాలో అన్నీ తానై నడిపించి.. ఓవెలుగు వెలిగిన ఈ నేత రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. దాంతో కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అవుట్ డేటెడ్ నేతల లిస్టులో చేరి పోయారనే టాక్ నడుస్తోంది.

బడా ముత్యాల వ్యాపారి అయిన కదిరి బాబురావు నటసింహం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే అయినప్పటికీ ప్రకాశం జిల్లా తెలుగుదేశంలో సీనియర్ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2004లో కనిగిరి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. టీడీపీ అధిష్టానం ఆయనకు దర్శి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కదిరి బాబూరావు.. 2009 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ టిక్కెట్ దక్కించుకోగలిగారు. అయితే ఆ ఎన్నికల్లో కదిరి బాబురావు నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టడం మరిచిపోయి ఎన్నికలకు దూరమయ్యారు. అప్పట్లో ఆయన నిర్వాకం రాష్ర్టంలో హట్ టాపిక్ గా మారింది.


2014 ఎన్నికల్లో బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యంతో తిరిగి కనిగిరి టికెట్ దక్కించుకున్న బాబూరావు మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు జిల్లా తెలుగుదేశం ముఖ్యనేతల్లో ఒకరిగా పెత్తనం చేసి.. జిల్లాలో తిరుగులేని సీనియర్ నేతగా ఎదిగారు. అంత వరకు బానే వున్నా 2019 ఎన్నికల నాటికి మారిన రాజకీయ పరిణామాలతో తిరిగి దర్శి నుంచి పోటీ చేసిన బాబూరావు వైసిపి అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అటు టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో కదిరి బాబురావు 2020లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు.

అధికార దాహంతో కదిరి బాబురావు వైసీపీలో చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. బాలయ్య ఆశీస్సులతో పార్టీలోకి వచ్చి అటు పార్టీ, ఇటు బాలయ్యకి నమ్మకద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ మారితే సొంత నియోజకవర్గమైన కనిగిరిలో హవా చూపించవచ్చని భావించిన కదిరి బాబురావుకు ఆదిలోనే అప్పటి కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్ చెక్ పెట్టేశారు. నియోజకవర్గంలో కదిరి బాబురావు ఎక్కడకు వెళ్లినా వైసీపీ శ్రేణుల్లో ఆదరణ లభించలేదు. మరోవైపీ టీడీపీ వర్గాల నుంచి ఛీత్కారాలు తప్పలేదు.

Also Read: ట్రై యాంగిల్ ఫైట్.. ఉత్తరాంధ్ర టీచర్లు ఎటువైపు

వైసిపిలో బాబురావును కనిగిరి పార్టీ శ్రేణులు అసలు నాయకుడిగానే గుర్తించలేదు. కనీసం పార్టీ కార్యకర్తలు పలకరించిన పాపాన కూడా పోలేదు. దాంతో కదిరి బాబురావు కనిగిరి పాలిటిక్స్‌లో డమ్మీగా మిగిలిపోయారు. రెండింటికి చెడ్డ రేవులా తయారైన ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలంగా వైసీపీకి కూడా దూరమయ్యారు. తెలుగుదేశంపార్టీలో వున్నప్పుడు బాలయ్య స్నేహితుడిగా ఉన్న ఇమేజ్‌లో జిల్లాలో అన్నీ తానై నడిపించి.. ఓ వెలుగు వెలిగిన బాబురావుకు.. వైసీపీలో కనీసం ఒక గల్లీ లీడర్‌‌కు ఉన్న గుర్తింపు కూడా లభించలేదంట.

వైసీపీలో చేరితే ఇక తిరుగు ఉండదనుకున్న కదిరి బాబూరావు.. అసలు ఆ పార్టీలో ఎందుకు చేరానా అని కనిపించిన అందరి వద్దా వాపోతున్నారంట. ప్రస్తుతం వైసీపీకి దూరమైన కదిరి బాబురావు రాజకీయ భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.. తెలుగుదేశంలో జిల్లా ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్న బాబురావుకి పార్టీ కార్యకర్త మొదలు .. చంద్రబాబు నాయుడి వరకు అందరి దగ్గరా సముచిత గౌరవం లభించేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబూరావుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్‌మెంట్ లభించేది.

అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలో వున్నప్పుడు అన్ని అనుభవించిన బాబురావు అధికారం కోల్పోగానే వైసిపి పంచన చేరడాన్ని పార్టీ క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతుందంట . తెలుగుదేశం పార్టీకి, నందమూరి బాలకృష్ణకి నమ్మకద్రోహం చేసి వెళ్ళిన నేతగానే తెలుగుతమ్ముళ్లు బాబురావుని చూస్తున్నారు. దాంతో వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటు టీడీపీలోకి వెళ్లే పరిస్థితి కనిపించక.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారంట. తాజా పరిస్థితుల్లో బాబురావు తన రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లాడతారో? లేక ఈ రాజకీయాలు మనకెందుకులే అనుకొని.. తన ముత్యాల వ్యాపారం తాను చూసుకుంటారో? చూడాలి.. మొత్తానికైతే ఇప్పటికి కదిరి.. కడగని ముత్యంలా.. మిగిలిపోయారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×