Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఫినాలే వీక్‌కు ఇంకా ఒక్కవారం మాత్రమే ఉంది కాబట్టి ఈ వారమంతా కంటెస్టెంట్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఎవరో ఒక గెస్ట్‌ను హౌస్‌లోకి పంపిస్తూ కంటెస్టెంట్స్ అంతా వారితో సరదాగా సమయాన్ని గడిపేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వారంలో పలువురు సెలబ్రిటీ గెస్టులు హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్ చేశారు. తాజాగా కంటెస్టెంట్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం కోసం ఒక లైవ్ బ్యాండ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది. కంటెస్టెంట్స్ అంతా వారి పాటల్లో మైమరిచిపోయిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
అమ్మను గుర్తుచేసుకొని
‘‘100 రోజులుగా మీరు మమ్మల్ని అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. అందుకే మిమ్మల్ని కాసేపు ఎంటర్‌టైన్ చేయమని బిగ్ బాస్ మమ్మల్ని పంపించారు’’ అంటూ లైవ్ బ్యాండ్‌లోని సింగర్ చెప్పడంతో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా చాలా ఎగ్జైట్మెంట్‌తో బిగ్ బాస్‌కు థాంక్యూ చెప్పుకున్నారు. ఆ బ్యాండ్ ముందుగా పెదవే పలికిన పాటను ప్రారంభించగానే తన తల్లిని గుర్తుచేసుకొని విష్ణుప్రియా చాలా ఎమోషనల్ అయ్యింది. తనతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కూడా విష్ణుప్రియా మధర్‌ను గుర్తుచేసుకున్నారు. పాట అయిపోగానే లవ్ యూ అమ్మ.. థాంక్యూ ఫర్ దిస్ జన్మ అని చెప్పింది విష్ణు.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో గొడవ.. కాలర్ పట్టుకొని కొట్టుకున్న కంటెస్టెంట్స్
టెన్షన్స్ మర్చిపోయి
ఆ తర్వాత లైవ్ బ్యాండ్ పాడుతున్న పాటలను ఎంజాయ్ చేస్తూ కంటెస్టెంట్స్ అంతా కాసేపు ఫినలే టెన్షన్‌ను మర్చిపోయారు. ఇదిలా ఉండగా.. సెలబ్రిటీ గెస్టులు వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేయడం కంటే ముందే కంటెస్టెంట్స్ మధ్య ఓటు అప్పీల్ కోసం గట్టి పోటీ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఓటు అప్పీల్ టాస్కుల్లో గెలిచి ప్రేక్షకులకు తమ ఓటును అప్పీల్ చేసుకున్నారు. మరికొందరు ఇంకా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ టాస్కుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. గురువారం ప్రసారం కానున్న ఓటు అప్పీల్ టాస్కులకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే గౌతమ్ గేమ్ అందరినీ డామినేట్ చేసిందని అర్థమవుతోంది.
గౌతమ్‌కు ఎదురుదెబ్బ
ఓటు అప్పీల్ చేసుకోవడానికి ముందుగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్.. పవర్ ఫ్లాగ్. ముందుగా కంటెస్టెంట్స్‌లో ఎవరైతే బజర్ మోగినప్పుడు మధ్యలో ఉన్న పవర్ ఫ్లాగ్‌ను పట్టుకుంటారో.. వారు ఈ రేసు నుండి ఒకరిని తప్పించే అవకాశం ఉంటుంది. అలా గౌతమ్‌కే రెండుసార్లు ఆ పవర్ ఫ్లాగ్ దొరుకుతుంది. దీంతో ముందుగా ప్రేరణను, ఆ తర్వాత నిఖిల్‌ను ఈ రేసు నుండి తప్పిస్తాడు గౌతమ్. ఆ తర్వాత రోహిణి చాలా కష్టపడి ఆ ఫ్లాగ్‌ను తన సొంతం చేసుకుంటుంది. ఆపై వెంటనే ఆలోచించకుండా గౌతమ్‌ను ఈ రేసు నుండి తప్పిస్తుంది. ఈ టాస్క్ పూర్తయ్యే సమయానికి మిగిలిన కంటెస్టెంట్స్ అంతా మరో గేమ్ ఆడతారు. దాని వల్ల ప్రేరణ, నబీల్ మధ్య మరో గొడవ జరుగుతుంది.