Viral News : అనగనగా ఒక ప్రభుత్వ పాఠశాల. రాత్రికి రాత్రే అందులో పోలీస్ క్యాంప్ ఏర్పాటైంది. ఎస్సై, పలువురు కానిస్టేబుల్స్ ప్రత్యక్ష మయ్యారు. అది చూసి స్థానికులు హడలిపోయారు. మా ఏరియాలో సడెన్‌గా పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారని అవాక్కయ్యారు. ఆ తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ మేటర్ తెలిసింది వాళ్లకు. ఆ స్టేషన్‌కు మరింత మంది పోలీసులు కావాలట. అర్హులకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తారట. ఈ విషయం తెలిసి లోకల్ యువకులు పోలీస్ జాబ్ కోసం ఎగబడ్డారు.
గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికే ఇచ్చేస్తారా ఏంటి? చేతులు తడపాలిగా? అంటూ జాబ్ కోసం వచ్చిన వాళ్ల నుంచి 10-15 వేలు వసూలు చేశాడు ఆ స్టేషన్ ఎస్సై. అలా 10 వేలు ఇవ్వగానే వారికి వెంటనే జాబ్ ఇచ్చేశాడు ఎస్సై. యూనిఫాం కూడా అతనే కుట్టించాడు. ఐడీ కార్డు, కర్ర కూడా చేతిలో పెట్టాడు. అలా పెద్ద సంఖ్యలో యువతను రిక్రూట్ చేశాడు. వారిని వెంటనే డ్యూటీలో దింపేశాడు.
నాలుగో సింహం రాహుల్..
రద్దీ ఉన్న ప్రాంతాల్లో గస్తీ కాయడం, జాతరలో పహారా, వెహికిల్స్ చెక్ చేయడం, అక్రమ మద్యం వ్యాపారంపై దాడులు చేయడం.. ఇవీ ఆ కానిస్టేబుల్స్ చేయాల్సిన పనులు. ఆ ఎస్సై అండ్ కానిస్టేబుల్స్ దాడులతో లిక్కర్ దందా కేటుగాళ్లు హడలి పోయారు. బాబ్బాబు మా పొట్ట కొట్టొద్దంటూ.. కమిషన్ ఇస్తామంటూ డీల్ మాట్లాడుకున్నారు. వెహికిల్స్ చెకింగ్స్‌తో భారీగా చలాన్లు వసూల్ చేశారు. అలా ఓ 4 నెలలు.. బడిలో వెలసిన ఆ పోలీస్ స్టేషన్ పేరు స్థానికంగా మారుపోగిపోయింది. ఎస్సై రాహుల్ షా గురించి అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా బీహార్, పూర్ణియాలోని మోహిని పంచాయతీలోని బటౌనా గ్రామంలో జరిగింది. “గ్రామ రక్షా దళ్” పేరుతో ఆ పోలీస్ సైన్యం ఏర్పాటైంది. వాళ్లందరికీ రాహులే చీఫ్. అయితే…..
జాబ్ ఉంది కానీ జీతాల్లేవ్..
జాబ్‌లో చేరిన కానిస్టేబుల్స్ నెలలు గడుస్తున్నా తమకు ఇంకా జీతం రావట్లేదేంటి? అని ఆ ఎస్సై రాహుల్‌ను అడగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు ఏవో సాకులు చెప్పాడు. మనది ” బీహార్ రాజ్య దళపతి” “గ్రామ రక్షా దళ్ మహాసంఘ్” కాబట్టి ఇది ప్రభుత్వ అండర్‌టేకింగ్ సంస్థ అని.. జీతాలు ఇలానే ఆలస్యం అవుతాయని.. డోంట్ వర్రీ అంటూ వారికి నమ్మకంగా చెప్పాడు. కొందరికి వసూల్ చేసిన కమిషన్లలో పర్సంటేజ్ ఇచ్చేవాడు. కానీ, ఎన్నాళ్లని అలా శాలరీస్ లేకుండా పోలీస్ జాబ్ చేయాలంటూ ఓ రోజు గట్టిగా నిలదీశారు. అంతే, ఆ రాత్రే అతను అక్కడి నుంచి పరార్. వాడు ఎస్సై కాదు పాడు కాదు. అంతా ఫేక్. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఫేక్. కానిస్టేబుల్ ఉద్యోగాలన్నీ ఫేక్.. అని ఆ తర్వాత తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. నిజమైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసి.. విచారణ స్టార్ట్ చేశారు.
300 మంది.. 50 లక్షలు..
నకిలీ SHO నియామకాల పేరుతో ఆ కేటుగాడు 300 మందిని మోసం చేశాడని తెలిసింది. ఉద్యోగాల పేరుతో దాదాపు రూ.50 లక్షలు మోసం చేశాడని బయటపడింది. ఆ నకిలీ ఎస్సై ఇచ్చిన ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు అన్నీ ఫేక్ అని తేల్చారు. ఎస్సైగా నటించిన రాహుల్ కుమార్ షా గతంలో NCCలో చేశాడు. అక్కడ పరిచయమైన క్యాడెట్లతో ఓ ముఠా తయారు చేశాడు. పలువురు పోలీస్ అధికారులతో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు చూపించి.. తనూ పోలీస్‌నే అంటూ కలరింగ్ ఇచ్చాడు. అది చూసి గ్రామస్తులు నమ్మారు. స్కూల్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసి.. నకిలీ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్ జాబ్స్ పేరుతో 300 మందిని మోసం చేసి.. రూ.50 లక్షలతో పారిపోయాడు. నిందితుల కోసం ప్రస్తుతం నిజమైన పోలీసులు గాలిస్తున్నారు.