Pakistan High Commission| భారత ప్రభుత్వం పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న ఓ అధికారిని “పర్సొనా నాన్ గ్రాటా”గా ప్రకటించి దేశం విడిచి వెళ్లాలని 24 గంటల గడువు ఇచ్చింది. ఈ చర్యకు కారణం, ఆ అధికారి భారతదేశంలో తన అధికారిక హోదాను దుర్వినియోగం చేయడం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పర్సొనా నాన్ గ్రాటా అనే దౌత్య పదాన్ని ఉపయోగించి, అతను ఇకపై భారత్‌లో ఉండే అర్హతను కోల్పోయినట్లు ప్రకటించారు. దీనిని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి’అఫైర్స్‌కు అధికారికంగా తెలియజేశారు.
ఇది ఈ నెలలో రెండవసారి పాకిస్తాన్ హైకమిషన్‌లోని అధికారిని భారత్ బహిష్కరించడమే. ముందుగా బహిష్కరించబడిన అధికారిని కూడా అదే విధంగా అనుచిత కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా దేశం విడిచిపెట్టమని చెప్పినప్పటికీ, అతని వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు.
ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” పేరిట వైమానిక దాడులు చేసింది. ఈ చర్యలతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందంతో పాక్షికంగా ఉద్రిక్తతలు తగ్గినా.. తాజాగా మరో పాక్ అధికారిని గూఢచర్య కార్యకలాపాల్లో పట్టుకోవడం మళ్లీ సమస్యను ఉత్పన్నం చేసింది.
ఈ నేపథ్యంలో ఉద్భవించిన మరో సంచలనం – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు. ట్రావెల్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ గూఢాచారి అని NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జ్యోతి వాంగ్మూలం ప్రకారం.. ఆమె తాను అమాయకురాలని చెబుతున్నా.. విచారణలో సహకరించడంలో నిర్లక్ష్యం చూపిస్తోందని అధికారులు అంటున్నారు. ఆమెను బుధవారం 7 గంటల పాటు విచారణ చేసిన ఎన్ఐఏ.. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డులు తదితర డిజిటల్ ఆధారాలు సేకరిస్తోంది.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
గతేడాది ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వీడియోలు కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించబడ్డాయి. ఈ కేసు జాతీయ భద్రతకు ప్రమాదకరమని భావించిన కేంద్రం, దర్యాప్తును ఫెడరల్ యాంటీ-టెర్రర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక బృందంలోని అధికారులు.. గూఢచర్యం, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల విశ్లేషణలో నిపుణులు.
జ్యోతి మల్హోత్రా కేసు దేశ భద్రతకు చెందిన అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఆమెపై ఉన్న ఆరోపణలు నిజమైతే, భారత్‌లో ఐఎస్ఐ (ISI) కార్యకలాపాలపై కీలక సమాచారం వెలుగు చూడవచ్చు. ప్రస్తుతం రెండు వారాల్లో 14 మంది గూఢచారులను అరెస్ట్ చేసిన తర్వాత, మరికొంతమంది వలసి ఉన్నారన్న అనుమానంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది.