BigTV English

Dattatreya Swami: అంతంలేని అవతారం.. దత్తాత్రేయుడు..!

Dattatreya Swami: అంతంలేని అవతారం.. దత్తాత్రేయుడు..!

 


Life History of Dattatreya

Story Of Lord Dattatreya: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన కోసం ఈ భూమ్మీద అవతరించిన అవతారమే.. దత్తాత్రేయుడు. తనను మనసారా నమ్మిన తన తన భక్తులకు సదా తోడుగా నిలిచి, వారికి అభయాన్ని ప్రసాదించే అవధూత స్వరూపుడే దత్తుడు. ఆయన అవతార విశేషాలను, చరిత్రను మనమూ తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అత్రి మహాముని, పరమ సాధ్వి అయిన అనసూయా దేవి కుమారుడే దత్తాత్రేయ స్వామి. అత్రి చేసిన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షం కాగా, మీ ముగ్గురూ కలసి ఒకేరూపంలో నాకు కుమారుడిగా జన్మించనమని అత్రి మహాముని కోరగా మార్గశిర పౌర్ణమి నాడు జన్మించిన వాడే దత్తాత్రేయ స్వామి.
కార్తవీర్యుడు, పరశురాముడు వంటి యోధులని ఆశీర్వదించిన దైవంగా, ప్రహ్లాదుడు, వశిష్ఠుడు, సమర్థ రామదాసు వంటివారి చేత పూజలందుకున్న దైవంగా దత్తా్త్రేయుడికి పేరుంది. విష్ణువు యొక్క 21 అవతారాల్లో దత్తాత్రేయుడు ఆరవ అవతారం. నమ్మిన భక్తులకు కరుణా సముద్రుడిగా నిలిచే దత్తుడు.. ఒక్కోసారి తన భక్తులను కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆయన ప్రతి మహత్తు ఒక సందేశాన్ని భక్తులకు అందిస్తుంది. సాధారణంగా ఇతర దైవాలు తాము వచ్చిన పని పూర్తిగా కాగానే.. ఆయా అవతారాలను ముగించి.. వెళ్లిపోవటం కనిపిస్తుంది. కానీ.. దత్తావతారం ముగింపు లేనిది. గురువు రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగా తన భక్తులకు అండగానే నిలుస్తాడు.

 


ఇతర అవతారాలకు ఎంతో భిన్నంగా దత్తాత్రేయుడు దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద నాలుగు వేదాలు నాలుగు శునకాలుగా కొలువుదీరి ఉంటాయి. ఆయన ఆరు చేతులు.. ఆరు శాస్త్రాలకు ప్రతీక. ఆయన కొలువై ఉండే మేడిచెట్టు (ఔదుంబర వృక్షం) విశ్వశాంతికి ప్రతీక. తన పాదాలను ఆశ్రయించి, భక్తితో వచ్చేవారికి పరమ శాంత స్వరూపుడిగా కనిపించే దత్తాత్రేయుడు.. తనను పరీక్షించాలను కోరికతో వచ్చే వారికి భయంకరంగా స్వామి దర్శనమిస్తాడని ప్రతీతి. అవధూత రూపంలో స్వామి మద్యపానం సేవించిన పిచ్చివాడిగా, శరీరమంతా చితా భస్మం పూసుకున్న తాంత్రికుడిగానూ దర్శనమిస్తాడని ఆయన చరిత్ర చెబుతోంది. అనేక సార్లు స్వామి వారు ఖండయోగం ద్వారా తన శరీర అవయవాలను వేర్వేరు చోట్ల విసిరేసినట్లూ చెబుతారు.

దత్తాత్రేయ స్వామిని యోగులకు యోగి అని పిలుస్తారు. ప్రాపంచిక బంధాలకు అతీతమైన, యోగస్థితిలో నిరంతరం నిమగ్నుడై ఉంటాడు. కనుకే ఆయన అవధూత అయ్యారు. అవధూతలు ఎవరినీ ఏమీ యాచించరు. వీరు ఆవు పాలు పితికనంత సమయమే ఏ ప్రదేశంలోనైనా ఉంటారు. కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా అందరినీ దైవాంశలుగా భావిస్తూ సాగిపోతుంటారు. స్వామి ఏ దిగులూ లేకుండా నిరంతరం బ్రహ్మనంద స్థితిలో ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలని యాదవ వంశ మూల పురుషుడైన దత్తాత్రేయుడు ఒకసారి స్వామిని ప్రశ్నిస్తాడు. దానికి ప్రకృతే తన గురువనీ, సూర్యుడు, చంద్రుడు, పావురం, పాము, సాగరం, మిడత, తేనెటీగ, ఏనుగు, తుమ్మెద, లేడి, చేప, వేశ్య తదితర 24 మంది తనకు గురువులని దత్తుడు జవాబిస్తాడు. మానవ జన్మ సాకారం కావాలంటే.. మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని గౌరవించాలని దత్తావతారం మనకు బోధిస్తుంది.

శ్రీపాద వల్లభునిగా, మాణిక్యప్రభువుగా, నృసింహసరస్వతిగా, అక్కలకోట స్వామిగా, షిరిడి సాయిబాబాగా అవతరించి తన భక్తులను కాపాడుతున్న దైవం దత్తుడే. దత్తాత్రేయ స్వామికి ప్రియమైన రోజు.. గురువారం. ఈ రోజు ఆయన నివాసముండే.. మేడి వృక్షాన్ని పూజించినా, నోరులేని మూగజీవులకు ఆయనను స్మరించి ఆహారం అందించినా, దీనులకు సాయం చేసినా.. అది నేరుగా స్వామికి చేరినట్లేనని దత్త చరిత్ర చెబుతోంది.

Tags

Related News

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Old Vishnu idol: అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి.. ఇదొక అద్భుతం.. మీరు చూసేయండి!

Hyderabad to Tirupati Bus: తిరుపతి భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. డబుల్ హ్యాపీ గ్యారంటీ

Big Stories

×