Donation For 1986 AP Floods: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు రోజులు కురిసిన వర్షాలు.. అక్కడి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసేశాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి, తినడానికి ఆహారం లేక ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అలాగే ఉంది. వారి పరిస్థితిని చూసి సినీ పరిశ్రమ చలించిపోయింది. అయితే ఇప్పుడు మాత్రమే కాదు.. 1986లో కూడా ఏపీకి ఇదే విధంగా వరదలు వచ్చాయి. అప్పుడు కూడా సినీ పరిశ్రమ అంతా కలిసికట్టుగా విరాళాలు అందించింది. తమిళ హీరోలు సైతం తెలుగు రాష్ట్రానికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. అప్పట్లో ఎవరెవరు ఎంత విరాళం అందించారు అనే వివరాలు తాజాగా బయటికొచ్చాయి.
బాలయ్య భారీ సాయం
1986లో ఏపీలో వచ్చిన వరదల్లో ప్రజలకు సాయంగా హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లు, సింగర్స్, నిర్మాతలు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతున్న జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి వారి రూ.50 వేలు విరాళంగా అందించారు. వారితో పాటు విజయశాంతి రూ.10 వేలు ఇచ్చారు. సీనియర్ హీరో కమల్ హాసన్ సైతం ఏపీకి సాయంగా రూ.50 వేలు విరాళమిచ్చారు. రజినీకాంత్ అప్పటికీ స్టార్ అవ్వకపోయినా తన వంతు సాయంగా రూ.25 వేలు అందించారు. అందరికంటే ఎక్కువగా విరాళం అందించి అప్పట్లో ఏపీ ప్రజలకు సాయంగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. అప్పట్లోనే ఆయన ఏకంగా రూ.2,50,000 విరాళంగా అందించారు.
Also Read: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!
స్టార్ కాదు
బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్‌లో విరాళం అందించిన హీరో కృష్ణంరాజు. అప్పట్లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న కృష్ణంరాజు రూ.1.05 లక్షలు ఏపీ ప్రజలకు విరాళంగా అందించారు. ఇక కృష్ణ కూడా రూ.1 లక్ష విరాళమిచ్చారు. బాలీవుడ్ హీరో జితేంద్ర సైతం ఏపీ ప్రజలకు సాయంగా రూ.1 లక్షను విరాళంగా ఇచ్చారు. అయితే ఈ వివరాలు అన్నీ చూసిన ప్రేక్షకులు.. వీరందరితో పోలిస్తే చిరంజీవి కాస్త తక్కువ విరాళమిచ్చినట్టు ఫీలవుతున్నారు. 1986 ఏపీ వరదల్లో ప్రజలకు సాయంగా ఆయన రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. అప్పట్లో చిరంజీవి ఇంకా ఈ రేంజ్‌లో స్టార్‌డమ్‌ను సంపాదించుకోలేదు. అయినా కూడా రూ.50 వేలు విరాళమివ్వడం చిన్న విషయం కాదని తన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అప్పట్లో ప్రముఖ హీరోలు, హీరోయిన్లు అందించిన విరాళాల వివరాలు:
కృష్ణంరాజు – రూ.1.05 లక్షలు
కృష్ణ – రూ.1 లక్ష
దాసరి నారాయణరావు – రూ.1 లక్ష
జితేంద్ర – రూ.1 లక్ష
రాజేశ్ ఖన్నా – రూ.1 లక్ష
చిరంజీవి – రూ.50 వేలు
జయసుధ – రూ.50 వేలు
జయప్రద – రూ.50 వేలు
రాఘవేంద్ర రావు – రూ.50 వేలు
రామానాయుడు – రూ.50 వేలు
మెగా ఫ్యామిలీ సాయం
ఇటీవల ఏపీలో వచ్చిన వరదల్లో మాత్రం మెగా ఫ్యామిలీ తమ పెద్ద మనసును చాటుకుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి రూ.1 కోటిని ఏపీతో పాటు తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలకు విరాళమిచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా రూ.6 కోట్లను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తండ్రిలాగానే రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించాడు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితులకు కూడా రూ.1 కోటి విరాళాన్ని అందించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం ఏపీ ప్రజల కోసం రూ.25 లక్షలను రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ కూడా తనవంతు సాయంగా రూ.15 లక్షలు విరాళం ప్రకటించాడు.