Mother kills Children| జీవితంలో కొన్నిసార్లు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మనిషి ఒకటి తలిస్తే.. విధి మరొకటి చేస్తుంది. ఇలాంటి సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే జీవితాలే నాశనమవుతాయి. తాజాగా ఓ మహిళ అనుకోని పరిస్థితుల్లో రెండు వివాహాలు చేసుకుంది. అయితే మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదు. దీంతో ఇద్దరిలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక తనకు పుట్టిన పిల్లల్ని హత్య చేసింది. ఈ ఘటన రాజధాని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని ధరంపూర్ గ్రామానికి చెందిన వైజయంతి (30) అనే యువతి 8 ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులను వ్యతిరేకించి ఒక ముస్లిం యువకుడు నూర్ ఆలంని ప్రేమించింది. అతడినే వివాహం చేసుకొని నోయిడాకు వెళ్లిపోయింది. ఇద్దరూ మూడేళ్ల పాటు కాపురం చేశారు. దీంతో వారికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు నూర్ ఆలంని పోలీసులు ఒక క్రిమినల్ కేసులో అరెస్టు చేశారు. అతడు జైలు కెళ్లాల్సి వచ్చింది.
Also Read: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే
దీంతో వైజయంతి ఇద్దరు పిల్లలతో కష్టాల్లో పడింది. అతడి కోసం రెండేళ్ల ఎదురుచూశాక.. మనోజ్ అనే హిందూ యువకుడిని రెండో పెళ్లి చేసుకుంది. నోయిడా నుంచి ధరంపురి గ్రామానికి తిరిగివెళ్లి అక్కడే రెండో భర్తతో కాపురం ఉంటోంది. మనోజ్, వైజయంతి ఇద్దరికీ ఒక పిల్లాడు పుట్టాడు. వైజయంతి వద్దనే ముగ్గురు పిల్లలున్నారు. కూతరు (6), మొదటి కొడుకు (4) తల్లి వద్దనే ఉండగా.. కొన్ని రోజుల క్రితం అనూహ్యంగా నూర్ ఆలం జైలు నుంచి విడుదలై వచ్చాడు. తన భార్య మరొకరిని పెళ్లి చేసుకుందని తెలిసి తట్టుకోలేకపోయాడు.
ఆ తరువాత మనోజ్, వైజయంతితో గొడవపడ్డాడు. గ్రామంలో పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. వైజయంతి రెండో పెళ్లి చెల్లదని.. తనతో ఆమె విడాకులు తీసుకోలేదని తెలిపాడు. దీంతో గ్రామ పెద్దలు వైజయంతిని తన మొదటి భర్తతో వెళ్లిపోవాలని తీర్పు చెప్పారు. కానీ వైజయంతికి అలా చేయడం ఇష్టంలేదు. అందుకే ఎవరు చెప్పినా ఆమె రెండో భర్త వద్దనే ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో నూర్ వారం రోజుల క్రితం మనోజ్ ఇంటికి వెళ్లి.. తనతో వైజయంతి రాకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు.
నూర్ ఆలం బెదిరింపులకు భయపడిపోయిన వైజయంతి.. మనోజ్ ఇంట్లో లేని సమయంలో తన మొదటి భర్తతో కలిగిని ఇద్దరు పిల్లలు.. కూతరు (6), మొదటి కొడుకు (4) ని గొంతునులిమి హత్య చేసింది. తాను కూడా ఉరి వేసుకుంది. అయితే అప్పుడే అక్కడికి పక్కింటి వారు వచ్చి ఆమెను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన మొదటి భర్త నూర్ ఆలం అందరినీ చంపేస్తాడనే భయపడే ఈ పనిచేశానని.. తన రెండో కొడుకుని మనోజ్ పెంచుకుంటాడనే నమ్మకంతో ఆ పిల్లాడిని చంపలేదని పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్
పోలీసులు ప్రస్తుతం ఇద్దరు పిల్లల హత్య కేసు నమోదు చేసి.. వైజంతిని విచారణ చేస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.