Delhi Crime News: ఇంట్లో చిన్నపాటి గొడవలు పెద్ద పెద్ద విషాదాలకు దారి తీస్తాయనే విషయం ఢిల్లీలో జరిగిన ఘటనతో మరోసారి రుజువైంది. బర్త్ డే వేడుకలో బహుమతులపై ఏర్పడిన వాగ్వాదం చివరికి రెండు ప్రాణాలను బలి తీసుకుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఢిల్లీ లోని రోహిణి సెక్టర్–17లో నివసిస్తున్న ప్రియా సేఘల్ (34) ఇంట్లో ఆగస్టు 28న ఆమె కుమారుడు చిరాగ్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకకు ప్రియా తల్లి కుసుమ్ సిన్హా (63) కూడా వచ్చింది. ఆ సమయంలో ప్రియా, ఆమె భర్త యోగేష్ తో బహుమతుల విషయంలో గొడవ పెట్టుకుంది. తల్లి కుసుమ్ గొడవను ఆపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఇద్దరూ గట్టిగట్టిగా అరుచుకున్నారు. ఈ బర్త్ డే కాగానే ప్రియా తల్లి కుసుమ్ వెళ్లాలనుకుంది. కానీ, ఈ గొడవ నేపథ్యంలో వారికి నచ్చజెప్పాలని అక్కడే ఉండిపోయింది.
తల్లి ఫోన్ ఎత్తకపోవడంతో కొడుకుకు అనుమానం
ఆ తర్వాత రోజు కుసుమ్ కొడుకు మేఘ్ సిన్హా (30) ఆమెకు కాల్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళన చెందాడు. ఆగస్టు 30న మధ్యాహ్నం ప్రియా ఇంటికి వచ్చాడు. బయట నుంచి తలుపు మూసి ఉండడమే కాకుండా, తలుపు దగ్గర రక్తపు మరకలు కనిపించడంతో మేఘ్ షాక్ తిన్నాడు. తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా తల్లి కుసుమ్, అక్క ప్రియా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు. చిన్నారులు కనిపించలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించిన మేఘ్
వెంటనే మేఘ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేపీఎన్‌కే మార్గ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ప్రియా మరో సోదరుడు హిమాలయ ఫిర్యాదు మేరకు కేసు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన కీలక విషయాలు వెల్లడించాడు. “అమ్మ ఒక రోజు అక్క దగ్గరే ఉంటానని చెప్పింది. గొడవలు జరుగుతున్నాయి, సర్ది చెప్పి వస్తానన్నది. కానీ, మరుసటి రోజు నుంచి ఫోన్‌కు స్పందించలేదు. ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మరకలు కనిపించాయి. తలుపు తెరిచేసరికి అమ్మ, అక్క రక్తపు మడుగులో పడి ఉన్నారు. యోగేష్ పిల్లలను తీసుకొని పారిపోయాడు. చిన్న చిన్న గొడవలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కానీ ఇంత క్రూరంగా హత్య చేయడం ఏంటి?” అని హిమాయ కన్నీరు పెట్టుకున్నాడు.
నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు
ఈ జంట హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు యోగేష్ సేఘల్, ప్రస్తుతం జాబ్ లేకుండా ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, అలాగే హత్యకు వాడినట్లు అనుమానిస్తున్న కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. 17 సంవత్సరాలుగా వివాహ బంధంలో ఉన్న ప్రియా, యోగేష్‌ల మధ్య జరిగే గొడవలు చివరికి ఇంత ఘోరానికి దారితీస్తాయని ఊహించలేకపోతున్నామని బంధువులు చెబుతున్నారు. చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: మూత్రం ఆపుకోలేక.. బాటిళ్లలో టాయిలెట్ పోసిన విమాన ప్రయాణీకులు.. మరి ఇంత ఘోరమా!