దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్‌జి కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీల్దా న్యాయస్థానం తుది తీర్పువెల్లడించింది. సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు.. జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తిని కోరినప్పటికీ, ఈ నేరం మరణ శిక్ష పారా మీటర్స్ కు అనుగుణంగా లేవని కోర్డు అభిప్రాయపడింది. అరుదైన వాటిలో అరుదైన కేసుగా గుర్తించలేమని తేల్చి చెప్పింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
సంజయ్ రాయ్‌కు మరణశిక్ష ఎందుకు విధించలేదు?
ఈ కేసు తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి దాస్ కీలక విషయాలను ప్రస్తావించారు. కోర్డులో సమర్పించిన ఆధారాలను బేస్ చేసుకుని శిక్ష విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. మూడు గంటల పాటు కొనసాగిన డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన తర్వాత, జీవిత ఖైదు రాయ్ కి సరైన శిక్ష అని న్యాయమూర్తి నిర్ధారించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలను జడ్జి ప్రస్తావించారు.
న్యాయమూర్తి చెప్పిన కీలక విషయాలు ఇవే!
⦿ మరణశిక్ష ప్రమాణాలు: నేరం క్రూరంగా ఉన్నప్పటికీ, మరణశిక్షకు అవసరమైన అరుదైన కేసుగా పరిగణించలేమని న్యాయమూర్తి వెల్లడించారు.
⦿ మార్పుకు అవకాశం: రాయ్ కి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వినిపించిన వాదనతో పోల్చితే మరణశిక్ష విధించకూడడదనే డిఫెన్స్ వాదన బలంగా ఉందన్నారు.
కేసుకు సంబంధించిన కీలక వాదనలు
ఈ అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ గట్టిగా వాదించింది. “ఇది అరుదైన కేసు. సమాజంలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి గరిష్ట శిక్ష, అంటే రాయ్ కి ఉరిశిక్ష విధించాలి” అని సీబీఐ న్యాయవాది వాదించారు.
అటు డిఫెన్స్ మాత్రం రాయ్ కి మరణశిక్ష విధించకూడదని వాదించింది. గతంలో ఉన్నత న్యాయస్థానాలు మరణశిక్షలను తగ్గించిన కేసులను ప్రస్తావించింది. శిక్ష విధించడంలో దోషిలోని మార్పును పరిగణించాలని కోర్డును కోరింది.
Read Also: దమ్ముంటే పట్టుకోరా అంటూ.. 18 మందిని చంపేసిన సీరియల్ కిల్లర్ వీడు, దొరికేశాడు మళ్లీ!
తనను ఈ కేసులో ఇరికించారని రాయ్ ఆవేదన!
అటు సంజయ్ రాయ్ సైతం తాను నిర్దోషినని కేసు ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాడు. “నేను ఈ నేరంలో ఇరికించబడ్డాను. నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ నన్ను దోషిగా నిర్ధారించారు. జైలులో నన్ను కొట్టారు. బలవంతంగా నేరం చేసినట్లు ఒప్పించారు. పత్రాల మీద సంతకాలు చేయించారు” అని రాయ్ కోర్టుకు విన్నవించాడు. “నాకు తల్లి ఉంది. కానీ, అరెస్టు తర్వాత నన్ను ఎవరూ చూడ్డానికి రాలేదు” అని కంటతడి పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదును ఖరారు చేసింది.
Read Also: ప్రియుడిని చంపేసిన ప్రియురాలు.. ఉరి శిక్ష విధించిన కోర్డు!