Rashmika Mandanna: సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు మధ్య సాన్నిహిత్య సంబంధం ఉండాలి. అలా లేకపోతే ఇద్దరికీ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే చాలావరకు రాజకీయాలు, సినిమా ఒకే పడవపై ప్రయాణిస్తుంటారు. కానీ తాజాగా యంగ్ బ్యూటీ రష్మిక మందనా మాత్రం ఫ్యూచర్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోకుండా ఒక ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించిందని ఆ ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రష్మిక మాత్రమే కాదు.. మరికొందరు యంగ్ నటీనటులపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. తను పుట్టి, పెరిగిన భాష గురించి మర్చిపోయి రష్మిక కష్టాలను కొనితెచ్చుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దురుసు ప్రవర్తన
కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ (MLA Ravi Ganiga) తాజాగా మీడియా ముందుకొచ్చారు. త్వరలో కర్ణాటకలోని బెంగుళూరులో బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్ఎఫ్) ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని నిర్వహిస్తోంది. దీనికోసం శాండిల్‌వుడ్‌లో పనిచేసే ప్రతీ యాక్టర్, ప్రతీ టెక్నీషియన్ హాజరవ్వాలని కోరుకుంటోంది. అందులో భాగంగానే కన్నడ అమ్మాయి కాబట్టి రష్మిక మందనా (Rashmika Mandanna)ను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రమ్మని ఆహ్వానం అందించింది కర్ణాటక ప్రభుత్వం. కానీ తను ఈ ఆహ్వానాన్ని స్వీకరించకుండా అందరితో దురుసుగా ప్రవర్తించిందని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు.
పరిణామాలు ఎదుర్కోవాల్సిందే
‘‘నేను ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మికను ఆహ్వానించడానికి స్వయంగా తన ఇంటికి 10, 12 సార్లు వెళ్లాను. కానీ తను రావడానికి ఇష్టపడలేదు. నా ఇల్లు హైదరాబాద్‌లోనే ఉంది. నాకు కర్ణాటక ఎక్కడో కూడా తెలియదు. పైగా నాకు రావడానికి టైమ్ కూడా లేదు అన్నట్టుగా మాట్లాడింది’’ అంటూ రష్మికపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రవి గనిగ. అంతే కాకుండా ఇలా ప్రవర్తిస్తే కచ్చితంగా దీనికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్మికకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పలు కన్నడ నటీనటులపై ఈ విషయంపైనే ఫైర్ అయ్యారు.
Also Read: ‘యానిమల్’ సీక్వెల్ నుండి మేజర్ అప్డేట్ లీక్.. సందీప్ మొత్తం రివీల్ చేశాడుగా.!
అందరికీ నిర్లక్ష్యం
తాజాగా బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Bengaluru International Film Festival)కు సంబంధించిన ప్రారంభోత్సవం తాజాగా జరిగింది. దానికి కూడా పలు కన్నడ నటీనటులు డుమ్మా కొట్టారు. అది డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar)కు నచ్చలేదు. ‘‘ఎవరి నట్స్, బోల్ట్స్ ఎలా టైట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఎలా అవసరమైన యాక్షన్ తీసుకోవాలో కూడా తెలుసు. శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఈవెంట్‌కు రాగలిగినప్పుడు.. ఇతర స్టార్లు చూపిస్తున్న నిర్లక్ష్యం చూస్తుంటే బాధేస్తుంది’’ అని వాపోయారు శివకుమార్. ఇప్పటికే రష్మిక చుట్టూ చాలా కాంట్రవర్సీలు తిరుగుతుండగా ఇప్పుడు కొత్తగా మరొకటి యాడ్ అయ్యిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.