E-Paper
Advertisement

మార్పుల్లేవ్.. రాంచందర్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?

మార్పుల్లేవ్.. రాంచందర్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు(ఎన్ఆర్ఆర్) నాయకత్వంలోనే వెళ్లే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు మార్పు చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగాల్సి ఉండగా.. ‘జమిలి’ ఎన్నికల ప్రతిపాదన అమల్లోకి వస్తే 2029 మే లేదా జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాంచందర్ రావుకు ఇంకా సుమారు రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో.. మధ్యలో అధ్యక్షుడిని మార్చడం అంత సులభం కాదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించిన నేపథ్యంలో.. సంస్థాగతంగా తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

బలమైన నాయకులకు కీలక బాధ్యతలు..

Advertisement

తెలంగాణ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడిని కొనసాగిస్తూనే పార్టీకి బలమైన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల సమరానికి సిద్ధం చేయాలనే ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవిలో మార్పు చేసినా.. కొత్త నాయకత్వం రాష్ట్ర పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు నాయకత్వ మార్పు చేయడం వల్ల సంస్థాగతంగా ఏర్పడే అసంతృప్తి, సమన్వయ సమస్యలు పార్టీకి ప్రతికూలంగా మారొచ్చన్న అభిప్రాయమూ ఉంది.

రాజకీయ వర్గాల్లో కీలక నేతల పేర్లు..

Advertisement

అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు కీలక నేతల పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో బీజేపీకి బలమైన ప్రజా మద్దతు సాధించాలంటే బండి సంజయ్ వంటి దూకుడు ఉన్న నాయకత్వం అవసరమని పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్నికల నాటికి క్యాడర్‌ను మరింత సమర్థంగా సమీకరించడంతో పాటు.. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమనే అంచనాలు కొందరిలో ఉన్నాయి.

Also Read: మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

హైకమాండ్‌తో చర్చ..

ఇదే సమయంలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు తదితరుల పేర్లు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తున్నాయి. గతంలోనూ వీరు జాతీయ నాయత్వంతో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా హైకమాండ్ తో ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే అధ్యక్ష పదవి కోసం ఆశావహులు ఎంతమంది ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి రాంచందర్ రావును మార్చే ఉద్దేశం అధిష్ఠానంలో లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

అధికారాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యం..

రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నందున.. అధ్యక్షుడి మార్పు కంటే బలమైన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆశావహులకు ఇతర కీలకమైన బాధ్యతలను అప్పగించి ముందుకు నడిపించేలా కార్యాచరణను రూపొందించే యోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, నియోజకవర్గాల వారీగా నాయకత్వాన్ని సమన్వయం చేయడం, బలమైన సామాజిక వర్గాలను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

పార్టీ వర్గాల్లో చర్చ..

మొత్తంగా చూస్తే.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై అనేక పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రాంచందర్ రావు నేతృత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సమయానికి పరిస్థితులు, అధిష్ఠానం వ్యూహం, జమిలి ఎన్నికలపై తుది నిర్ణయం వంటి అంశాలను బట్టి నాయకత్వంపై మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే అప్పటివరకు రాంచందర్ రావును కొనసాగిస్తూ.. ఆశావహులైన కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి తెలంగాణలో అధికార సాధన దిశగా పార్టీని నడిపించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Also Read: హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!

Tags

Related News

గులాబీ నేతలకు ఏమైంది?.. పట్నం వదలట్లేరు, పల్లెకు రావట్లేరు!

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!

మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

సిటీ ఓటర్లకు బిగ్ షాక్! సగానికి పడిపోయిన వోటింగ్ కౌంట్.. కారణం ఇదే!

నగర రోడ్లపై రోజుకు 1200 మందికి పైగా మందుబాబులు.. అసలు చట్టం అంటే భయం పోవడానికి కారణమేంటి?

హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!

Big Stories

Advertisement
×