Balen Crisis: 2026 మార్చి 27.. నేపాల్ నూతన ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణస్వీకారం చేసిన రోజు. అంటే ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఆయన ప్రభుత్వం గురించి రకరకాల వాదనలు ప్రారంభమయ్యాయి. బాలేన్ షా నిర్ణయాలను ప్రజలు అప్పుడే ప్రశ్నిస్తున్నారు.. వ్యతిరేకిస్తున్నారు.. ఇంకొందరైతే నిరసనలు చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఆయన మంత్రివర్గంలోని ఇద్దరు కీలక మంత్రులు ఇప్పటికే రాజీనామా కూడా చేసేశారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో పాటు.. నేపాల్ తలరాతనే మార్చేస్తామని అధికారంలోకి వచ్చిన వారు.. నెల తిరగకుండానే ఇలా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెర లేపింది.
35 ఏళ్ల వయస్సులోనే నేపాల్ ప్రధాని పదవిని చేపట్టిన బాలెన్ షా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. నిజానికి ఆయనపై చాలా బరువు, బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే నేపాల్‌లో అధికార పార్టీని కుప్పకూల్చి.. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి పదవిని అప్పగించారు నేపాల్ ప్రజలు. బాధ్యతలు చేపట్టినప్ప డే వన్ నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనంగానే ఉంటున్నాయ్. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. పాలనలో స్పీడ్ పెంచారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయ్. ప్రధానిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలో నిరసనలకు కారణమవుతున్నారు. జెన్ జీ ఉద్యమంతో నేపాల్ లో ప్రభుత్వం మారడం బాలేంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే పదవి చేపట్టిన నెల రోజుల్లోనే ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో భారత్ నేపాల్ సరిహద్దుల్లో నిరసనలు ఎగిసిపడుతున్నాయ్. ఇండియా నుంచి వచ్చే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదే ఇప్పుడు నిరసనలకు కారణమైంది.
Also Read: బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం
భారత్ నుంచి వంద నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5% నుంచి 80% వరకు పన్ను విధించింది నేపాల్ ప్రభుత్వం. భారత్‌కు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే నేపాలీలు రోజువారీ అవసరాలు.. అంటే కూరగాయలు, మందులు, ఎరువులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, పండుగ-పెళ్లి సామగ్రి ఇలాంటివి చౌకగా మన దేశంలోని బజార్ల నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు బాలేంద్ర షా రూల్స్ కఠినం చేయడంతో వారి ఖర్చులు పెరిగాయి. దీంతో సరిహద్దు చెక్‌పోస్టుల్లో నేపాల్ పోలీసులు చిన్న చిన్న వస్తువులు కూడా పిల్లలు తినే చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లను కూడా సీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నేపాలీ మహిళలైతే నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. పోలీసులతో వాదిస్తున్నారు. పిల్లల కోసం చిప్స్ ప్యాకెట్లు తెచ్చినా లాక్కుంటారా అని ఆవేదనతో అనడం వీడియోల్లో కనిపిస్తోంది. ఆ చిప్స్ ప్యాకెట్ల డబ్బులు ఇచ్చి సీజ్ చేయాలంటున్నారు. అంతే కాదు.. నేపాల్‌లోని అన్ని షాపుల్లోనూ ఇండియా వస్తువులే ఉన్నాయని, ముందు వాటిని ఆపాలని నేపాలీలు సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర వాదిస్తున్నారు. భారత్‌కు సరిహద్దు పట్టణాలైన బీర్‌గంజ్, నేపాల్‌గంజ్‌లో ఇలాంటి నిరసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే కాదు.. రాజధాని ఖాట్మండులో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయ్. బార్డర్‌లో ఉన్న వారైతే తాము పుట్టినప్పటి నుంచి అన్ని వస్తువులు భారత్ నుంచే కొంటున్నామని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందంటున్నారు. ఇంత చిన్న మొత్తానికే అంత పెద్ద ట్యాక్సులు ఎందుకుని నేపాల్ లోని విపక్షం ప్రశ్నిస్తోంది. ఇంటి కోసం నిత్యవసరాలపై ఇలాంటి సుంకాలు తొలగించాలన్న డిమండ్లు పెరుగుతున్నాయి. అయితే బాలేన్ షా వర్షన్ మాత్రం మరోలా ఉంది. స్థానిక మార్కెట్లు నష్టపోకుండా కాపాడడం, పన్ను రూపంలో రాబడి పెంచడం, అక్రమ దిగుమతులు అరికట్టడమే తమ లక్ష్యమనేది ప్రభుత్వ వర్షన్. నిజానికి ఇది కొత్త కండిషన్ ఏం కాదు. ఇంతకుముందు కూడా ఉంది. కానీ కఠినంగా అమలు చేయలేదు. బాలెన్ షా ప్రభుత్వం ఇప్పుడు కట్టుదిట్టం చేసింది. అందుకే నిరసనలు పెరుగుతున్నాయ్.
Also Read: కవిత కొత్త పార్టీ అజెండా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?
ఇప్పుడు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేయడానికి ఇదొక్కటే కారణం కాదు. యూనివర్సిటీల్లో పార్టీలకు సంబంధించి స్టూడెంట్ యూనియన్లపై బాలెన్ షా నిషేధం విధించారు. ఇప్పుడు ఇది మరో నిరసనకు కారణమైంది. ఓవరాల్‌గా చూస్తే నిరసనల తీవ్రత పెరుగుతుండటంతో బాలెన్ షా సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. జెన్ జీలు మరోసారి నేపాల్‌లో నిరసనలకు దిగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిజానికి బాలేన్ షాను ప్రధానిగా చేసిన వారిలో యువతది కీ రోల్. గత ప్రభుత్వంపై వారికున్న వ్యతిరేకతను ఆందోళనల రూపంలో చూపించి.. నిరసనలను ఉధృతం చేసి.. పాత ప్రభుత్వాన్ని గద్దె దింపింది. ఈ నిరసనల్లో యూనియన్‌లది కీలకపాత్ర అనే చెప్పాలి. అలాంటి యూనియన్స్‌ను నిషేధించడంపై ఇప్పుడు రగిలిపోతున్నారు. విద్యాసంస్థలు రాజకీయాలకు కేరాఫ్‌గా మారకూడదని.. కేవలం విద్యకు మాత్రమే పరిమితం కావాలనేది ప్రభుత్వం ఆలోచన. గతంలో ఈ సంఘాల వల్ల చదువులకు ఆటంకం కలుగుతోందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ విద్యార్థి సంఘాలు సమ్మెలు చేయడం, ప్రొఫెసర్లపై దాడులకు పాల్పడటం, కాలేజీ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
బాలేన్ షా తన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో ఎటువంటి రాజకీయ జెండాలు, యూనియన్లు ఉండకూడదని బాలెన్ షా స్పష్టం చేశారు. కేవలం విద్యావేత్తలు, విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలనేది ఆయన వాదన. రాజకీయ పార్టీలతో సంబంధం లేని స్టూడెంట్ కౌన్సిల్ లేదా వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ వంటి స్వతంత్ర విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కేవలం విద్యార్థుల సమస్యలపైనే దృష్టి పెడతాయని చెబుతున్నారు. అయితే ఈ ఆలోచన సరైంది కాదు అనేది యూనియన్స్ చెబుతున్న మాట. ఇప్పుడీ నిర్ణయం మరోసారి జెన్ జీ పోరాటానికి తెరలేపుతుందా? అనే క్వశ్చన్ మొదలైంది. అదే జరిగితే మరోసారి నేపాల్‌లో ప్రభుత్వం మారక తప్పని పరిస్థితి వస్తుందనే చర్చ మొదలైంది.
Also Read: కాంగ్రెస్ నాయకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో పదవులు భర్తీ.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..!
నిర్ణయాలు.. వాటి వల్ల నిరసన హోరు కొనసాగుతుండగానే.. నేపాల్ మంత్రి వర్గంలో ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం అనేది మాములు విషయం కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంపై అంచనాలు.. వారి వారి విద్యార్హతల గురించి ప్రపంచం మొత్తం చర్చించింది. అలాంటి సమయంలో ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. హోంమంత్రిగా ఉన్న సుదాన్ గురుంగ్, కార్మిక మంత్రిగా ఉన్న దీపక్ కుమార్ షా రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 22న సుదాన్ గురుంగ్ రాజీనామా చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక దీపక్ కుమార్ తన భార్యను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా నియమించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు.
అయితే ఈ రాజీనామాలను ఇంత సింపుల్‌గా చూడటం లేదు నేపాల్ ప్రజలు. అవినీతి రహిత పాలన అందిస్తామని మాట ఇచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఇది అగ్ని పరీక్షలాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయనేది సుదాన్ గురుంగ్‌పై ఆరోపణలు. దీనికి తగ్గట్టుగానే తన ఆస్తుల ప్రకటనలో పొంతన లేకపోవడం కూడా ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో పదవి కంటే నైతికత ముఖ్యమంటూ ఆయన రాజీనామా చేశారు. సుదన్ గురుంగ్ వైదొలగడంతో హోం శాఖ బాధ్యతల్ని ప్రధాని బాలెన్ షానే చూసుకుంటున్నారు. పదవి చేపట్టిన 13 రోజులకే ఆయన పదవి కోల్పోయాడు కార్మిక శాఖ మంత్రి దీపక్ కుమార్ షా.
నేపాల్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. తాజాగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా యువత మద్దతుతో, కొత్త ముఖాలతో కొలువుదీరింది. అయితే పరిపాలనా అనుభవం లేకపోవడం, ప్రతిపక్షాల నుంచి ఎదరువతున్న ఒత్తిడిని తట్టుకోవడం బాలెన్ షాకు సవాలుగా మారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యమైతే.. ఈ ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకం త్వరగానే సన్నగిల్లే ప్రమాదం ఉంది.
Also Read: ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసిన కేసీఆర్! సమ్మె నేపథ్యంలో నాటి చేదు అనుభవాల యాది…
అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పటికే ఇప్పుడు పరిస్థితులు మారాయి. నేపాల్ హిస్టరీని చూస్తే ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఎందుకంటే 2008 నుంచి 2025 దాకా.. అంటే 17 ఏళ్లల్లో 14 ప్రభుత్వాలు మారాయి. అక్కడ అన్ స్టెబులిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కీచులాటలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు అనేవి కామన్‌గా మారాయి. వీటికి తోడు విపరీతమైన రేట్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం.. ఇవన్నీ నేపాలీల్లో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావడంతో ప్రజాస్వామ్యంపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంప ముంచాయ్. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే.. నేపాల్ మాత్రం అల్లకల్లోలంగా ఉంటోంది. హిమాలయాలు ఉన్నా.. టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్నా.. చిన్న దేశమైనా… తలరాత మార్చుకోలేకపోయారు.
వీటిపై చిరాకు పెరిగే యువత రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టింది. ఈ ఆందోళనల్లో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నేతలు కీలకపాత్ర పోషించారు. ఫర్ ఎగ్జాంపుల్ సుదాన్ గురుంగ్.. ఆయన జెన్ జీ ఆందోళనల సమయంలో నిరసనకారులకు తాగునీరు అందిస్తూ, గ్రౌండ్ లెవల్‌లో చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. అందుకే ఎన్నికల్లో గోర్ఖా-1 నియోజకవర్గం నుండి గెలిచారు. ఆయనపై ఉన్న మంచిపేరు కారణంగానే బాలెన్ షా క్యాబినెట్‌లో అత్యంత కీలకమైన హోం మంత్రి పదవిని దక్కించుకున్నారు. కానీ చివరికి పదవి పోయింది. దీపక్ కుమార్ కూడా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రతినిధిగా మంచి పేరు ఉంది. కానీ సొంత వారి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడీ అసంతృప్తిని ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే.. బాలేన్ షా ప్రభుత్వం అంత ఎక్కువ అధికారంలో ఉంటుంది. లేదంటే నేపాల్‌లో ప్రభుత్వాలను గద్దె దింపడం.. మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కొత్త కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రమటిక్‌గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీయులు నేపాల్‌ను పాలించారు. అయితే రాజు ఉన్నా పర్వా లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలని 1990ల్లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారాలు ఏమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీరేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్‌లో రాచరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరిమణులను హతమార్చారు. ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠంపై కూర్చున్నాడు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక, గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయి ఉండేది. కానీ దురదృష్టం నేపాల్ ను వెంటాడింది.
Also Read: రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?
నేపాల్‌లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్‌గా కనిపించిందనే చెప్పాలి. దీంతో ప్రజల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలపై అసహనం మెుదలైంది. హంగ్ పార్లమెంట్ రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, నేపాలీలు కూడా ఒక పార్టీకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వకపోవడం ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి. అవినీతి పెరిగింది. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్యే రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనలు కూడా చేశారు. అలాంటి సమయంలో జెన్ జీ ఉద్యమం జరగడం.. ఫుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడటం నేపాల్ ప్రజల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. కానీ ఇప్పుడు నెల రోజులు కూడా గడవకముందే మళ్లీ ఈ ఆశలకు బీటలు కనిపిస్తున్నాయి. మరీ బాలేన్ షా ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా? అనే దానిపైనే ఇప్పుడు నేపాల్ భవితవ్యం ఆధారపడి ఉంది.
Storey By: Anup Big Tv