GHMC: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజలకు అందిస్తున్న అత్యవసర సేవ అయిన శానిటేషన్ పై ఉన్నతాధికారులు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో తొమ్మిది నెలల క్రితం విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటికే తడి, పొడి చెత్త కోసం ఇంటింటికి రెండు బిన్లను పదేళ్ల క్రితమే పంపిణీ చేసిన సంగతి తెల్సింది. 2016 లో సిటీని బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తగా వేర్వేరు చేసి సేకరించేందుకు వీలుగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తేలిన సుమారు 22 లక్షల గృహ సముదాయాలకు ఈ బిన్లను పంపిణీ చేశారు.
వీటితో ఫలితం అంతంత మాత్రంగా రాగా, కొత్తలో చెత్తను తడి, పొడిగా వేర్వేరు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అందజేసిన ప్రజలు ఆ తర్వాత ఒకే బిన్ లో రెండు రకాల చెత్తను కలిపి అందించటంతో ప్రాథమిక దశలో చెత్త సెగ్రిగేషన్ కష్టతరంగా మారటంతో అధికారులు ఇపుడు మరోసారి మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటికి నాలుగు డస్ట్ బిన్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. నాలుగు బిన్లలో నాలుగు రకాల చెత్తను సేకరించి, సమీపంలోని సెగ్రిగేషన్ సెంటర్ కు, ఆ తర్వాత ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలించేలా కొత్తగా కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిక్ వాహానాలను వినియోగించేలా అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేశారు. సేకరించిన చెత్తను వీలైనంత త్వరగా వేర్వేరు చేయటంతో పాటు రీ సైక్లింగ్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సరి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు తెల్సింది. ముఖ్యంగా స్పెషల్ కేర్ చెత్త, శానిటరీ వేస్ట్ లను వేర్వేరు చేసి సేకరించటంతో చాలా వరకు పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పును బాగా తగ్గించవచ్చునని కూడా అధికారులు భావిస్తున్నారు.
Also read: Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాత పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి పంపిణీ చేసిన రెండు బిన్లలో కొన్ని చోట్ల తడి,పొడి చెత్త సేకరణ పకడ్బందీగా జరుగుతున్నా, చాలా చోట్ల బిన్లు కన్పించకుండాపోయినా, ప్లాస్టిక్ కవర్లలో సైతం చెత్తను ప్రజలు తడి,పొడిగా వేర్వేరుగా చేసి స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు అందజేస్తున్నారు. ఇపుడు వీటికి తోడు మరో రెండు బిన్లలో మరో రెండు రకాల చెత్తను వేర్వేరు చేసి కార్మికులకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే పంపిణీ చేసిన రెండు బిన్లలో తడి, పొడి చెత్తను అందిస్తున్న కుటుంబ సభ్యులు ఇపుడు అధికారులు త్వరలో పంపిణీ చేయనున్న నాలుగు బిన్లలో మొదటి రెండు బిన్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వటంతో పాటు మిగిలిన రెండింటిలో ఒకదానిలో స్పెషల్ కేర్ ఈ వెస్ట్, మరో దానిలో శానిటరీ వెస్ట్ ను వేర్వేరుగా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సరి కొత్త విధానం 2027 ఆర్తిక సంవత్సర ప్రారంభ మాసం ఏప్రిల్ మాసం నుంచి ఒకే సారి కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సరి కొత్త విధానంతో ఇండ్లలో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడికక్కడ చెత్త రీసైకిలింగ్ చేసేలా అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి కోర్ అర్బన్ రీజియన్ పరిదిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటికి నాలుగు బిన్లలో చెత్తను సేకరించాలని నిర్ణయించిన అధికారులు వచ్చే జనవరి మాసం నుంచే మరోసారి ప్రతి ఇంటికి నాలుగు బిన్లను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పదేళ్ల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం 22 లక్షల ఇండ్లకు ట్విన్ బిన్లను పంపిణీ చేసిన అధికారులు, ఆ తర్వాత గత సంవత్సరం నవంబర్ నుంచి జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుని సుమారు 30 లక్షల గృహాలకు ఈ నాలుగు బిన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. నాలుగు వేర్వేరు రంగుల్లో వీటిని తయారు చేసి పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తకు నీలం, ఆకుపచ్చ రంగు బిన్లను తయారు చేయించాలని నిర్ణయించిన అధికారులు మరో రెండు కొత్త బిన్లలో స్పెషల్ కేర్, మరో బిన్ లో శానిటరీ వేస్ట్ ను సేకరించనున్నారు. అయితే ఇప్పటి వరకు తడి, పొడి చెత్తల సేకరణ కోసం నీలం, ఆకుపచ్చ రంగు బిన్లను ఖరారు చేసిన జీహెచ్ఎంసీ త్వరలోనే స్పెషల్ కేర్ చెత్త కోసం ఆరేంజ్, శానిటరీ వేస్ట్ కోసం ఎరుపు రంగు బిన్ ను ఖరారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
Also read: బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్, నా ప్రమేయం ఏ మాత్రం లేదు