Telangana Public Schools: స్వేచ్ఛ బ్యూరో : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పై ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టులో చేపడుతున్న మంచాల, వంగూరు, పోల్కంపల్లి పబ్లిక్ స్కూళ్లపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న విద్యాకమీషన్ పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా.. డిసెంబర్ నాటికి పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యాకమిషన్ దీనిపై సమీక్షించింది. ఈ సమీక్షలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్, జోత్స్న శివారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్, ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆరుట్ల, వంగూరు, పోల్కంపల్లి, మంచాల పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్టర్స్ హజరయ్యారు. ఈ మూడు పాఠశాలల్లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి, నిధుల విడుదల, మౌలిక వసతులు, ఫర్నీచర్ తదితర అంశాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
డిసెంబర్ గడువులోగా పూర్తి చేయాలి..
మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల్లో పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. కొన్ని పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై కూడా చర్చించారు. నిధుల సమస్య కారణంగా పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ సూచించారు. పైలట్ ప్రాజెక్టులోని మూడు పాఠశాలల్లో మిగిలిన పనులను వేగవంతం చేసి, డిసెంబర్ గడువులోగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఫర్నీచర్‌కు ఇండెంట్ సిద్ధం చేయాలి : నవీన్ నికోలస్
పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్‌ను జైళ్ల శాఖ నుంచి సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు నవీన్ నికోలస్ తెలిపారు. చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లో ఖైదీలు తయారు చేసే ఫర్నీచర్ ను టీపీఎస్ లకు ఉపయోగించుకోవాలని, దీనికి సంబంధించి ప్రతి పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ వివరాలతో పూర్తి ఇండెంట్‌ను సిద్ధం చేయాలని హెచ్ఎంలను నవీన్ నికోలస్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల అవసరాలకు అనుగుణంగా డెస్క్‌లు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ అవసరాలను ముందుగానే గుర్తించి ఇండెంట్ సిద్ధం చేయాలన్నారు. పాఠశాల భవనాల పనులు పూర్తయ్యే సమయానికి ఫర్నీచర్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలకు సూచించారు.
ఎంబీల నమోదులో ఇబ్బందులు లేకుండా చూస్తాం : గణపతి రెడ్డి
ఈ మూడు టీపీఎస్ లలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీలు(మెజర్‌మెంట్ బుక్స్) నమోదు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ఎడ్యూకేషన్ వెల్పేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, బిల్లుల ప్రక్రియ తదితర అంశాల్లో సమన్వయంతో వ్యవహరిస్తామని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సమావేశంలో సూచించారు. అధికారులు, హెచ్ఎంలు, నిర్మాణ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి మూడు పబ్లిక్ స్కూళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యా కమిషన్ నిర్ణయించింది.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బిగ్ ప్లాన్!