అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.. హిందూపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్నా పెద్దగా గుర్తింపు లేని వ్యక్తి. అయితే 2024 ఎన్నికల్లో కాలం కలిసి వచ్చి బాలకృష్ణ ఆశీస్సులు, సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సీనియర్లను కాదని అనంతపురం ఎంపీ సీటుని ఎగరేసుకొని పోయారు. ఎంపీగా గెలిచిన మొదట్లో ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తూ నియోజకవర్గం పర్యటనలు చేస్తూ జాతర్ల పేరుతో హడావుడి చేశారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట్లో హడావుడి చేసిన ఎంపీ ఆ తర్వాత పెద్దగా అనంతపురంలో ఉండటం లేదంట. కేవలం నెలా ఒకటో తేదీ మాత్రం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నా ఠంచనుగా అనంతపురంలోనే ఉంటారనే టాక్ నడుస్తోంది. ఒకటో తేదీన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారట. అలాగే ఎంపీగా ఎక్స్ అఫిషియో హోదా దక్కించుకున్న ఆయన జడ్పీ, మున్సిపల్ సమావేశాలకు కూడా పెద్దగా హాజరు అవ్వడం లేదంట. ఎక్కువగా అమరావతి , ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని టాక్ .
నియోజకవర్గంలో ఏమైనా వ్యవహారాలు ఉంటే తన బంధు వర్గం ముఖ్యంగా కొడుకుతో నడిపిస్తున్నారట. అనంతపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. కేవలం అనంతపురం అర్బన్, మరో నియోజకవర్గం లో మాత్రమే అడపాదడపా కనిపిస్తున్నారంట. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను నియోజకవర్గానికి కూడా ఆహ్వానించడం లేదంట.. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే హిందూపురం నుంచి అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం షిఫ్ట్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు అత్యంత సన్నిహితుడు అవడంతోనే.. స్థానికేతరుడైనప్పటికీ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని అనంతపురం టీడీపీ నాయకులు ఆమోదించారు.
అనంతపురం ఎంపీగా గెలిచిన అంబిక లక్ష్మీనారాయణ అడపాదడపా మాత్రమే అనంతపురంకు వస్తున్నారట. అసలు నియోజకవర్గంలోకి ఎప్పుడు వచ్చి, ఎప్పుడు వెళ్ళింది కూడా స్థానికంగా ఉన్న నాయకులకు, ఎమ్మెల్యేలకే తెలియడం లేదంట. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తనకంటూ నమ్మకైన మనుషులు, కేడర్ లేకపోవడం ఆయనకు కొంత మైనస్ గా కనిపిస్తోందంటున్నారు. దాని వల్లే ఆయన పెద్దగా అనంతపురం వైపు చూడడం లేదనేది టీడీపీ నాయకులు చెప్తున్న మాట. అంతేకాక అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని అనేకమంది ఎమ్మెల్యేలతో ఎంపీకి మధ్య సఖ్యత లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: చెల్లించిన బకాయిల కోసం పోరా? పాత లెక్కలా కథ ఏంటి రెడ్డి..
దాంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం కంటే అమరావతిలోని ఎక్కువగా ఉంటున్నారని టాక్. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా. హిందూపురం వెళ్లడానికే మొగ్గు చూపుతారు. తప్ప అనంతపురం వైపు పెద్దగా రారని స్వయంగా తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. తొలిసారి ఎంపీ అయిన అంబికా లక్ష్మీనారాయణ.. అప్పుడే తన రాజకీయ వారసుడి కోసం బాటలు వేస్తున్నారట. ఎంపీగా గెలిచాక అంబికా లక్ష్మీనారాయణ తన కొడుకును నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు తీసుకొని వెళ్లి అందరికీ పరిచయం చేశారంట.
ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎంపీ తన కుమారుడిని కూర్చోబెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. స్థానికేతరుడిని అవడం వల్లే తనకు సొంతంగా క్యాడర్ లేదని.. అందుకే ఎక్కడికక్కడ ఇతర పార్టీలోని తన వర్గం నాయకులు కూడా చేరదీస్తూ తన సొంత క్యాడర్ ని పెంచుకొనే పనిలో పడ్డారంట. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకంటూ వర్గం ఏర్పాటు చేసుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారంట. తమ నియోజకవర్గాల్లో ఎంపీ వర్గం ఏర్పాటు చేసుకోవడంపై అటు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. మరి పార్టీ పెద్దలు ఈ పరిస్థితిని ఎలా సెట్‌రైట్ చేస్తారో చూడాలి.