Hyderabad Sana Don Robberies | పిల్లలను జన్మనిచ్చే తల్లిదండ్రులపై వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి సన్మారగంలో నడిపించే బాధ్యత ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో కొందరు నీతి, నిజాయితీలు మరిచి అక్రమ మార్గంలో సంపాదించడానికి ఎంతకైనా దిగజారుతుంటారు. ఈ కోవకే చెందిన ఒక మహిళ తాను దొంగతనాలు చేస్తూ.. తన ముగ్గురు కొడుకుల చేత కూడా ఆ నేరాలే చేయిస్తోంది. కష్టపడి సంపాదించమని మంచి బోధించాల్సింది పోయి ఎక్కడ ఎలా దొంగతనం చేయాలో నేర్పించింది. తాళం వేసిన ఇళ్లను గుర్తించడం, తన కొడుకులను ఆ ఇళ్లకు పంపించి దొంగతనాలు చేయించడం, చోరీ సొత్తును రహస్యంగా విక్రయించడం వారు పట్టుబడితే న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయడం ఆమె అలవాటుగా మార్చుకుంది.
అమె మరెవరలో కాదు హైదరాబాద్ నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనల్లో నిందితురాలిగా గుర్తించబడిన కరడుగట్టిన నేరస్థురాలు సనా బేగం, అలియాస్ సనా టైగర్, అలియాస్ సనా డాన్ (48). ఇటీవల సనా డాన్ కొడుకు సోహైల్ (26) డైమండ్ హిల్స్ కాలనీలో జరిగిన చోరీ కేసులో పట్టుబడ్డాడు. అతడిని అరెస్టు చేసిన ఫిలిం నగర్ పోలీసులు రిమాండ్ కోసం తరలించారు.
వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో ఇటీవల 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ అయ్యింది. బండ్లగూడకు చెందిన సనా బేగం, అలియాస్ సనా డాన్, తన ముగ్గురు కుమారులు మహమ్మద్, సాహిల్, సోహైల్‌తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. దొంగతనం తర్వాత ఆటోలో పారిపోతున్న సమయంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితులు అనేక ప్లాన్‌లు వేశారు. చోరీ తర్వాత నేరుగా బండ్లగూడలోని తమ ఇంటికి వెళ్లడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించే అవకాశం ఉందని భావించి, సుమారు రెండు గంటల పాటు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీలోని సందుగొందుల్లో తిరిగారు. అయినప్పటికీ, పట్టుదలతో పనిచేసిన పోలీసులు 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు పరిశీలించి, ఎట్టకేలకు బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు.
Also Read: మత్తుమందిచ్చి మహిళలతో ఆ పని చేసే దొంగబాబా.. యువతుల లోదుస్తులు దోచుకునే టెకీ
అయితే పోలీసులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన సనా బేగం, ఆమె రెండవ కొడుకు సోహైల్ పోలీసులకు చిక్కారు. వారి నుండి 10 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇది జరుగుతుండగా.. శుక్రవారం రాత్రి నిందితురాలు సనా బేగంను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని, తనను అరెస్టు చేసేలా రిపోర్ట్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు నీవే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని బెదిరించిందని తెలిసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో అనేక రకాల వైద్య పరీక్షలు జరిపిన తర్వాత.. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. సనా బేగంపై దాదాపు 43 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.