BJP Ticket: స్వేచ్చ బ్యూరో: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమనే అంచనాలతో భారతీయ జనతా పార్టీ స్థానికంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఉప ఎన్నిక జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాతో ఆశావహులు స్థానికంగా కీలక నేతలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఖైరతాబాద్ బీజేపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చింతల రామచంద్రారెడ్డి గతంలో ఖైరతాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. 2009, 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన 2014లో విజయం సాధించగా, మిగిలిన మూడు ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక జరిగితే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికే మరోసారి అవకాశం ఇస్తారా? లేక కొత్త ముఖాన్ని బరిలోకి దింపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఆయన గత కొంతకాలంగా స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధితోనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చనే ఆలోచనతో తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యువత, కొత్త తరం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో ఉందని సమాచారం.
Also read: షాపింగ్ సమయంలో అందమైన వస్తువులు చూడగానే కొనాలనిపిస్తుంది.. దీనికి కారణాలు ఇవే
ఇకపోతే.. చింతల రామచంద్రారెడ్డి వయస్సు ప్రస్తుతం 74 సంవత్సరాలు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితికి సంబంధించిన పార్టీ మార్గదర్శకాలపై గతంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి అసెంబ్లీ టికెట్ దక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్ఠానం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గంలో వ్యక్తిగత బలం, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో చురుకుదనం, గత ఎన్నికల పనితీరు, స్థానిక నాయకత్వంతో సమన్వయం వంటి అంశాలు కూడా నిర్ణయంలో కీలకంగా మారవచ్చు.
వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే.. పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే వారికి అవకాశం కల్పిస్తుందా? లేక ఉప ఎన్నికలే కదా.. తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు దేశవ్యాప్తంగా జెన్ జీ ఇంపాక్ట్ తీవ్రంగా చూపుతున్న తరుణంలో యువతకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వయస్సు ప్రస్తుతం 74 ఏళ్లు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిబంధన ఉంది. ప్రధాని మోడీ లాంటి వ్యక్తికే ఒకానొక దశలో ఆ ఇబ్బందులు తప్పలేదు. ఈ ఎన్నికల్లో గెలుపే భవిష్యత్ రాజకీయాలపై ప్రభావితం చూపే అవకాశమున్న తరుణంలో ఉప ఎన్నిక అనివార్యమైతే.. టికెట్ ఎవరిని వరిస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. పార్టీ.. అనుభవానికి ప్రాధాన్యం ఇస్తుందా? కొత్త తరానికి అవకాశం కల్పిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
Also read: సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!