Children Social Media Rules| యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా టీనేజర్లు, చిన్నపిల్లలు సోషల్ మీడియా విపరీతంగా ఉపయోగిస్తున్నారు. పైగా వీరిలో చాలా మంది సొంతంగా అకౌంట్లు క్రియేట్ చేసుకొని కంటెంట్ పెడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో కొత్త చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. ముఖ్యంగా మైనర్లు, పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ (Digital Personal Data Protection rules) చట్టం రూపొందిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జనవరి 3, 2025న కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ (ముసాయిదా) విడుదల చేసింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ (డిపిడిపి) డ్రాఫ్ట్ ప్రకారం.. డేటా ఫిడుషియరీ సంస్థలు (సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్).. 18 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లలు, మైనర్ల అకౌంట్లకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి. అనుమతిని ధృవీకరించేందుకు ప్లాట్ ఫామ్స్.. టెక్నికల్ గా ఫీచర్స్ రూపొందించాలి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సోషల్ మీడియా సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయలేదు.
Also Read: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న ఈ కోటీశ్వరులు?
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిపిడిపి నిబంధనల డ్రాఫ్ట్ ప్రకారం.. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 సెక్షన్ 40, సబ్ సెక్షన్ 1, 2 లలో ఈ నిబంధనలు జోడించబడతాయి. ఈ నిబంధనలపై ఫిబ్రవరి 18 2025 తరువాత పూర్తి స్థాయి చట్టం రానుంది. నిబంధనల ప్రకారం.. మైనర్ల తల్లిదండ్రుల గురించి కూడా పూర్తి వివరాలు సేకరించబడతాయి. ఈ వివరాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రభుత్వానికి అందుబాటులో ఉండేవిధంగా చూడాలి.
అయితే ఈ నిబంధనలు ఒక్క సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్, గేమింగ్ ప్లాట్ ఫామ్స్ కు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ప్రభుత్వం భారిగా జరిమానా విధిస్తుంది. ఈ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారికి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ప్రకారం.. గరిష్ఠంగా రూ.250 కోట్లు జరిమానా విధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకుముందు భారతదేశంలో టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా శత్రు దేశమైన చైనా భారతీయుల డేటా దొంగలిస్తోందనే కారణాలతో ఆ యాప్ ని భారత ప్రభుత్వం నిషేధించింది.