Crime News: ఒకే ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తిరుపతికి వస్తున్న వీరి కారును బస్సు ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. దీనితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బెంగళూరు నుండి మదనపల్లి మీదుగా తిరుపతికి వచ్చేందుకు ఓ కుటుంబం కారులో బయలుదేరింది. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుండి మదనపల్లి వెళ్లే దారిలో కల గోపల్లి గ్రామ రోడ్డు వద్దకు కారు రాగానే, అదే మార్గం గుండా వస్తున్న భారతీ ప్రవేట్ బస్సు ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న వారు బిగ్గరగా కేకలు వేశారు. ఈ ప్రమాదంలో కారు రహదారి ప్రక్కన బలంగా పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ప్రమాదం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే మంటలు దట్టంగా వ్యాపించడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవదహనమయ్యారు.
పూర్తి వివరాలు ఇవే..
ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, స్థానికుల ద్వారా వివరాలు ఆరా తీశారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలు కావడంతో వారిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు సజీవ దహనం కావడంతో పోలీసులు వివరాలు ఆరా తీశారు. కారులో తల్లి కళావతి తో పాటు, కుమారుడు ధనుంజయ్, మరో ముగ్గురు మహిళలు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో తల్లి, కుమారుడు సజీవ దహనమైనట్లు కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
కారును ప్రవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన ముగ్గురు క్షతగాత్రులను పోలీసులు చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారు పెను ప్రమాదం నుండి బయటపడినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదానికి కారణం ప్రవేట్ బస్సు అమితవేగమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. అయితే బస్సు కూడా బోల్తా పడడంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సైతం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రమాదం జరిగిందా? ప్రమాదానికి కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తుండగా, అసలు విషయం దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
Also Read: Mahabubabad News: పల్లీ గింజ గొంతులో ఇరుక్కొని.. 18 నెలల బాలుడు మృతి
తప్పిన పెను ప్రమాదం..
కారును ప్రవేట్ ట్రావెల్స్ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు మృత్యు ఒడికి చేరారు. అయితే బస్సు ఈ ప్రమాదంలో రహదారి ప్రక్కన బోల్తాపడగా, ఆ సమయంలో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. బస్సు బోల్తా పడినప్పటికీ, ఎవరికీ ప్రాణాపాయం లేదని, దురదృష్టవశాత్తు కారులో ఉన్న ఇద్దరు మృతి చెందినట్లు వారు తెలిపారు. డీవైఎస్పీ మురళీధర్, కెంచర్లహళ్లి పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావనప్ప రూరల్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ శివరాజ్, సబ్ ఇన్‌స్పెక్టర్ మమత అగ్నిమాపక సిబ్బంది లోకేష్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన కారును అదుపు చేశారు. మరోవైపు జిల్లా రక్షణ అధికారి ఎస్పీ కుశాల్ చౌక్సే, అసిస్టెంట్ ఎస్పీ రజా ఇమామ్ కాసిం ఘటనా స్థలాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు.