Sai Baba: ఏపీ మంత్రి ఆనం షిరిడీ సాయిబాబా పై హాట్ కామెంట్స్ చేశారు. సాయిబాబా ఆలయాలకు టీటీడీ నిథుల కేటాయింపు అనే అంశంపై ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయనేమన్నారో ఇప్పుడు చూద్దాం.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అధ్వర్యంలో వివిధ ఆలయాల అభివృద్ధి నిధుల మంజూరు వ్యవహారంపై మంత్రి ఆనం సంచలన కామెంట్లు చేశారు. షిరిడీ సాయిబాబా ఆలయాలకు టీటీడీ నుంచి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి మంత్రి చెప్పిన కారణాలేంటంటే, హిందూ సంప్రదాయాల ప్రకారం గానీ, పురాణాల ప్రకారం గానీ, ఆగమ శాస్త్రాలలో గానీ ఎక్కడా షిరిడీ సాయిబాబా ప్రస్తావన లేదని గుర్తుచేశారు మంత్రి. దేవాదాయ శాఖ సనాతన హిందూ ధర్మాదాయ చట్టాలు, నిబంధనల పరిధిలోనే పనిచేయాల్సి ఉందని అంటారాయన. షిరిడీ సాయిబాబాను కేవలం హిందూ భక్తులే కాకుండా అన్యమతస్తులు కూడా పెద్ద సంఖ్యలో కొలుస్తారనీ.. అందరికీ ఆయన ఆరాధ్యుడనీ అంటారు మంత్రి ఆనం. సాయిబాబా ఆలయాలకు వివిధ వర్గాలకు చెందిన భక్తుల నుంచి భారీ ఎత్తున విరాళాలు వస్తుంటాయనీ.. ఈ ఆలయాలకు నిధుల కొరత లేదు. కాబట్టి, టీటీడీ ప్రత్యేకించి నిధులు కేటాయించనవసరం లేదంటారు. మంత్రి తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకలు కేవలం హిందూ ధర్మ ప్రచారానికి, కొత్త ఆలయాల పునరుద్దరణకు మాత్రమే వాడాలన్న నిబంధనలున్నట్టు గుర్తు చేశారు మంత్రి ఆనం.
ఒక వర్గం ప్రజలు, సంప్రదాయవాదులు మంత్రి వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. షిరిడీ సాయిబాబాను అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా కొలిచే భక్తులు మాత్రం.. మంత్రి కామెంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి కామెంట్లకు అర్ధం ప్రభుత్వం, దేవాదాయ శాఖ పాలనాపరమైన నిబంధనల గురించి వివరించడం. అయితే, ఆయన సాయిబాబా ఆలయాలపై ఇంత నిర్మొహమాటంగా, కుండ బద్దలు కొట్టేలా మాట్లాడ్డం మాత్రం హాట్ టాపిగ్గా మారింది. ఇటీవలి కాలంలో షిరిడీ సాయిబాబా హిందువా? కాదా అంటూ పలురకాల వివాదాలు చెలరేగుతున్నాయి. ద్వారకా, పూరి వంటి పీఠాధిపతులు.. సాయి బాబా ఆరాధనను తీవ్రంగా తప్పు పడుతున్నారు. కొందరు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్షర్లు.. సాయిబాబాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. వీరిపై వివిధ ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి.
Also read: Tejeswi Madivada: చూపులతో చంపేస్తున్న తేజు..అబ్బా చంపేస్తుంది మావా…
ఒకప్పుడు హిందూ దేవుళ్లలో భాగంగా ఉన్న సాయిబాబా కాలక్రమేణా ఆయన హిందువు కాడన్న కోణంలో జరిగిన చర్చల వల్ల ఈ ఆలయాలపై నీలి నీడలు అలుముకున్నాయి. అంతే కాదు ఢిల్లీ, ఇండోర్ వంటి ప్రాంతాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదాలు చెలరేగాయి. కొందరిపై సాయిబాబాను సైతం మత రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. తరచూ సాయిబాబాపై ఎందుకీ వివాదాలు? కారణాలేంటి? ఆనం కామెంట్లతో కొత్త చర్చకు దారి తీశాయా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. ఇటీవల షిరిడి సాయిపై వస్తోన్న వివాదాల పరంపర ఏంటి? అసలు సాయిబాబా హిందువేతరుడిగా ముద్ర పడ్డం వెనక ప్రధాన కారణాలేంటి? ఆ డీటైల్స్
సనాతన శాస్త్రాల్లో బాబా ప్రస్తావన లేదన్న కారణంగా హిందూ దేవాలయాల నుంచి సాయి విగ్రహాలను తీసేశారు. ఢిల్లీ, ఇండోర్ వంటి కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల కమిటీలు, కొన్ని హిందూ సంఘాలు, సాయిబాబా విగ్రహాలను తొలగించారు. దీనిపై భక్తులు కోర్టులను ఆశ్రయించడం అప్పట్లో పెను దుమారంగా మారింది. సాయిబాబా ఒక ఫకీరులా జీవించారని, అల్లా మాలిక్ అంటారనీ చెబుతారు. ఆయన నివసించిన ద్వారకామాయి హిందూ ఆలయం కాదని అంటారు. అందుకే ఆయన విగ్రహాలను హిందూ ఆలయాలలో ప్రతిష్ఠించడం ఆగమ శాస్త్ర విరుద్ధమని.. కొందరు మద్రాస్ హైకోర్టులో ఏకంగా పిల్ దాఖలు చేశారు.
మహారాష్ట్రలోని పత్రి అనే గ్రామం సాయిబాబా జన్మస్థలమ అంటారు. దీని అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని, గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే షిర్డీ ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. బాబా జన్మస్థలంపై స్పష్టమైన ఆధారాలు లేవన్నది వీరి వాదన. హిందూ భక్తుల కానుకలతో నడిచే టీటీడీ, దేవాదాయ శాఖ నిధులను సాయిబాబా ఆలయాల అభివృద్ధికి కేటాయించలేం అంటారు ఏపీ దేవాదాయ మంత్రి. తాజాగా మంత్రి చేసిన ఈ కామెంట్లతో మరో రకం చర్చకు దారి తీసింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు సాయిబాబా చరిత్రపై, ఆయన మత గుర్తింపుపై అభ్యంతరకరమైన ప్రచారాలు చేశారు. దీనిపై షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది.
Also read: ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు
సోషల్ మీడియాలో బాబాపై అసత్య ప్రచారాలు, వివాదాస్పద పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలువురు యూట్యూబర్లపై షిర్డీ పోలీసు కేసులు నమోదు చేశారు. నేరుగా వారి ఇంటికే లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. గతంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, పూరి గోవర్ధన్ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి వంటి.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సైతం సాయిబాబాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ను భగవంతుడిగా పూజించడాన్ని వద్దని పిలుపునిచ్చారు. ఇది సాయి భక్తుల మనో భావాలను పెద్ద ఎత్తున గాయపరిచింది. సాయిబాబా భక్తిని, ఆలయాలను కొందరు మత రాజకీయాలు కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. భారీ విరాళాల కోసమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
సాయి తరచూ సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు. దీంతో అందరి దేవుడు ఒక్కడే- అనే సిద్ధాంతాన్ని నమ్ముతారాయన భక్తులు. కానీ మారుతున్న సామాజిక సమీకరణాల్లో భాగంగా చూస్తే, ఆయనను ఒక మతానికి పరిమితం చేయాలా? లేక, అందరివాడిగా చూడాలా? అనే సంఘర్షణ గత కొంతకాలంగా నడుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. సాయిబాబా ఏ కాలానికి చెందిన వారు? ఆయన జీవిత కథ ఏం చెబుతోంది? సాయిబాబా ఇటీవల వివాదాలకు కేంద్రం కావడానికి గల కారణాలు ఎలాంటివి? షిరిడీ సాయిబాబా 19వ- 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి చెందినవారు. చారిత్రక ఆధారాల ప్రకారం, ఆయన జీవిత కాలం 1838 నుంచి 1918 వరకు సాగింది.
బేసిగ్గా సాయిబాబా జన్మస్థలం పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వంటి స్పష్టమైన వివరాలు లేవు. ఆయన 1838లో జన్మించారని అంటారు. చరిత్రకారులు దాసగణు మహారాజ్ రాసిన సాయి గురుచరిత్ర వంటి గ్రంథాల ప్రకారం, బాబా తన ఐదేళ్ల వయసు వరకు ఒక సూఫీ ఫకీర్ దగ్గర పెరిగారని, ఆ తర్వాత గోపాలరావు దేశ్‌ముఖ్ అనే గురువు వద్ద కొన్నేళ్లపాటు ఆధ్యాత్మిక శిక్షణ పొందారని భావిస్తారు. 1854లో సుమారు 16 సంవత్సరాల వయసున్న ఒక యువకుడిగా బాబా మొదటిసారి మహారాష్ట్రలోని షిరిడీకి వచ్చారు. అక్కడ ఒక వేప చెట్టు కింద ఎవరితోనూ మాట్లాడకుండా ధ్యానంలో కూర్చునేవారు. కొంతకాలం తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. 1858లో చంద్ పాటిల్ బంధువుల పెళ్లి బారాత్‌తో కలిసి బాబా తిరిగి షిరిడీ చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి- ఆయనను చూసి ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుంచి ఆయనకు సాయిబాబా అనే పేరు స్థిరపడిపోయింది. నాటి నుంచి మరణించే వరకు ఆయన షిరిడీలోనే నివసించారు.
Also read: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!
షిరిడీలో ఒక పాత, శిథిలావస్థలో ఉన్న మసీదును తన నివాసంగా మార్చుకున్నారు. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు సాయి బాబా. మోకాళ్ల వరకు ఉండే ఒకే ఒక కఫ్నీ కట్టుకునే వారు. తలకు ఒక గుడ్డ కట్టుకుని చాలా సాదాసీదాగా జీవించేవారు. ఎప్పుడూ సబ్ కా మాలిక్ ఏక్ అనేవారు సాయిబాబా. అందరి దేవుడూ ఒకరేనని బోధిస్తూ, కులమతాల పట్టింపులు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. తాను నివసించే ద్వారకామాయిలో నిత్యం ధుని వెలిగించేవారు. దాన్నుంచి వచ్చే భస్మాన్ని ఉదిగా భక్తులకు పంచేవారు. దీంతో తమకొచ్చిన రోగ బాధలు నయమయ్యేవని విశ్వసించేవారు ఆయన భక్తులు. నీటితో దీపాలు వెలిగించడం, కలరా వ్యాధిని అదుపు చేయడం, భక్తుల ప్రాణాలను రక్షించడం, ప్రకృతిని శాసించడం, అంతర్యామిగా భక్తుల మనసులను చదవడం.. వంటి లీలలు ప్రదర్శించారు సాయిబాబా. దీంతో ఆయన్ను షిరిడీ పరిసర ప్రాంత భక్తులంతా కలసి ఒక దైవంగా భావించడం మొదలు పెట్టారు.
1910 తర్వాత బాబా కీర్తి ముంబైతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. నానాసాహెబ్ చందోర్కర్, దాసగణు, హేమాడ్‌పంత్ వంటి ఎందరో ప్రముఖులు ఆయనకు భక్తులయ్యారు. చివరికి 1918, అక్టోబర్ 15వ తేదీన, విజయదశమి రోజునాడు సాయిబాబా షిరిడీలోనే మహాసమాధి చెందారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సమాధి మందిరమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సాయి భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఇప్పటికీ ఎందరో ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ.. సమాధిలోని బాబా నుంచి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఆయన సచ్చరిత్ర పారాయణతో సమస్తమైన కష్టాలు తీరిపోతాయని విశ్వసిస్తుంటారు. ఆయన సూచించిన ఏకాదశ సూత్రాలను ఆచరించడం వల్ల తమ జీవితాల్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తుంటాయని నమ్ముతుంటారు. అయితే ఇవన్నీ హిందూ సనాతన ధర్మాచారం ప్రకారం విరుద్దమంటారు కొందరు సంప్రదాయవాదులు. దీంతో సాయి ఆరాధన హిందుత్వంలో భాగం కాదన్న వాదన ఒకటి బయలుదేరింది. ఇదే తరచూ వార్తలకెక్కుతూ.. సాయి భక్తులను కలవరపరుస్తోంది.
Also read: Allu Arjun: ఆఖరి నిమిషంలో అల్లు అర్జున్‌కి సీన్ రివర్స్.. బోనులో నిలబడకుండా పుష్పరాజ్ ఏం చేశారంటే?