WhatsApp cyberfraud Hyderabad firm | సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఊహకందని రీతిలో భారీ దొంగతనాలు చేస్తున్నారు. ఏకంగా కోట్ల రూపాయలు ఈజీగా దోచుకుంటున్నారు. తాజాగా ఒక కంపెనీ నిధుల నుంచి ఒక దొంగ ఈజీగా రూ.2 కోట్లు కాజేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసే ఒక అకౌంట్స్ ఆఫీసర్ కి ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి మరెవరో కాదు కంపెనీ ఓనర్. ఆ మెసేజ్ వచ్చిన అకౌంట్ లో ఓనర్ ప్రొఫైల్ పిక్ కూడా ఉంది. ఆ మెసేజ్ లో రూ.1.95 కోట్లు కంపెనీ నిధులు మరొక అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి అని రాసి ఉంది. ఎందుకు చేయాలో కూడా కారణం సబబుగానే రాసి ఉంది. ఇదంతా చూసిన ఆ అకౌంట్స్ ఆఫీసర్ యథావిధిగా తాను చేసే పనిని చేసేశాడు. రూ.1.95 కోట్లు కంపెనీ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేశాడు. ఆ డబ్బులు ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ అని కారణంగా ఉండడంతో అతను అలా చేయడానికి సంకోచించలేదు.
Also Read: పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు.. వీడియోలు అడ్డం పెట్టి, ఆపై
అది చూసిన కంపెనీ యజమాని అది తన నెంబర్ కాదని.. ఎవరో తన ఫొటోని వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లో పెట్టి మోసపూరితంగా మెసేజ్ చేశారని చెప్పాడు. దీంతో ఖంగు తిన్న ఆ అకౌంట్స్ ఆఫీసర్ వెంటనే పోలీసులకు కాల్ చేయాలని సూచించాడు. వెంటనే కంపెనీ యజమాన్యం తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే ఆ లావాదేవీని నిలుపుదల చేయగలిగారు. అది కోట్లలో లావాదేవి కావడంతో బ్యాంకు ప్రక్రియ పూర్తవడంలో సమయం పడుతుంది. ఈ గడువులో గానే పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన కేసులో ఆ దొంగను ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అతని బ్యాంక్ అకౌంట్ ట్రాక్ చేశామని విచారణ జరుగుతోందని తెలిపారు.