Hyderabad : భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. కానీ, అందరు భార్యాభర్తలు ఒకేలా ఉండరు. అన్ని గొడవలు ఒకేలా జరగవు. కోపంతో భార్యను చంపే ఘటనలు కోకొల్లలు. అక్రమ సంబంధం మోజులో భర్తను అడ్డు తొలగించే కేసులు ఈమధ్య బాగా పెరుగుతున్నాయి. తిట్టుకునుడు.. కొట్టుకునుడు.. చంపుకునుడు.. ఆలుమగల మధ్య అరాచకాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల ఓ ఉన్మాది భార్యను చంపి ముక్కలుగా నరికేసి.. ప్రెజర్ కుక్కర్‌లో ఉడిచించి.. మిక్సీలో గ్రైండ్ చేసి.. డ్రైనేజీలో కలిపేశాడు. హైదరాబాద్‌లోనే జరిగింది ఈ దారుణం. ఇక సుటుకేసులో డెడ్‌బాడీ, డ్రమ్ములో వేసి కాంక్రీట్‌తో పూడ్చేయడం.. గట్రా క్రియేటివ్ మర్డర్స్ సంఖ్య పెరిగిపోతోంది. సినిమాల్లో, యూట్యూబ్ వీడియోల్లో చూసి మరీ హత్యలు చేస్తున్నారు సైకోలు. కానీ, ఈ న్యూస్ అలాంటిది కాదు. మరింత డిఫరెంట్. భార్య అనుకొని పక్కింటావిడను చంపేసిన తాగుబోతు ఉదంతం ఇది. హైదరాబాద్‌లో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతోంది.
తాగుబోతు భర్త.. భార్యపై..
60 ఏళ్ల సలీం, రేష్మాలు భార్యాభర్తలు, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉంటారు. బక్రీద్ పండుగ కోసం హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లిలోని కూతురు ఇంటికి వచ్చారు. శుక్రవారం రాత్రి సలీం ఫుల్‌గా మందేశాడు. ఇంట్లో లొల్లి లొల్లి చేశాడు. భార్యతో గొడవ పడ్డాడు. కాసేపు తిట్టాడు, ఆ తర్వాత కొట్టాడు. అయినా, అతని కోపం తీరలేదు. బీబీని చంపేస్తానంటూ కూరగాయలు కోసే కత్తితో మీదకొచ్చాడు. దెబ్బకు బెదిరిపోయింది ఆ భార్య. వెంటనే అక్కడి నుంచి బయటకు పారిపోయింది. కానీ…..
పక్కింటి యువతిని పొడిచి..
ఆ ఇంట్లో గొడవ జరుగుతోందని తెలిసి.. పక్కింటి 26 ఏళ్ల జుబేదా ఏం జరుగుతోందో చూద్దాం అని లోపలికి వచ్చింది. అంతే. అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్న సలీం.. ఇంట్లోకి వచ్చింది భార్యనో, పక్కింటావిడనో పోల్చుకోలేక పోయాడు. కోపంతో ఊగిపోయాడు. తన భార్యనే మళ్లీ తిరిగి వచ్చిందని భావించి.. పక్కింటి జుబేదాను కత్తితో పొడిచేశాడు. కడుపులో కత్తి దిగి తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు సలీంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ కొనసాగుతోంది.