Trump On Gold: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో మదుపుదారులు గోల్డ్‌పై దృష్టి సారించింది. ఈలోగా ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అసలు మేటరేంటి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వడ్డనతో చాలా దేశాల మార్కెట్లు నేల చూపు చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు బెటరని నిర్ణయానికి వచ్చారు మదుపరులు. ఇన్వెష్టర్లు పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి తీసి బంగారంపై పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో గతవారం 10 గ్రాముల బంగారం లక్షకు పైనే ఉండేది.
ఈ క్రమంలో బంగారు కడ్డీలపై సుంకాలు ప్రభావం పడుతుందా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ట్రంప్ స్పందించారు. బంగారంపై సుంకాలు లేవంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. దీంతో బంగారం ధర ఔన్సుపై 50 డాలర్ల మేర తగ్గింది.
స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 39 శాతం సుంకం విధించాలని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. స్విస్ సహా అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి వస్తువులపై సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందా? అనేదానిపై స్పష్టత రాలేదు. అంతకుముందు అమెరికా కస్టమ్స్ విభాగం గతవారం ఓ ప్రకటన చేసింది.
ALSO READ: ఈ స్కీమ్‌లో నెలకు రూ.55 కడితే చాలు.. ఉద్యోగం లేకపోయినా పెన్షన్ గ్యారెంటీ
కేజీతోపాటు 100 ఔన్సుల అంటే (2.8 కిలోల) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో బంగారం సుంకాలపై ట్రంప్ క్లారిటీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తారని వైట్‌హౌస్ అధికారి వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో కలకలం రేపింది.
చివరకు ట్రంప్ క్లారిటీ ఇవ్వడంతో సోమవారం మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులను పరిశీలిద్దాం. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల మేరకు సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,00,201గా ఉంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి లక్ష కంటే తక్కువగా అంటే రూ. 99,957 వద్ద ముగిసింది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,560కి పడిపోయింది. అదే సమయంలో 20 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,960గా ఉంది. ట్రంప్ స్పష్టమైన ప్రకటనతో బంగారం వ్యాపారులకు ఊరట కలిగింది. చైనా, భారత్ లాంటి దేశాలు బంగారం అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి.