Loan Charges: సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, అత్యవసర వైద్యం లేదా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలన్నా సామాన్యుడికి గుర్తొచ్చేవి గోల్డ్ లోన్, హోమ్ లోన్ మన ప్రాణంగా చూసుకునే పసిడిని బ్యాంక్ లాకర్లలో పెడతాం.. జీవితకాల కష్టంతో కొనుక్కున్న ఇంటి పత్రాలను బ్యాంకర్ల చేతుల్లో పెడతాం. అంటే లోన్ తీరేవరకు ఆ బంగారం, ఆ ఇల్లు పూర్తిగా బ్యాంకుల అధీనంలోనే ఉంటాయి. అసలు రిస్క్ లేని ఇటువంటి రుణాలు ఇచ్చినప్పుడు బ్యాంకులు నామమాత్రపు ఛార్జీలు లేదా తక్కువ వడ్డీ వసూలు చేయాలి. కానీ మార్కెట్లో పరిస్థితి చూస్తే.. గోల్డ్ లోన్లపై 9% నుండి 18% వరకు, హోమ్ లోన్లపై 7.5% నుండి 10% కంటే ఎక్కువ వడ్డీలు లాగుతున్నారు.
గోల్డ్ లోన్ ఇచ్చేప్పుడు బంగారాన్ని వ్యాల్యుయేషన్ చేయడం, దానికి భద్రత కల్పించడం, లాకర్లలో దాచడం వంటి వాటికి ఖర్చవుతుందని బ్యాంకులు చెప్తాయి. హోమ్ లోన్ అనేది 20 నుండి 30 ఏళ్ల సుదీర్ఘకాల పరిమితి కలిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, లీగల్ చెకింగ్, ప్రాపర్టీ వాల్యుయేషన్ పేరుతో బ్యాంకులు భారీ ప్రాసెసింగ్ ఫీజులు మరియు వడ్డీలను వసూలు చేస్తాయి. డిపాజిటర్లకు ఇచ్చే వడ్డీ (ఉదాహరణకు FDలపై 6-7%) కి, ఇచ్చే రుణాల వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసమే బ్యాంకుల అసలు లాభం. సెక్యూర్డ్ లోన్లు సురక్షితమైనవి కాబట్టి, వీటి ద్వారానే బ్యాంకులు స్థిరమైన, భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.
సాధారణంగా ఒక మధ్యతరగతి వ్యక్తి రూ.40 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నాడనుకుందాం వడ్డీ రేటు 7.5% ఉన్నప్పుడు నెలానెలా EMI ₹32,230 మొత్తం చెల్లించే వడ్డీ రూ.37,35,280. అసలు + వడ్డీ కలిపి రూ.77,35,280 అదే వడ్డీరేటు 9.5% కి పెరిగితే రూ. 37,285 రూ.49,48,349 మొత్తం చెల్లింపు అసలు-వడ్డీ కలిపి రూ.89,48,349 అన్నమాట ఇక్కడ షాకింగ్ నిజం ఏమంటే 9.5% వడ్డీ చొప్పున ₹40 లక్షల ఇల్లు కొంటే, 20 ఏళ్లలో మనం తిరిగి చెల్లించేది రూ.89.48 లక్షలు. అంటే అసలు కంటే వడ్డీయే ఎక్కువ! మన సొంత ఇంటి పత్రాలు బ్యాంక్ దగ్గర పెట్టి, వారి లాభాల కోసం జీవితాంతం కష్టపడాల్సి వస్తోంది.
Also Read: KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నోటీస్..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతల రక్షణ కోసం కొన్ని కీలక నిబంధనలు తెచ్చింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ అక్టోబర్ 2019 నుండి ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానించాలి. ఆర్‌బీఐ రేట్లు తగ్గించినప్పుడు బ్యాంకులు కస్టమర్లకు వడ్డీ తగ్గించాల్సిందే. ఫ్లోటింగ్ రేట్ ఉన్న హోమ్ లోన్లను ముందస్తుగా చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీలు వేయకూడదు. ఫోర్‌క్లోజర్ నిబంధనలు: గోల్డ్ లోన్లు లేదా ఇతర రుణాలు త్వరగా తీర్చేస్తే అదనపు బాదుడు ఉండకూడదు. రుణగ్రహీత పూర్తి రుణం తీర్చిన 30 రోజుల్లోగా ఒరిజినల్ డాక్యు మెంట్లను ఆస్తి యజమానికి తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే రోజుకు ₹5,000 చొప్పున బ్యాంకే కస్టమర్‌కు పరిహారం చెల్లించాలి.
ఆర్‌బీఐ రేట్లు పెంచినప్పుడు బ్యాంకులు తక్షణమే EMIలు పెంచుతాయి, కానీ రేట్లు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తాయి. ఒక హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులు రకరకాల దోపిడీ చేస్తుంటాయి. లోన్ అప్లికేషన్‌ను పరిశీలించినందుకు వేసే రుసుము భారం ఏకంగా లోన్ మొత్తంలో 0.5% నుండి 2% వరకు (ప్లస్ 18% GST). మీరు ₹50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, 1% ప్రాసెసింగ్ ఫీజు అనుకున్నా రూ.50,000 + GST (₹9,000) = రూ.59,000 కేవలం అప్లికేషన్ ప్రాసెస్ చేసినందుకే ఊడిపోతాయి ఆస్తి పత్రాలు సరైనవో కాదో చెక్ చేయడానికి , ఆస్తి, బంగారం విలువ ఎంతో నిర్ణయించడానికి లాయర్లు, వ్యాల్యూయర్లకు ఇచ్చే పేరుతో రూ. 3,000 నుండి రూ. 10,000 వరకు వసూలు చేస్తారు. MODT ఇంటి పత్రాలను బ్యాంక్ వద్ద కుదువ పెడుతున్నట్లు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయడానికి లోన్ మొత్తంలో 0.1% నుండి 0.5% వరకు చార్జ్ చేస్తారు. ఇది కాకుండా రూ. 2,000 నుండి రూ. 5,000 వరకు స్టాంప్ డ్యూటీ/డాక్యుమెంటేషన్ ఫీజు పేరుతో గుంజుతారు.
అప్ప్రైజర్ ఫీజు బంగారాన్ని ఉపాసించి (క్యారెట్ చెక్ చేసి) సర్టిఫై చేయడానికి ఒక్కో అప్లికేషన్‌పై రూ.300 నుండి రూ.1,000 వరకు తీసుకుంటారు. సెక్యూరిటీ పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏటా అదనపు సర్‌ఛార్జీలు వేస్తాయి. రేట్ రీసెట్ ఫీజు బయట వడ్డీ రేట్లు తగ్గినా మీ బ్యాంక్ తగ్గించకపోతే.. తక్కువ వడ్డీకి మారడానికి బ్యాంకులు లోన్ బ్యాలెన్స్‌పై 0.25% నుండి 0.5% వరకు ‘కన్వర్షన్ ఫీజు’ వసూలు చేస్తాయి. లోన్ స్టేట్‌మెంట్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలన్నా వందల్లో ఫీజులు గుంజుతాయి. బడాబాబుల్ని, కార్పోరేట్ వాళ్లకి వేలకోట్లు లోన్లు ఇచ్చి వాళ్లు అవి ఎగ్గొట్టి పారిపోతే.. చూస్తూ కూర్చునే ఇవే బ్యాంకులు కేవలం మధ్యతరగతి వారిని మాత్రమే పీక్కు తింటాయి. ఎందుకంటే కార్పోరేట్ వ్యక్తుల్లో భయం ఉండదు-మధ్యతరగతి వాళ్లలో అణువణువూ భయమే ఉంటుంది. అందుకే ఆ భయమే బ్యాంకులకు పెట్టుబడి. ఇది మారనంతకాలం మధ్యతరగతి బతుకులు ఇంతే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే!
Also Read: Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?