E-Paper
Advertisement

బొత్సను పక్కన పెట్టిన వైసీపీ.. జగన్ ప్లాన్ ఇదేనా!

బొత్సను పక్కన పెట్టిన వైసీపీ.. జగన్ ప్లాన్ ఇదేనా!
Advertisement

YSR Padayatra: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో అన్న ఎన్టీఆర్ చైతన్యరథ యాత్ర ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి, దివంగత నేత వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాద యాత్ర చేసి అనుకున్నది సాధించి సీఎం అయ్యారు. అప్పట్లో అంత సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ పాదయాత్ర తిరిగి ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఆ పాదయాత్ర ఆయన సీఎం పీఠం అధిరోహించడానికి తోడ్పడితే.. ఇప్పుడదే పాదయాత్రపై చర్చ రాజకీయంగా పెను కలకలం రేపుతోంది.

ప్రజల గుండెల్లో చిరస్థాయి నాయకుడు

ఆరోగ్య శ్రీ , 108 అంబులెన్సు, ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవన్నీ తెలుగు ప్రజల మనసులను హత్తుకున్న హామీలు.. ఆ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కావడానికి ఆ హామీలతో పాటు తోడ్పడింది ఆయన చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర. ప్రజా ప్రస్థానం పేరుతో 60 రోజుల పాటు 1475 కిలోమీటర్లు మేర చేసిన పాదయాత్ర అప్పట్లో తెలుగు నేల మీద రాజకీయ విప్లవం సృష్టించింది .

అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Advertisement

అయితే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల్లో మరోసారి రచ్చలేపుతోంది. సరిగ్గా ఈ ఏప్రిల్ 9 నాటికి వైఎస్ఆర్ పాదయాత్ర 23 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దివంగత నేత కుమారుడు, మాజీ సీఎం జగన్ నాన్న ఇదే రోజున పాదయాత్ర ప్రారంభించారని .. అదొక ప్రభంజనం అని , తాను కూడా 2027 లో మరోసారి పాదయాత్ర చేస్తానని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దీనిపై రియాక్ట్‌ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు .. జగన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందనే అనుమానాలు ఊన్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ మరణించిన సమయంలో అప్పటి కాంగ్రెస్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను కూడా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

వైఎస్సార్ మరణం వెనుక జగన్ పాత్ర?

తండ్రి మరణం వెనుక జగన్ పాత్ర ఉందని నాడే బొత్స అనుమానం వ్యక్తం చేశారని అచ్చెన్ననాయుడు గుర్తుచేశారు , జగన్ నైజం చూస్తుంటే ఆ మాటలు నిజమే అనిపిస్తోందిని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్ , వివేకానంద రెడ్డి మరణాల వల్ల రాజకీయంగా అత్యధికంగా లాభపడింది జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని విమర్శించారు. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, అందుకే సొంత తల్లిని కూడా బయటకు పంపించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని సీయం సీటు కోసం సంతకాలు సేకరణ చేశారని ఆరోపించారు.

అచ్చెన్న వ్యాఖ్యల ఎఫెక్ట్ బొత్సపై

Advertisement

అచ్చెన్న వ్యాఖ్యలు జగన్ వరకు పరిమితమైతే ఒకలా ఉండేదేమో. అప్పట్లో బొత్స చేసిన వ్యాఖ్యలు కూడా ఉటంకించడంతో పొలిటికల్‌గా హైడ్రామాకు తెర లెగిసింది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు అచ్చెన్న ఎఫెక్ట్ బొత్స మీద పడింది. ప్రస్తుతం వైసీపీ లో బొత్స కీలకంగా ఉండడం ఆయనను మరింత ఇబ్బంది పెట్టింది. పుండు మీద కారం చల్లినట్లు అయింది. ఇప్పుడిపుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్న బొత్సకి అచ్చెన్న వ్యాఖ్యలతో కరెంట్ షాక్ కొట్టినట్లైంది. వెంటనే హుటా హుటిన ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వెళ్లగక్కారు. మీడియా ముందు బోరున విలపించారు.

కన్నీళ్లు కార్చిన బొత్స

రాజకీయాల్లో విలువలు, ఉలవలు అంటూ బొత్స కొత్త రాగాన్ని అందుకున్నారు. కళ్లు తుడుచుకుంటూ ఆవేదన చెందారు. చౌకబారు వ్యాఖ్యలు , దిగజారుడు రాజకీయాలంటూ లబోదిబోమన్నారు. వైఎస్సార్ తో అనుబంధం, మహానేత మరణం అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. అయితే బొత్స వైఎస్సార్ , ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అంటే వందకు వంద శాతం చేశారని గూగుల్ తల్లిని అడిగినా చెబుతోంది. అప్పట్లో వైఎస్ రోజూ మద్యం సేవించేవారని కూడా బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అసెంబ్లీ వేదికగా కూడా బొత్స విజయమ్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని జగన్ అరెస్ట్ సమయంలో బొత్స వ్యాఖ్యానించారు.

బొత్సపై నెటిజన్ల ట్రోలింగ్

అప్పట్లో బొత్స మాట్లాడిన మాటల వీడియోలు ట్రోల్ చేస్తూ.. నెటిజన్లు ఆయనపై తెగ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ వివాదంలో అచ్చెన్న కి తెలుగు తమ్ముళ్లు వత్తాసు పలకగా.. బొత్స కి మాత్రం సపోర్ట్ కరువైందని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో వైఎస్ షర్మిల కూడా బొత్స పై ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో బొత్స పేరును ఉచ్చరిస్తూ తనకి తండ్రి సమానులు అంటూ జగన్ ప్రేమ ఒలకబోసారు. దీనిపై అప్పట్లోనే షర్మిల జగన్ కి కౌంటర్ ఇచ్చారు. తల్లిని తండ్రిని దుర్భాషలాడిన వ్యక్తి నేడు తండ్రి సమానులు ఎలా అయ్యారని అప్పట్లోనే మండిపడ్డారు.

బొత్సపై షర్మిల ఫైర్

తాజాగా బొత్స భావోద్వేగానికి గురైనప్పుడు కూడా షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కన్నతల్లి వైఎస్ విజయమ్మకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని తాజాగా డిమాండ్ చేశారు. గతంలో నిండు అసెంబ్లీలో తన తల్లి వైఎస్ విజయమ్మను బొత్స సత్యనారాయణ అవమానించారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని నాడు చులకన చేసి మాట్లాడి.. విజయమ్మను నిండు సభలో ఆయన కంటతడి పెట్టించారని ధ్వజమెత్తారు.

జగన్‌పై షర్మిల ఘాటు విమర్శలు

వైఎస్సార్ కోసం ప్రాణాలర్పించిన వారు, ఆయన కోసం పాదయాత్రలు చేసిన వారిని జగన్ పట్టించుకోకుండా, వైఎస్సార్‌ను తిట్టిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని అన్న బొత్సను ఇప్పుడు జగన్ అక్కున చేర్చుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో, ఇప్పడు బొత్సపై షర్మిల చేసిన వ్యాఖ్యలను పసుపు శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ఫోకస్ చేస్తున్నాయి.. అది అటు బొత్స కి , ఇటు వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డపడినట్లు అవుతోందంట. ఎలా కౌంటర్ అటాక్ చేయాలో కూడా పాలుపోవడం లేదంట. చూడాలి మరి ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ మున్ముందు బొత్స సత్తిబాబుపై ఎలా ఉండబోతుందో.

Also Read: హీరో ఎక్స్ ట్రీమ్ To అపాచీ.. చీప్ అండ్ బెస్ట్ డ్యూయల్ ఛానల్ ABS బైక్స్ ఇవే!

Story by: Apparao, Big Tv

Related News

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

Big Stories

Advertisement
×