Chairperson Renewal: కార్పొరేషన్ చైర్మన్ల రెన్యువల్ సమయంలోప్రభుత్వానికి చేరిన స్పెషల్ రిపోర్టు ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. గత రెండేళ్లుగా పదవుల్లో కొనసాగిన చైర్మన్లు ఏం సాధించారు? తమ తమ సంస్థలను ఏ మేరకు ముందుకు తీసుకెళ్లారు? ప్రజాక్షేత్రంలో వారి ముద్ర ఏమిటి? అనే అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పదవుల రెన్యువల్ ప్రతిపాదనలు ముందుకు రావడంతో, ఈసారి కేవలం రికమండేషన్ల ఆధారంగా కాకుండా పూర్తిగా పర్ఫార్మెన్స్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై రహస్యంగా ఒక సమగ్ర ఇంటెలిజెన్స్ సర్వేను నిర్వహించింది. ఈ నివేదిక ఆధారంగానే చైర్మన్ల భవిష్యత్తు నిర్ణయం కానుంది. ఆయా చైర్మన్ల శాఖలు, సంస్థలకు కేటాయించిన బడ్జెట్ వినియోగం, ప్రజలకు పథకాలను చేర్చడంలో చూపిన చొరవ వంటి అంశాలపై ఆ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఇక సొంత శాఖలో, బయట గానీ ఎలాంటి అవినీతి, వివాదాస్పద వ్యాఖ్యలకు తావివ్వకుండా పనిచేశారా లేదా? అనే అంశాలను సైతం రిపోర్టులో పొందుపరిచినట్లు సమాచారం. కేవలం ఆఫీసులకే పరిమితమయ్యారా లేక జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వం అందించే లబ్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లారా? అనే అంశాలను కూడా సీఎం స్పష్టంగా పరిశీలించనున్నారు.
చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు సంబంధిత శాఖా మంత్రులను బైపాస్ చేస్తూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు గతంలో సీఎం దృష్టికి వచ్చాయి. అందుకే ఈసారి “మంత్రులతో సమన్వయం” అనేది కీలక ప్రామాణికంగా మారింది.సదరు కార్పొరేషన్ చైర్మన్ వల్ల సంబంధిత మంత్రికి లేదా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదా? కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడంలో మంత్రుల సహకారంతో ఎలాంటి ఫలితాలు సాధించారు? అనే విషయాలపై సీఎం నేరుగా మంత్రుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.
Also Read: అమిత్ షా పర్యటన వేళ.. అరుణాచలంలో తీవ్ర కలకలం.. హైదరాబాద్ యువకులు అరెస్ట్!
అంతేగాక ఆయా చైర్మన్లు మంత్రులను ఎన్నిసార్లు ఏ పని మీద కలిశారనే అంశాలను కూడా స్పెషల్ రిపోర్టులో క్రోడీకరించినట్లు తెలిసింది. అంతేగాక మంత్రుల చుట్టూ తిరుగుతూ పైరవీల చేసిన నేతల వివరాలు కూడా సీఎం దృష్టిలో ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి చేరిన రిపోర్టు ప్రకారం 80 శాతం మార్కులు పొందిన చైర్మన్లకు ఆటోమెటిక్ గా రెన్యువల్ చేయనున్నారు. 50 శాతం మార్కులు పొందిన చైర్మన్లకు హెచ్చరికలతో కూడిన రెన్యువల్ లేదా, శాఖ మార్చి ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక 50 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన చైర్మన్లకు పదవి కోత తప్పనిసరిగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ ప్లేస్ లో కొత్త నాయకులకు అవకాశం కల్పించనున్నారు.
రెండేళ్ల పాటు అధికార హోదా అనుభవించిన పలువురు చైర్మన్లకు ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు పెద్ద షాక్‌గా మారింది. పనితీరు సక్రమంగా లేని, స్థానిక నేతలతో పొసగని వారికి ఈసారి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తెలిసింది.ఇప్పటికే రెన్యువల్ ఆశలతో సచివాలయం, సీఎం ఓఎస్డీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నేతలకు “రిపోర్టులో మార్కులు తక్కువగా ఉన్నాయి” అనే సంకేతాలు రావడంతో పీఠం కదులుతోందనే భయం పట్టుకుంది. ఎవరికి రెన్యువల్ దక్కుతుంది, ఎవరిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారనేది మరికొద్ది రోజుల్లో రాబోయే సర్కారీ ఉత్తర్వులతో స్పష్టం కానుంది. ఫస్ట్ ఫేజ్ లో 37 మంది మందికి చైర్మన్లుగా అవకాశం రాగా, రెన్యువల్ లో సుమారు 30 శాతం మందికి కూడా చేసే ఛాన్స్ లేదనే టాక్ పార్టీలో వినిపిస్తుంది.
Also Reda: బిగ్ బాస్ సీజన్ 10లోకి జబర్దస్త్ కమెడియన్.. పంచ్ లకు కొదవే లేదు!