Students Kill Principal| విద్యార్థులకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశంగా అందరూ పరిగణిస్తారు. కానీ పాఠశాల ప్రాంగణంలోనే ఇద్దరు విద్యార్థులు అదే స్కూల్ ప్రిన్స్‌పాల్ ని కత్తితో పొడిచి పొడిచి చంపారు. కేవలం ఒక చిన్న కారణం వల్ల ఈ హత్య చేశారు. ఈ దారుణ ఘటన హరియాణా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో జరిగింది. పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఇద్దరినీ బాల నేరస్థులుగా పరిగణించబడుతారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. “నిందితులైన విద్యార్థులిద్దరూ సుమారు 15 సంవత్సరాల వయస్సు గలవారు. పాఠశాల ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ వారిద్దరినీ క్రమశిక్షణ పాటించడం లేదని వారి పట్ల పలుమార్లు కఠినంగా వ్యవహరించాడు. ఆయన కఠిన వైఖరితో అవమానంగా భావించిన ఇద్దరు విద్యార్థులు అదును చూసి ప్రిన్స్ పాల్ జగ్బీర్ సింగ్‌ను హత్య చేశారు.” అని హన్సీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ యశ్వర్ధన్ తెలిపారు.
“ప్రాథమిక విచారణలో.. ప్రిన్సిపాల్ వీరికి క్రమశిక్షణ లోపం కారణంగా నోటీసులు జారీ చేశారని, యూనిఫామ్ సరిగ్గా ధరించమని, జుట్టును కత్తిరించుకోమని తరచూ చెప్పేవారని తెలిసింది. వీరి మధ్య ఏదైనా వ్యక్తిగత శత్రుత్వం ఉందా అనేది విచారణలో తేలుతుంది,” అని యశ్వర్ధన్ వివరించారు.
ఈ దాడి ఉదయం 10:30 గంటల సమయంలో జరిగింది. జగ్బీర్ సింగ్ ను పలుమార్లు కత్తితో దాడి చేశారు. ఆయన్ను హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన మరణించినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దాడిలో ఉపయోగించినట్లు భావిస్తున్న మర్డర్ వెపన్ (హత్య ఆయుధం) ఒక మడత కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
చనిపోయిన ప్రిన్స్‌పాల్ జగ్బీర్ సింగ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఒకే గ్రామానికి చెందినవారు. హత్య చేసే ముందు నిందితులు సోషల్ మీడియాలో తమ ప్రిన్స్‌పాల్‌ను బెదిరిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఆయనకు వ్యక్తిగతంగా ఇతర ప్లాట్ ఫామ్స్ ద్వారా మెసేజ్‌లు కూడా పంపించారు. ఈ కారణాల చేత.. ఈ ఇద్దరు విద్యార్థులకు ఒక నేరస్థుల గ్యాంగ్ తో సంబంధం ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: మీ బాత్ టవల్స్ నిండా బ్యాక్టీరియా.. అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్స్
ఈ ఘటన హిసార్‌లోని స్థానికులను షాక్‌కు గురిచేసింది. కానీ పాఠశాలలో ఇటువంటి హింసాత్మక ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ క్రమశిక్షణను అమలు చేయడానికి ప్రయత్నించినందుకు తన ప్రాణాలను కోల్పోవడం దిగ్భ్రాంతికరం. ఈ ఘటన విద్యార్థుల మానసిక స్థితి, వారిపై క్రిమినల్ గ్యాంగ్స్ ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత, విద్యార్థులకు కౌన్సెలింగ్ సేవలను అందించాలని పాఠశాల యాజమాన్యం, స్థానిక అధికారులు ఆలోచిస్తున్నారు.