Naked Robbery| పురుషులలో పుణ్య పురుషులు వేరయా అని అంటారు. అలాగే ఒక దొంగ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు. హైటెక్ పరికరాలు ఉపయోగించి దొంగతనాలు జరిగిన కేసులో ఎన్నో చూశాం. కానీ తాజాగా ఒక దొంగ బట్టలు లేకుండా వెళ్లి ఒక మొబైల్ షాపులో దొంగతనం చేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు, షాపు ఓనర్ షాక్ కు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం హోంగసాంద్ర సమీపంలోని బొమ్మనహళ్లి ప్రాంతంలో దినేష్ అనే వ్యక్తి హనుమాన్ టెలికాం మొబైల్ షాపు చాలా సంవత్సరాలుగా నడుపుతున్నాడు. మే 9, 2025 రాత్రి దినేష్ రోజూలాగే షాపు మూసేసి ఇంటికి వెళ్లాడు. అయితే మే 10, 2025 ఉదయం దినేష్ తన షాపు తెరిచాడు. కానీ లోపల మొబైల్ ఫోన్లు అన్నీ మాయమయ్యాయి. షాపు సెట్టర్ మూసినట్లే ఉంది. దీంతో దొంగ ఎక్కడి నుంచి దూరాడో చూస్తే షాపు వెనుక భాగంలో గోడకు పెద్ద కన్నం ఉంది. ఇది చూసిన దినేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సిసిటీవి వీడియోలు పరిశీలించాక అందులో దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు.
అందులో ఒక యువకుడు షాపులో ప్రవేశించి మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ దొంగ శరీరంపై ఎలాంటి బట్టలు లేవు. షాపు నుంచి మొత్తం 85 స్మార్ట్ ఫోన్లు చోరీ అయినట్లు షాపు ఓనర్ తెలిపాడు. వాటి విలువ రూ.25 లక్షలు అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిసిటీవి వీడియోలు పరిశీలించి ఆ దొంగను వెంబడించారు. అతడిని అరెస్ట్ చేశారు. అతడి పేరు ఇక్రామ్ ఉల్ హసన్ అని తెలుసుకున్నారు. అస్సాం కు చెందిన ఇక్రామ్ బెంగుళూరులో గతంలో కూడా దొంగతనాలు చేసినట్లు తెలిపారు.
Also Read: పెళ్లిలో భోజనం బాగో లేదని కామెంట్ చేసిన వరుడి బంధువు.. కాల్చిపడేసిన వియ్యంకులు
దొంగతనం చేసేందుకు బట్టలు ఎందుకు విప్పేశాడంటే..
ఇక్రామ్ దొంగతనం చేసేందుకు ముందుగా షాపు వెనకాల పెద్ద కన్నం వేశాడు. ఆ తరువాత షాపులో బట్టలు లేకుండా ప్రవేశించి.. ముఖానికి తెల్లని మాస్క్ వేసుకున్నాడు. దీనికి కారణం గురించి పోలీసులు చెబుతూ.. చాలా కేసుల్లో దొంగలను పోలీసులు వారు వేసుకున్న బట్టల ఆధారంగా గుర్తిస్తారని భావించిన ఇక్రామ్ దొంగతనం చేసే సమయంలో బట్టలన్నీ విప్పేసి వెళ్లాడు అని చెప్పారు. గోడకు కన్నం వేయడానికి ఒక పెద్ద సుత్తి, చీజిల్ ఉపయోగించాడని వెల్లడించారు.
2018లో కేరళ తమిళనాడు బార్డర్ ప్రాంతంలో ఇలాంటి చోరీలు జరిగాయి. ఎడ్విన్ జోస్ అనే 28 ఏళ్ల యువకుడు బట్టలన్నీ విప్పేసి శరీరానికి నల్లని పెయింట్ వేసుకొని.. ముఖంపై తన అండర్ వేర్ కప్పుకొని చోరీలు చేశాడు.