Tanuku SI Suicide Phone Call | పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఒక హృదయ విదారక ఘటన జరిగింది. జనవరి 31న ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎస్ఐ ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ మూర్తి ఇటీవల కొన్ని ఆరోపణలకు గురై సస్పెన్షన్‌కు గురయ్యాడు.
వీఆర్‌లో ఉన్న ఎస్ఐ మూర్తి, సీఎం చంద్రబాబు పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కొంత సమయం తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లిన ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత తోటి పోలీస్ సిబ్బంది 108 వాహనంలో ఎస్ఐ మూర్తి మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఎస్ఐ మూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్‌లో మాట్లాడాడు.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆ సన్నిహితుడితో తన సమస్యను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం బయటపడింది. తోటి ఉద్యోగులు ఇద్దరిపై ఈ సందర్భంగా మూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తన భార్య విజ్జి, పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందని మూర్తి కన్నీరుపెట్టాడు.
Also Read: భర్త కిడ్నీ అమ్మేసిన భార్య.. ప్రియుడితో జంప్.. ఎలా చేసిందంటే..
ఎలా ఉన్నావంటూ అడిగిన సహచరుడికి, రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చిందని మూర్తి చెప్పాడు. మళ్లీ ఈ రేంజ్ గొడవేమిటని స్నేహితుడు అడగగా.. తనకూ తెలియదని, అక్కడికి వెళ్లలేనని మూర్తి చెప్పారు. రేంజ్‌కి రిపోర్ట్ చేయడం తన వల్ల కాదని అన్నారు. తన మనసు బాగాలేదని, జీవితంపై ఆసక్తి లేదని చెప్పాడు.
‘నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్ని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ వారు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. సంతోషంగా ఉన్న నా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. వారు చేసిన మోసానికి నేను కుమిలిపోతుంటే వారు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లూ వీఆర్ భీమవరంలోనే కదా అని ఓపిక పట్టాను కానీ ఇక నా వల్ల కాదు. అక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. కృష్ణా జిల్లాకు పంపిస్తారు. ఒక రోజు కూడా నేను అక్కడ ఉండలేను. విజయ, పిల్లలను తలుచుకుంటేనే బాధేస్తోంది’ అని మూర్తి చెప్పాడు.
మూర్తి మాటలు విన్న సహచరుడు, పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దంటూ మందలించాడు. పాజిటివ్‌గా ఆలోచించాలని, వీఆర్‌లో ఎంతోమంది ఉన్నారని, కృష్ణా జిల్లా అయితే ఏమవుతుందని అన్నాడు. కంగారుపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికాడు.
‘నీకు అన్యాయం జరిగిన విషయం నిజమే, కానీ అందుకోసం చావు పరిష్కారం కాదు కదా. అది ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య కాదు. నువ్వు లేకుంటే నీ భార్యాపిల్లలను ఎవరు చూస్తారు? ఆ అమ్మాయి (మూర్తి భార్య) కి ముందువెనుక, పుట్టింటికెళ్లి ఏడవడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు చూసుకోవడం వేరు, మీ అన్నయ్య చూడడం వేరు. నీ కుటుంబాన్నిఎవరూ ఆదుకోరు. నువ్వు చనిపోతే ఆ ఇద్దరూ పశ్చాత్తాపంతో ఉద్యోగం వదులుకోరు. ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది. పశ్చిమగోదావరిలో నీకు అన్యాయం జరిగింది. జిల్లా మారితే మార్పు వస్తుందేమో ఆలోచించు. సస్పెండ్ చేశారు సరే వెళ్లి అడుగు. లా అండ్ ఆర్డర్ వదిలేయ్. లూప్ కావాలని అడుగు. అవసరమైతే నేనూ వస్తా. ఈ రోజు రేపు ఐజీ ఉండరు. తర్వాత వెళ్లి మాట్లాడదాం. నా మాట వినకపోతే ఎలా? నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా?.. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఒకసారి ఆలోచించు’ అని మూర్తి సహచరుడు చెప్పారు. అయితే, నేను వెళ్లలేను, నా వల్ల కావడం లేదంటూ మూర్తి కంటతడి పెట్టాడు.
ఎస్ఐ మూర్తి ఆత్మహత్యకు కారణమైన ఆరోపణలు, ఒత్తిడిని విచారణ చేసి, అన్యాయానికి గురైన ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.