Minor Son Immolates Father | ఒక మైనర్ బాలుడు తన తండ్రిపై కోపంతో హత్యకు పాల్పడ్డాడు. జన్మనిచ్చిన తండ్రిని నిద్రపోతుండగా.. కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో జరిగింది.
వివరాల్లకి వెళితే.. హర్యాణాలోని ఫరీదాబాద్ నగరం అజయ్ నగర్ కు చెందిన మొహమ్మద్ అలీం అనే 55 ఏళ్ల వ్యక్తికి ఓ 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న అలీం.. ఇంట్లో తన కుమారుడు ప్రయోజకుడు కావాలని ఆశపడ్డాడు. కానీ ఆ పిల్లాడు చదువు పట్ల ఆసక్తి చూపలేదు. స్కూల్ పరీక్షల్లో వరుసుగా తక్కువ మార్కులు వస్తుండగా.. అతడిని అలీం బాగా చదువుకోవాలని చెప్పేవాడు. ఈ క్రమంలో కొడుకు పట్ల కఠినంగా వ్యవహరించేవాడు. కానీ ఆ కుర్రాడు చెడు సావాసాలు బట్టి.. తండ్రి కష్టపడి సంపాదిస్తున్న డబ్బును దుబారాగా ఖర్చు పెట్టేవాడు.
ఈ క్రమంలో తండ్రి జేబులో నుంచి తరుచూ డబ్బులు దొంగిలించేవాడు. ఇది గమనించిన మొహమ్మద్ అలీం కొడుకుపై కోపడ్డాడు. ఇలా ఇంట్లో తరుచూ కొడుకు భవిష్యత్తు కోసం అలీం కఠినంగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఫిబ్రవరి 17, 2025 రాత్రి అలీం ఇంటికి రాగా.. అతని కొడుకు చదువుకోకుండా మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. అంతకుముందు రోజు తన జేబులో నుంచి కొడుకు చెప్పకుండా డబ్బులు తీసుకున్నాడని అలీం కోపడ్డాడు. కానీ ఈ సారి ఆ కుర్రాడు తన తండ్రికి ఎదురు సమాధానం చెప్పాడు. అది విని అలీం పట్టరాని కోపంతో రెండు దెబ్బలు వేశాడు. ఆ తరువాత హెచ్చరించి వదిలేశాడు.
Also Read: తల్లిని చంపిన నిందితుల్ని పట్టించిన చిన్నారి డ్రాయింగ్ – ఏం జరిగిందో తెలుసా..
రాత్రి అలీం నిద్రపోతున్న సమయంలో అతని కొడుకు తన తండ్రిపై పగ పెంచుకున్నాడు. బయటికి వెళ్లి అదే పనిగా పెట్రోల్ కొని తెచ్చి.. తండ్రిపై పోసి నిప్పంటించాడు. ఆ మంటల తాకిడికి అలీం గట్టిగా కేకలు వేశాడు. అర్ధరాత్రి కావడంతో ఇరుగు పొరుగు వారు ఆ కేకలు విని నిద్రలేచారు. ఏం జరుగుతోందోనని అలీం ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికీ అలీం కేకలు వేస్తూ కుప్పకూలాడు. ఆ తరువాత మంటలు ఆర్పి ఆయయను ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అలీం చనిపోయాడని ధృవీకరించారు.
పోలీసులు అలీం హత్య కేసు నమోదు చేసి.. విచారణ మొదలు పెట్టారు. హంతకుడు అలీం కొడుకు అని ఇరుగు పొరుగు వారంతా అనుమానం వ్యక్తం చేశారు. తరుచూ అతని కొడుకు డబ్బులు దొంగిలించేవాడని.. దీంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తాము వినేవారిమని వారంతా చెప్పారు. దీంతో పోలీసులు అలీం కొడుకు కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అలీం కొడుకు పరారీలో ఉన్నాడు.
మద్యం సేవించి తండ్రి హత్య
ఇలాంటిదే మరో కేసు బెంగుళూరులో జరిగింది. నగరంలోని బనేర్ ఘట్టా ప్రాంతంలో కేరళకు చెందిన వేలాయుధన్ (76) తన కుమారుడు వినోద్ (42), విమల్ తో కలిసి జీవించేవాడు. పెద్ద కొడుకు వినోద్ బాగా కోపిష్టి. అతనొక్కడే ఇంట్లో సంపాదించేవాడు. విమల్ ఒక నిరుద్యోగి. అయితే రోజూ రాత్రి వినోద్ ఇంటికి మద్యం తీసుకువచ్చి తండ్రితో కలిసి సేవించేవాడు. ఆ తరువాత గొడవ చేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు తన తమ్ముడు విమల్, తండ్రి వేలాయుధన్ ని కొట్టేవాడు కూడా. ఒకరోజు రాత్రి ఇలాగే ఇంటికి వచ్చి తమ్ముడు విమల్ చేతికి డబ్బులిచ్చి మద్యం తీసుకురావాలని చెప్పాడు.
ఆ తరువాత తన తండ్రితో కలిసి ఆ మద్యం సేవించాడు. ఈ క్రమంలో వేలాయుధన్ తన కొడుకు ఇంట్లో ఉన్న సమయంలో సంప్రదాయంగా పంచె ధరించాలని.. షార్ట్స్ ధరించడం మంచిది కాదని చెప్పాడు. ఈ చిన్ని విషయమే తండ్రీ కొడుకుల మధ్య గొడవకు కారణం అయింది. ఆ తరువాత ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో వినోద్ తన తండ్రి తలను గోడ కేసి బాదాడు. ఆ తరువాత కాళ్లతో గట్టిగా చాలాసేపు తన్నాడు. ఈ దెబ్బల కారణంగా ఆ వృద్ధడు మరణించాడు. దీంతో భయపడి వినోద్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత విమల్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వినోద్ కోసం గాలించి రెండు రోజుల తరువాత పట్టుకున్నారు. వినోద్ కోపం వల్లే అతని భార్య కూడా అతడిని వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.