Irrigation Water: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలంలో ఆరుతడి పంటల సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,01,063ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రాజెక్టుల్లో మిగులు జలాలను పూర్తిస్థాయిలో రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
వివిధ జలాశయాల్లో తాగునీటి అవసరాలకు తగినంత నీటి నిల్వలను కేటాయించిన అనంతరమే, మిగిలిన మిగులు జలాలను ఆరుతడి పంటలకు మళ్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం చివరిలో నమోదైన నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకుని, రైతాంగానికి పంట నష్టం కలగకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అందుకే కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై అధ్యాయనం చేశారు. ఎంత నీటి కేటాయింపులు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోదావరిలో 605955 ఎకరాలు, కృష్ణా లో 95108 ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని కృష్ణాబేసిన్ లోని ప్రాజెక్టుల కింద 95,108 ఎకరాలకు ఆరుతడి పంటలకు సాగునీరు అందించనున్నారు. మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలు, వికారాబాద్ లోని కోటెపల్లి ప్రాజెక్టు కింద 2 వేల ఎకరాలు, డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలు, వరంగల్ పాకాల్ సరస్సు కింద 18,193 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలోని ఎల్ టీ బయ్యారం కింద 7200 ఎకరాలు, ఖమ్మం వైరా ప్రాజెక్టు కింద 17390 ఎకరాలు, లంకసాగర్ ప్రాజెక్టు కింద 7350 ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
Also Read: అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!
గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల కింద 6లక్షల5వేల 955ఎకరాలకు కేవలం ఆరుతడి పంటలకు నీరుఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యధికంగా జేచొక్కారావు దేవాదుల లిప్టు లిరిగేషన్ పథకం కింద వరంగల్, ములుగు, హనుమకొండ, జనగాం జిల్లాల పరిధిలో 2లక్షల 74వేల 683 ఎకరాలకు నీరుఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని లక్షా24వేల 254 ఎకరాలకు, ఆదిలాబాద్ కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద 61వేల ఎకరాలు, అప్పర్ మానేరు పరిధిలో 13,085 ఎకరాలు, సిద్దిపేటలోని శనిగరం ప్రాజెక్టు కింద2536 ఎకరాలు, నిర్మల్ స్వర్ణ ప్రాజెక్టు కింద 8945 ఎకరాలు, ఆదిలాబాద్ సత్నాల ప్రాజెక్టు కింద 24వేల ఎకరాలు, మత్తడివాగుప్రాజెక్టు కింద9200 ఎకరాలు, నిజామాబాద్ రామడుగు కింద 6104 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బొగ్గుల వాగు కింద 3300 ఎకరాలు, ములుగు రామప్ప సరస్సు కింద 5180 ఎకరాలు, పాలేం వాగు కింద 7500 ఎకరాలు, కామారెడ్డిలోని కౌల్సనాలా కింద 9ఎకరాలు, పోచారం కింద 10,300 ఎకరాలు, మంచిర్యాల జిల్లారాలివాగు కింద 1800 ఎకరాలు, నిల్వాయి కింద 7వేల ఎకరాలు, కొమురంభీం జిల్లాలో ఎన్టీఆర్ సాగర్ కింద 2668 ఎకరాలు, వట్టివాగు కింద 17200 ఎకరాలు, పీపీరావు ప్రాజెక్టు కింద 8 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో గొల్లవాగు ప్రాజెక్టు కింద 4700 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు కింద 5500 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలుల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో నీటినిల్వలపై ప్రతి రోజూ ఆరా తీస్తున్నారు. నీటి విడుదల తేదీలను జిల్లాల వారీగా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!