Hyderabad Cyber Crime Police: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు కూడా మరింతగా పెరుగుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటి పలు రకాలుగా జనాలను మోసం చేస్తున్న సైబర్ నేరస్తులు, తాజాగా మరో కొత్త పథకంతో ముందుకు వచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా అవతారం ఎత్తారు. గడువు ముగిసిన పాలసీలను రెన్యువల్ చేస్తామని చెప్పడంతో పాటు బీమా ట్రాన్స్ ఫర్, పునరుద్ధరణ నెపంతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ..
సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ ద్వారా అమాయకులకు వల వేస్తున్నారు. కాల్ చేసి సదరు వ్యక్తులకు సంబంధించిన బీమా పాలసీల గడువు ముగుస్తుందని, లేదంటే ఇప్పటికే ముగిసిందని చెబుతున్నారు. పాలసీలు క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వెంటనే చెల్లింపులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ మోసగాళ్ళు తరచుగా నిజమైన బీమా కంపెనీల మాదిరిగానే నకిలీ వెబ్ సైట్లకు వినియోగదారులను మళ్లించే లింక్ లతో అధికారికంగా కనిపించే ఇమెయిల్‌లను పంపుతున్నారు. తాము పంపే లింక్ ల ద్వారా డబ్బు చెల్లించమని ప్రజలపై ఒత్తిడి చేస్తారు. వెంటనే చెల్లించకపోతే డబ్బు పోతుందని బెదిరిస్తారు. వారి మాటలు నమ్మి డబ్బులు చెల్లిస్తే అంతే సంగతులు. బీమా స్కామర్ల బారినపడి మోసపోయిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులు, వృద్ధులు ఉన్నట్లు తేలింది.
పోలీసులు ఏం చెప్తున్నారంటే?
హైదరాబాద్ లో గత మూడు నెలల్లో వచ్చిన కేసులలో దాదాపు 30 శాతం కేసులు బీమా మోసాలకు సంబంధించిన కేసులు అని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. “సైబర్ కేటుగాళ్లు ఎమర్జెన్సీ పరిస్థితిని క్రియేట్ చేస్తారు. వెంటనే డబ్బులు చెల్లించకపోతే పాలసీ ప్రయోజనాలు కోల్పోతారని ప్రజలను హెచ్చరిస్తారు. అదే సమయంలో బాధితులకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ వివరాలను సేకరిస్తారు. ఓ లింక్ పంపించి, దాని ద్వారా డబ్బులు పంపించాలంటారు. ఎక్కడ తమ పాలసీ ల్యాప్స్ అవుతుందోననే భయంతో బాధితులు స్కామర్లు పంపిన లింక్ ఓపెన్ చేసి డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత మోసాపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.
థర్డ్ పార్టీల నుంచి పాలసీ వివరాల సేకరణ
పాలసీలకు సంబంధించిన వివరాలు, వారి గడువు తేదీలు కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే తెలుసు. కానీ, సైబర్ నేరస్థులు ఈ సమాచారాన్ని థర్డ్ పార్టీ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. డేటా ప్రొవైడర్లు, బ్రోకింగ్ కంపెనీలు రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు వసూలు చేసి పాలసీదారుల వివరాలను అందిస్తున్నారు. ఈ డేటాలో పాలసీ వివరాలు, గడువులు, వాహన నంబర్లు, వారి బీమా పాలసీల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ సమాచారంతో, సైబర్ నేరస్థులు పాలసీదారులకు కాల్ చేసి మెసేజ్ లను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసుల సూచనలు:
⦿ బీమా రెన్యువల్ పేరుతో బాధితులను ట్రాప్ చేస్తున్న సైబర్ మోసగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
⦿ పాలసీలు ల్యాప్ అవుతున్నాయని ఎవరైనా కాల్ చేస్తే తొందరపడి స్పందించకూడదు.
⦿ తెలియని ఇమెయిల్స్, మెసేజెస్ ద్వారా వచ్చే లింక్స్ పై క్లిక్ చేయకూడదు.
⦿ ఫోన్ ద్వారా వ్యక్తిగత, ఫైనాన్షియల్ సమాచారాన్ని పంచుకోవద్దు.
⦿ మీకు ఏదైనా అనుమానం కలిగితే నేరుగా మీ బీమా సంస్థకు కాల్ చేసి మాట్లాడండి.
⦿ అనుమానాస్పద కాల్స్ వస్తే పోలీసులకు, లేదంటే సైబర్ క్రమై పోలీసులకు సమాచారం ఇవ్వండి. www.cybercrime.gov.in పోర్టల్ లో ఫిర్యాదు చేయండి.
Read Also: తళతళ మెరిసిన వాషింగ్ పౌడర్ నిర్మా.. కారు చీకట్లు కమ్ముకుని ఎలా కనుమరుగైంది?