Case Filed On Squid Game: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఎన్నో వెబ్ సిరీస్‌లు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేశాయి. అలాంటి వెబ్ సిరీస్‌లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్’. ఇదొక కొరియన్ వెబ్ సిరీస్ అయినా కూడా పలు ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉండడంతో ఇండియాలో కూడా ఈ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. వెబ్ సిరీస్ లవర్స్ అంతా చాలాకాలం వరకు దీని గురించే మాట్లాడుకున్నారు. అలాంటి వెబ్ సిరీస్ మేకర్స్‌పై తాజాగా ఒక ఇండియన్ దర్శకుడు కేసు ఫైల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్‌లో హాట్ టాపిక్
మూడేళ్ల క్రితం విడుదలయిన ‘స్క్విడ్ గేమ్’ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో దానికి రెండో సీజన్ కూడా విడుదలకు సిద్ధమని ఇటీవల నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇంతలోనే 2009లో విడుదలయిన తన సినిమా స్టోరీని కాపీ కొట్టి ‘స్క్విడ్ గేమ్’ను తెరకెక్కించారంటూ ఒక ఇండియన్ డైరెక్టర్ కోర్టుకెక్కారు. తన మూవీ ‘లక్’ కథ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో కేసు వేశాడు బాలీవుడ్ డైరెక్టర్ సోహం షా. దీంతో హిందీ సినీ పరిశ్రమలో ఇది చర్చనీయాంశంగా మారింది. తన మూవీ ‘లక్’లో కూడా కొంతమంది డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా రిస్క్‌తో కూడుకున్న గేమ్స్ ఆడతారని, ‘స్క్విడ్ గేమ్’ కూడా అలాంటి కథతోనే తెరకెక్కిందని సోహం షా ఆరోపిస్తున్నారు.
Also Read: దాని గురించి ఓపెన్‌గా మాట్లాడను, ఎన్నో కారణాలు ఉన్నాయి.. హేమ కమిటీపై అనన్యా పాండే స్పందన
అవార్డుల పంట
‘‘స్క్విడ్ గేమ్‌కు సంబంధించిన ముఖ్య కథ, క్యారెక్టర్లు, థీమ్స్, సెట్టింగ్, కథనం అన్నీ లక్ సినిమాకు చాలా దగ్గర పోలికలతో ఉన్నాయి. ఇదంతా తెలియక జరిగిందని అంటే నేను నమ్మను’’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు సోహం షా. 2022లో విడుదలయిన ‘స్క్విడ్ గేమ్’లో ఎమ్మీ అవార్డ్స్‌లో అవార్డ్ కూడా దక్కించుకుంది. సిరీస్ విడుదలయిన నాలుగు వారాల్లోనే 1.65 బిలియన్ స్ట్రీమింగ్ హవర్స్‌ను సంపాదించుకుంది. 2024 డిసెంబర్ 26న ఈ సిరీస్‌కు సంబంధించిన రెండో సీజన్ వస్తుందని, 2025లో మూడో సీజన్ వస్తుందని ‘స్క్విడ్ గేమ్’ మేకర్స్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు మాటిచ్చారు.
శృతి హాసన్ సినిమా
సోహం షా చేస్తున్న ఆరోపణలపై నెట్‌ఫ్లిక్స్ మేకర్స్ స్పందించారు. ‘‘వారి ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని నెట్‌ఫ్లిక్స్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ‘‘స్క్విడ్ గేమ్‌ను హువాంగ్ డాంగ్ హ్యూక్ క్రియేట్ చేశారు. అందుకే ఈ విషయాన్ని మేము ఎంతవరకు అయినా డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఛాలెంజ్ చేసింది. సోహమ్ షా తెరకెక్కించిన ‘లక్’ మూవీలో మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్, ఇమ్రాన్ ఖాన్, జావేద్ షేక్ హీరోలుగా నటించగా శృతి హాసన్ హీరోయిన్‌గా అలరించింది. అప్పట్లో ఈ మూవీ యావరేజ్‌గా హిట్‌గా నిలిచినా దీంతోనే బాలీవుడ్‌లో శృతి హాసన్ ప్రయాణం మొదలయ్యింది.