కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది.. అన్నట్టుగా తెలంగాణలో గతంలో జరిగిన పేపర్ లీకేజీల వ్యవహారం మళ్లీ రాజకీయంగా చిచ్చు పెట్టింది. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డే బయటకు తీశాడు. కేటీఆర్ రేపు ఇందిరాపార్క్ వద్ద ఢిల్లీ ఘటనపై ధర్నాచేయనున్నాడు. దీనిపై రేవంత్ స్పందించాడు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలు తారుమారుగా వచ్చేలా చేసి పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యుడయ్యాడని గుర్తు చేశారు. గ్రూప్-1 పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ బినామీ సంస్థగా ఉన్న గ్లోబరీనాకు కాంట్రాక్టులు ఇచ్చాడని ఆరోపించారు.
ఢిల్లీలో నీట్‌పేపర్ లీకేజీ వ్యవహారంలో అగ్గి రాజుకుంటున్నది. ఆందోళన తీవ్ర తరమవుతోంది. మద్దతు వెల్లువలా లభిస్తున్న తరుణంలో.. అంతా కలిసి బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం పాత అంశాలను మళ్లీ బయటకు లాటి కాంగ్రెస్, బీఆరెస్ రెండు పరస్పరం వాదులాడుకుంటున్నాయి. ఇదే మంచి సందర్భమని సీఎం భావించి ఉంటాడు.. అందుకే ఆయన బీఆరెస్ పాలనలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల ప్రస్తావన తెచ్చి.. కేటీఆర్‌ను ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు.
గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్‌కు బినామీ అనే విధంగా సీఎం మొదటి నంచి మాట్లాడుతున్నాడు. దీని వల్లే గ్రూపు-1 పరీక్షా పత్రాల లీక్ జరిగిందనేది కాంగ్రెస్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. దీనిపై కేటీఆర్ కూడా తీవ్రంగానే స్పందించాడు. గ్లోబరీనాకు తనకు ఏమాత్రం సంబంధం లేదని, పదే పదే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న సీఎంపై లీగల్‌గా చర్యలు తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ కాంగ్రెస్ పాలనలో కూడా కాళేజీ వర్సిటీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టులు గ్లోబరీనా సంస్థకే ఇచ్చిన విషయాన్ని బీఆరెస్ తాజాగా బయటపెట్టింది. దీంతో ఈ పరస్పర ఆరోపణలు కేవలం రాజకీయ మైలేజీ కోసం ఎవరికి వారు చేసుకుంటున్నారే తప్ప.. అసలు ఢిల్లీ సమస్యను తెలంగాణలో పక్కదారి పట్టించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జెన్-జీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాల్సింది పోయి.. ఇలా ఎవరికి వారే మళ్లీ పాత విషయాలను బయటకు లాగడం వల్ల .. ఢిల్లీ ఇష్యూ ఇక్కడ డైవర్ట్ అయిపోయి.. రేవంత్ వర్సెస్ కేటీఆర్ మాదిరిగా మారింది. బీజేపీ ఇక్కడ బచాయించిపోతున్నదనే అభిప్రాయాలు వస్తున్నాయి. కాగా, ఈ గొడవంతా.. కేటీఆర్ రేపు ధర్నా చౌక్ వద్ద ఢిల్లీ ఇష్యూపై నిరసన తెలపాలనుకోవడం వల్లేనని స్పష్టమవుతున్నది.
దీనిపై కాంగ్రెస్ భగ్గుమంటున్నది. మీరేం సుద్దపూసలా? మీ పాలనలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోలేదా? మోడీకి, కేసీఆర్, కేటీఆర్‌లకు పెద్ద తేడా లేదు.. అనే వాదనను కాంగ్రెస్ తెరపైకి తెస్తున్నది.