Wife Murder To Marry Sister In Law| భార్యభర్తలిద్దరూ బైక్ పై వెళుతుండగా.. ఒక కారు ప్రమాదం జరిగింది. భార్యకు తీవ్ర గాయాలుకావడంతో ఆమెను ఆ భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె అప్పటికే మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆ భర్త తన భార్య మరణంపై పోలసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కారు నడిపే వ్యక్తిని శిక్షించాలంటూ పోలీసులను కోరాడు. అయితే ఇక్కడ షాకింగ్ విషయమేమిటంటే ఆ కారు ప్రమాదం అంతా ఒక ప్లాన్. చనిపోయిన యువతి చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నిందితుడు ఒక మాస్టర్ మైండ్ పథకం ప్రకారం పక్కాగా స్కెచ్ వేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ నగరానికి చెందిన అంకిత్ అనే యువకుడు మార్చి 7న తన భార్యతో బైక్ పై వెళుతుండగా.. ఒక కారు వచ్చి ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో అంకిత్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి అంకిత్ తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే చనిపోయందని డాక్టర్లు తెలిపారు. ఆ తరువాత అంకిత్ పోలీస్ స్టేషన్ లో మార్చి 8న ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు సిసిటివి ఆధారంగా ఒక కారుని గుర్తించారు. ఆ కారు నడిపే వ్యక్తి కోసం రెండు వారాలపాటు గాలించి పట్టుకున్నారు.
Also Read: భార్య ప్రియుడిని బతికుండగానే పాతిపెట్టాడు.. అబ్బా! హత్య కోసం ఎంత ప్లాన్ వేశాడంటే
ఆ వ్యక్తి పేరు సచిన్. కారు నడిపిన సచిన్ కావాలనే అంకిత్ భార్య కిరణ్ ను ఢీ కొట్టాడని పోలీసులు నిర్ధారించారు. అందుకే సచిన్ ని అదుపులోకి తీసుకొని తమ పద్ధతిలో ప్రశ్నించారు. అప్పుడు సచిన్ చెప్పిన కారణాలతో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. నిజానికి ఈ సచిన్ మరెవరో కాదు.. చనిపోయిన కిరణ్ భర్త అంకిత్ స్నేహితుడే. సచిన్ కు ఒక కారు ఏర్పాటు చేసి అతనికి కొంత డబ్బులిచ్చి.. ఆ కారుతో తన భార్యను ఢీకొట్టమని చెప్పాడు. అందుకోసం పుట్టింట్లో ఉన్న కిరణ్ ని తీసుకొని తన బైక్ పై కొంత దూరం తీసుకొని వచ్చాడు. ఆ తరువాత తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి కిరణ్ ను రోడ్డు పక్కనే నిలబెట్టి.. పెట్రోల్ పంప్ కు వెళ్లాడు. ఈ సమయంలోనే కారు తీసుకొని వచ్చిన సచిన్.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కిరణ్ ను బలంగా ఢీ కొట్టాడు. ఆమె కిందపడి ఉంటే.. మళ్లీ కారు కింద తొక్కించేశాడు. దీంతో కిరణ్ అక్కడి కక్కడే మరణించింది.
ఇదంతా విన్న పోలీసులు.. అంకిత్ ని అరెస్టు చేశారు. అంకిత్ ను పోలీసులు కాస్త గట్టిగా ప్రశ్నించే సరికి మొత్తం బయటపెట్టేశాడు. అంకిత్, కిరణ్ అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేదు. దీంతో నిరాశ చెందిన అంకిత్ తన మరదలు (భార్య చెల్లెలు)పై మనసు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే తనకు పిల్లలు కలుగుతారని భావించాడు. అందుకోసం తన మరదలిని పెళ్లి చేసుకుంటానని ఇంతకుముందు ప్రస్తావించాడు. అయితే అంకిత్ మరదలు పెళ్లి చేసుకోవాలంటే తన అక్క అడ్డుగా ఉందని చెప్పింది.
దీంతో మరదలిని పెళ్లి చేసుకోవడానికి అంకిత్ ప్లాన్ వేశాడు. ఏకంగా తన భార్యను చంపేయాలని భావించి.. తన మిత్రడు సచిన్ కు డబ్బులిచ్చి హత్య చేయించాడు. ప్రస్తుతం పోలీసులు అంకిత్ ను రిమాండ్ కు తరలించారు.