Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై.. శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబర్పేట నుంచి బొంగులూరు వైపు వెళ్తున్న బేలెనో కారు.. ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రమాదం ఎలా జరిగింది?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బేలెనో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఔటర్ రింగ్ రోడ్డుపై.. ముందుగా వెళ్తున్న ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు పూర్తి స్థాయిలో నుజ్జునుజ్జయ్యింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను.. బయటకు తీసేందుకు చాలాసేపు శ్రమించారు.
మృతుల వివరాలు:
ప్రమాదంలో మరణించిన వారు మొయినబాద్ ప్రాంతంలోని.. గ్రీన్ వాలీ రిసార్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు.
మలోత్ చందు లాల్ (29) – కారును డ్రైవ్ చేసిన వ్యక్తి. స్వస్థలం వరంగల్ జిల్లా.
గగులోత్ జనార్దన్ (50) – దస్రు తండా, వరంగల్ జిల్లాకు చెందినవారు.
కావలి బాలరాజు (40) – ఎన్కపల్లి, మొయినబాద్‌కు చెందిన వ్యక్తి.
ఈ ముగ్గురూ స్పాట్‌లోనే మృతి చెందారు.
గాయపడ్డ వారి పరిస్థితి:
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు:
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తీవ్రతను గమనించిన అధికారులు.. కారును విడిభాగాలుగా కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: కోనసీమలో దారుణం.. వ్యభిచారానికి ఒప్పుకోలేదని, ప్రియురాలిని కత్తితో పొడిచి..
ముందు జాగ్రత్తలపై పోలీసుల హెచ్చరిక:
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వేగంగా వాహనాలు నడపడం, రాత్రిపూట నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం.. ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవర్లు రాత్రిపూట నిద్రలేమి, అలసటను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.