Virgin Australia Passengers: గత కొద్ది కాలంగా విమాన ప్రయాణం అంటేనే ప్యాసింజర్లలో భయం పుడుతోంది. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత.. విమానం ఎక్కాక సురక్షితంగా కిందికి దిగుతామో? లేదో? అని ఆందోళన చెందుతున్నారు. వారి అనుమానాలను నిజం చేస్తూ పలు విమానాలల్లో తరచుగా రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ఓ ఆస్ట్రేలియన్ విమానయాన సంస్థకు చెందిన విమానం టాయిలెట్లు మిడ్ ఎయిర్ లో పని చేయకపోవడంతో సుమారు ఆరు గంటల పాటు ప్రయాణీకులు నరకయాతన అనుభవించారు.
ఇంకీ అసలు ఏం జరిగిందంటే?
వర్జిన్ ఆస్ట్రేలియా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం బాలి నుంచి బ్రిస్బేన్ బయల్దేరింది. డెన్‌పసర్ నుంచి టేకాఫ్ కు ముందే విమానంలో ఓ టాయిలెట్ పని చేయడం మానేసింది. అయితే, ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. మిగతా రెండు టాయిలెట్లు పని చేయడంతో ప్రయాణం ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో షెడ్యూల్ ప్రకారం బయల్దేరింది. బ్రిస్బేన్ కు వెళ్లే మార్గంలోమిగిలిన రెండు టాయిలెట్లు కూడా పని చేయడం మానేశాయి. ప్రయాణీకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుమారు 6 గంటపాటు టాయిలెట్లు పని చేయకుండానే విమాన ప్రయాణం కొనసాగింది.
ఆపుకోలేక బాటిళ్లలో మూత్రం పోసిన ప్రయాణీకులు
ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ ప్యాసింజర్లలో అలజడి మొదలయ్యింది. కొంత మంది ప్రయాణీకులు తట్టుకోలేక, బాటిళ్లలో మూత్రం పోయాల్సి వచ్చింది. ఒక వృద్ధ మహిళ ఏకంగా కూర్చున్న చోటే దుస్తుల్లోనే మూత్రం పోసుకుంది. మొత్తం ఆరు గంటల ప్రయాణంలో చివరి మూడుగంటలు అత్యంత ఘోరంగా గడపాల్సి వచ్చింది. “ప్రయాణ మధ్యంలో టాయిలెట్లు పని చేయడం మానేశాయి. మిగిలిన మూడు గంటలు ఖాళీ బాటిళ్లలో టాయిలెట్ పోయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో పని చేయని టాయిలెట్స్ లోనే మూత్ర విసర్జన చేశాం. పిల్లలు ఏడుస్తున్నారు, వృద్ధ ప్రయాణికులు బాధపడ్డారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇదో అత్యంత దారుణమైన ప్రయాణ అనుభవంగా భావిస్తున్నాం” అని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన ప్రయాణీకుడు చెప్పుకొచ్చాడు. టాయిలెట్లు పని చేయకపోవడంతో వాష్ రూమ్ వాసన ఫ్లైట్ క్యాబిన్ లోకి ప్రవేశించింది. ప్రయాణీకుల మరింత ఇబ్బంది పడ్డారు. దుర్వాసన తట్టుకోలేక కొంత మంది వాంతులు కూడా చేసుకున్నారు.
Read Also: ప్రయాణీకులకు షాక్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు!
క్షమాపణలు చెప్పిన విమానయాన సంస్థ
టాయిలెట్లు పని చేయకపోయిన ఘటనపై వర్జిన్ ఆస్ట్రేలియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కఠినమైన పరిస్థితుల్లో ప్రయాణీకులకు సర్ది చెప్పిన సిబ్బందిని విమానయాన సంస్థ అభినందించింది.
Read Also: 125 ఏళ్ల హర్యానీ స్వీట్ సెంటర్, హైదరాబాద్ లో ఇదో ట్రెండ్ సెట్టర్!