Pallavi Prashanth: రైతు బిడ్డ అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. టక్కున పల్లవి ప్రశాంత్ అనేస్తారు. ఒక రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రస్థానం ప్రారంభించి, ఏకంగా బగ్ బాస్ షో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ టార్గెట్ వైపు నడుస్తున్నాడా? త్వరలోనే సినిమా ఎంట్రీ ఖాయమేనా? తన సినీ పరిచయాలతో ఇక ఎంట్రీకి ముహూర్తం ఖరారైందని టాక్ నడుస్తోంది.
తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అద్భుతంగా మెరిసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరుగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణ వ్యక్తిగా, వ్యవసాయ కార్మికుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ప్రశాంత్ టీవీ ప్రపంచాన్ని తాకి, ఇప్పుడు వెండితెర దిశగా అడుగులు వేస్తున్నాడా? అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
2023 డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, రూ.35 లక్షల నగదు బహుమతి, రూ.15 లక్షల డైమండ్ జ్యూయలరీ, ఓ విలాసవంతమైన కారును తన సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే అతనికి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రైతు బిడ్డ అనే ట్యాగ్ అతనికి బలమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఆమడ దూరం నుంచి వచ్చిన ఓ యువకుడి కథ ప్రజలను ఆకట్టుకుంది.
అయితే విజయంతో పాటు కొన్ని వివాదాలు కూడా అతడిని చుట్టుముట్టాయి. ఫినాలే అనంతరం జరిగిన అభిమాని దాడుల ఘటనలో ప్రశాంత్ అరెస్టు కావడం, అనంతరం బెయిల్‌పై విడుదలవడం వంటి సంఘటనలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయినా, ప్రశాంత్ తన నిజమైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటూ, పేద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందిస్తూ మానవత్వాన్ని చూపించాడు.
ఇప్పుడు ప్రశాంత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్ మ్యూజిక్ వీడియోలు, చిన్న చిన్న ఈవెంట్లు, షాప్ ఓపెనింగ్‌లతోనే కాకుండా, ఓ ప్రముఖ యువ దర్శకుడితో స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నట్లు అతడి సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు కానీ, సోషల్ మీడియాలో అభిమానులు అతని సినీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
ఇటీవల తరచూ సినిమా నటులను కలవడం, అలాగే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని కాలినడక ద్వారా దర్శనం చేసుకోవడంతో త్వరలో సినిమా ఎంట్రీకి ఇవన్నీ సన్నాహాలుగా టాక్ నడుస్తోంది. అంతేకాదు మొన్నటి వరకు ఎత్తు జుట్టుతో గల ప్రశాంత్ ఇప్పుడు స్టైలిష్ గా మారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ఇందుకు ఒక కారణంగా నెటిజన్స్ అంటున్నారు.
Also Read: Miss Nigeria: ‘రాను రాను’ అంటున్న మిస్ నైజీరియా.. తెగ పాడేసింది భయ్యా!
ఇది నిజం అయితే, ప్రశాంత్ జర్నీ మరో మలుపు తిరుగుతుంది. ఒకప్పుడు పొలం దున్నిన చేతులు, ఇప్పుడు కెమెరా ముందు నటన చేయబోతున్నాయంటే ఇది నిజంగా గొప్ప మార్పు. అయినా, సినిమా రంగం అనేది అసాధారణంగా పోటీ ఉన్న వేదిక. కేవలం ఫేమ్‌తో కాదు, ప్రతిభతో ముందుకు సాగాలి. ప్రశాంత్‌కు ప్రేక్షకుల మద్దతు ఉన్నా, ఆయన నటన సామర్థ్యం ఎలా ఉంటుందన్నది చూడాల్సిన విషయం.
బిగ్ బాస్ తర్వాత తన మాట నిలబెట్టుకుంటూ సామాజిక బాధ్యతను చాటిన ప్రశాంత్, ఇప్పుడైనా తన అంచనాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా, పల్లె గాలి కోల్పోకుండా, పరిశ్రమలో తన ముద్ర వేయగలడా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. మరీ పల్లవి ప్రశాంత్ సినిమా ఎంట్రీ విషయానికి ఎప్పుడు క్లారిటీ వస్తుందో.. కానీ ఇప్పుడు ఇదే ఫుల్ టాక్.